స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై విశాఖ మేయర్ షాకింగ్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే ఇంటి పెద్దదిక్కును కోల్పోయినట్లేనని విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రెండు రోజులపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మేయర్ హరివెంకట కుమారి నాయకత్వంలో ”మేము సైతం అంటూ” అన్ని […]
దిశ, ఏపీ బ్యూరో : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే ఇంటి పెద్దదిక్కును కోల్పోయినట్లేనని విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రెండు రోజులపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మేయర్ హరివెంకట కుమారి నాయకత్వంలో ”మేము సైతం అంటూ” అన్ని పార్టీల కార్పొరేటర్లు నిరాహార దీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని జీవీఎంసీ కౌన్సిల్‌లోనూ.. అసెంబ్లీలోనూ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తీర్మానాలను కేంద్రానికి పంపడం జరిగిందని చెప్పారు. విశాఖ ఉక్కు అంటే తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని ఆమె తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసి బాధితులను స్టీల్ ప్లాంట్ ఆదుకుందని, 1000 పడకలు ఏర్పాటు చేసి తనవంతు పాత్ర నిర్వహించిన స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దారుణమన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను వెనుక్కు తీసుకొని ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్మికులకు కేంద్రం అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. మోడీ గానీ, బీజేపీ మంత్రులు గానీ, విశాఖపట్నం వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తే.. ఆంధ్రుల సత్తా ఏమిటో నిరూపిస్తామని హెచ్చరించారు.