వర్షాకాలంలోనూ నీటి ఘోష..!
దిశ , నారాయణఖేడ్: ప్రస్తుతం ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అయినప్పటికీ పలు చోట్ల నీటి ఘోష తప్పడం లేదు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరాఫరా చేసేందుకు ఇంటింటికి నల్లాలు వేసినా నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగాయి. కానీ, పీర్ల తండాలో నీటి సమస్య తీరడం లేదు. పీర్ల తండాలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా […]
దిశ , నారాయణఖేడ్: ప్రస్తుతం ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అయినప్పటికీ పలు చోట్ల నీటి ఘోష తప్పడం లేదు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరాఫరా చేసేందుకు ఇంటింటికి నల్లాలు వేసినా నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగాయి. కానీ, పీర్ల తండాలో నీటి సమస్య తీరడం లేదు.
పీర్ల తండాలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌ను నిర్మించడంతో పాటు మరో ట్యాంక్ కూడా ఉంది. ఇక మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లాలు సైతం ఏర్పాటు చేశారు. నల్లాల ద్వారా నీరు రాకపోవడంతో గిరిజనులు తండా శివారులోని బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. వారం రోజుల క్రితం నీటి కోసం వెళ్లిన ఓ మహిళ బావిలో పడగా బయటకు తీశామని గిరిజనులు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఓ వ్యక్తి ఆ బావిలో పడి చనిపోయాడని వాపోయారు. ఆ బావి వద్దకు సరైన రోడ్డు సైతం లేదని దీంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి నీటి ఘోష తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.