వర్జినిటీ టెస్ట్.. ఇట్స్ ఏ వయొలేషన్!
దిశ, ఫీచర్స్: ఓ వస్తువును మార్కెట్‌లో విడుదలచేసే ముందు.. దాంట్లో లోపాలున్నాయో లేవో తెలుసుకునేందుకు ‘ఫైనల్ చెక్’ చేస్తారు. మరి అమ్మాయిలు వస్తువులా? కాదు కదా! కానీ ఇప్పటికీ వారు పెళ్లికి ముందు ‘వర్జినిటీ’ పరీక్షలు ఎదుర్కొంటున్నారు. భారత్‌లోనే కాదు, చాలా దేశాల్లో ‘వర్జినిటీ’ని అమ్మాయిల ధర్మంగా పరిగణిస్తున్నారు. ఒక అమ్మాయి తన వివాహానికి ముందు సెక్స్ చేస్తే, ఆమె వేశ్య. అదే పని అబ్బాయి చేస్తే.. అతడు స్టడ్, చరిష్మాటిక్(ఆకర్షణీయమైనవాడు) అనే భావనే ఈ ప్రపంచంలో […]
దిశ, ఫీచర్స్: ఓ వస్తువును మార్కెట్‌లో విడుదలచేసే ముందు.. దాంట్లో లోపాలున్నాయో లేవో తెలుసుకునేందుకు ‘ఫైనల్ చెక్’ చేస్తారు. మరి అమ్మాయిలు వస్తువులా? కాదు కదా! కానీ ఇప్పటికీ వారు పెళ్లికి ముందు ‘వర్జినిటీ’ పరీక్షలు ఎదుర్కొంటున్నారు. భారత్‌లోనే కాదు, చాలా దేశాల్లో ‘వర్జినిటీ’ని అమ్మాయిల ధర్మంగా పరిగణిస్తున్నారు. ఒక అమ్మాయి తన వివాహానికి ముందు సెక్స్ చేస్తే, ఆమె వేశ్య. అదే పని అబ్బాయి చేస్తే.. అతడు స్టడ్, చరిష్మాటిక్(ఆకర్షణీయమైనవాడు) అనే భావనే ఈ ప్రపంచంలో కొనసాగుతోంది. మహిళలను మానసికంగా దెబ్బతీయడమే కాకుండా లింగ అసమానతను ప్రేరేపిస్తున్న ‘వర్జినిటీ టెస్ట్’ను ఐక్యరాజ్య సమితి కూడా ‘మానవ హక్కుల ఉల్లంఘన’గా స్పష్టం చేసింది. దాదాపు 20కి పైగా దేశాల్లో ఈ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌కు చెందిన ‘చానెల్ ఫోర్’ నిర్వహించే ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ కార్యక్రమ స్ఫూర్తితో.. ఫ్రెంచ్ చానెల్ ‘టీఎఫ్‌ఎక్స్’ ఓ రియాలిటీ షో ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘కేటలాన్ గిటాన్’ అనే తెగలోని వివాహ సంప్రదాయలను టెలికాస్ట్ చేస్తోంది. అయితే ఇందులో వర్జినిటీకి సంబంధించిన సన్నివేశాలుండటం ప్రస్తుతం వివాదాస్పదం అవుతుండగా.. ఫ్రెంచ్ ప్రభుత్వం కన్యత్వ పరీక్షలతో పాటు ఈ షోను ఖండించింది.
ట్రెండింగ్‌లో ఉన్న పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌లో లాయర్.. ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ ఓ అమ్మాయిని అడుగుతాడు? అదే ప్రశ్నను పవన్ కల్యాణ్ ‘ఆర్ యూ వర్జిన్’ అని అబ్బాయిని అడిగితే.. వెంటనే అతడి తరపు న్యాయవాది ‘అబ్జెక్షన్ యువర్ హానర్’ అని అడ్డుతగులుతాడు. దానికి ‘మీరైతే అమ్మాయిలను అడగొచ్చు.. మేమైతే అబ్బాయిలను అడక్కూడదా? ఇదేం న్యాయం నందా గారు అంటూ పవన్ సమాధానమిస్తాడు. ఇన్ఈక్వాలిటీ ఇంకా రాజ్యమేలుతుందనడానికి, కన్యత్వం అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందని చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. వివాహానికి ముందు ఆమె ఎంత స్వచ్ఛంగా ఉందో కూడా ఆ టెస్ట్ నిర్ణయిస్తుంది. వివాహమైన తర్వాత ఆమె తన శరీరంపై హక్కును కోల్పోవడమే కాదు, తన భర్త ఆస్తిగా మారుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత కూడా వర్జినిటీ టెస్ట్‌లు చేయించే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకు కారణం. ‘ఫస్ట్ నైట్’ రోజు ఆమెకు రక్తస్రావం కాకపోవడమే. ‘రక్తం’ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది’ అని ఇప్పటికే ఎంతోమంది గైనకాలిజిస్ట్‌లు ఆ విషయాన్ని తేల్చి చెప్పారు. అయినా ఈ కారణంగా.. ఎంతోమంది భర్తలు, తమ భార్యలను ఇంట్లో నుంచి తరిమేయడం లేదా చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
చట్టాల్లో ఏముంది?
భారత్‌లో కొన్నేళ్ల కిందటి వరకు అత్యాచారాలను చట్టబద్ధంగా నిర్ధారించడానికి ‘టూ ఫింగర్ టెస్ట్’ చేసేవాళ్లు. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు నిషేధించినప్పటికీ, తగినంత వైద్య సదుపాయాలు అందుబాటులో లేనప్పుడు ఇదే టెస్ట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో.. అమ్మాయి సంభోగం కోసం సమ్మతించిందా లేదా బలవంతం చేయబడిందా? అని సదరు మహిళ హైమెన్‌ను పరీక్షిస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని వైవాహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారానికి ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఉద్దేశపూర్వకంగా ఒక మహిళ హైమెన్ చెదిరిపోకుండా చేసే ఆనల్ రేప్ లేదా అత్యాచారాల గురించి కూడా ఏ దేశం మాట్లాడదు. మహారాష్ట్రలోని కంజర్‌భట్ కమ్యూనిటీలో కూడా ‘శోభన రాత్రి’ వర్జినిటీ టెస్ట్ నిర్వహించే ఆచారం ఉంది. ఫ్రాన్స్‌లో కొన్ని ముస్లిం కుటుంబాలు ఇప్పటికీ పెళ్లి కూతుళ్ల నుంచి కన్యత్వ నిరూపణ సర్టిఫికెట్లను అడుగుతుంటాయి. ప్రస్తుతం అక్కడ ఈ ఆచారం వివాదాస్పదంగా మారింది. తజకిస్థాన్, అమెరికా సహా దాదాపు 20 దేశాల్లో వర్జినిటీ టెస్ట్‌లు జరగడం శోచనీయం. కన్నెపొరను చూడటం, వేళ్లతో ముట్టుకోవడం ద్వారా ఒక మహిళ కన్య అవునా, కాదా? అన్నది తేల్చడం శాస్త్రీయమైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తేల్చి చెప్పింది.
రియాలిటీ షో
ఫ్రాన్స్‌లోని ‘కేటలాన్ గిటాన్’ అనే ఒక తెగలోని వివాహ సంప్రదాయలను ఈ రియాలిటీ షోలో చూపిస్తారు. ఈ తెగ ఆచారం ప్రకారం వివాహానికి ముందు అమ్మాయికి నిర్వహించే కన్యత్వ పరీక్షలను ‘హ్యాండ్ కర్చీఫ్’ వేడుకగా పిలుస్తారు. ఇక్కడ అమ్మాయి వర్జిన్ కాదని తెలిస్తే.. పెళ్లి ఆగిపోతుంది. ఇవే సీన్లను రియాలిటీ షోలో చూపించారు. తమ ఇంటికి వచ్చే కోడలు ఎంత పవిత్రమైందో తెలుసుకోవడానికే అబ్బాయి కుటుంబం ఈ పరీక్ష నిర్వహిస్తుందని.. దాని ప్రాధాన్యతను వివరించిన షో నిర్వాహకులు.. మగవాళ్లకు ఇలాంటి పరీక్షలు అవసరం లేదని, అతడికి అనుభవం అవసరమని చూపించడం గమనార్హం. అయితే, టీవీ షోలో ‘వర్జినిటీ’ టెస్ట్ చూపించడాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. దీనిపై ఫ్రాన్స్ మంత్రి మర్లిన్ షియప్ప ఆవేదన వ్యక్తం చేసింది. ‘జిప్సీ తెగలో కొనసాగే వర్జినిటీ టెస్ట్ సంప్రదాయాన్ని చూసి చలించిపోయాను. ఈ షో ప్రసారం చేస్తున్న ఆచారాలు దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఏకపక్షంగా దీన్ని చూపించడం దారుణం. పెళ్లికి ఇద్దరి అనుమతి ఉంటే చాలు, కన్యత్వ పరీక్షలు అవసరం లేదని ఇటీవలే ఓ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ప్రస్తుతం సెనెట్ పరిశీలనలో ఉన్న ఈ బిల్లులో డాక్టర్లు కన్యత్వ నిరూపణ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని నేరంగా పేర్కొంది. రియాలిటీ షోలు మహిళలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రోత్సహిస్తున్నాయి’ అని పేర్కొంది. ఫ్రెంచ్ టెలివిజన్‌లో వచ్చే సెక్సిజం కార్యక్రమాలపై గతంలోనూ ఆరోపణలు చేసిన మర్లిన్.. పాత ఛాందస పద్దతులను ప్రమోట్ చేస్తున్న టీవీ షోలను తప్పుబట్టింది.
మహిళలకు ‘గుడ్ క్యారెక్టర్’ అనే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరు అర్హులు? తొలి కలయికలో.. ‘బ్లడ్’ రాకపోతే? ఆమెను విమర్శించే హక్కు ఎవరికి ఉంది? దీనికి మన చట్టాలు సమాధానం చెప్పవు. సో కాల్డ్ సొసైటీ నోరు విప్పదు. అంతేకాదు హైమెన్ చాలా సున్నితమైన పొర అని.. క్రీడలు, డ్యాన్స్‌తో పాటు సైకిల్ తొక్కడం వల్ల కూడా స్త్రీలు ఆ పొరను కోల్పోతారని ఎంతోమంది వైద్యులు ఎప్పుడో కుండబద్దలు కొట్టారు. అయినా ‘వర్జినిటీ టెస్ట్’లు కొనసాగుతున్నాయి. హైమన్ పొర లేకపోవడంతో… ఓ అమ్మాయి కన్యత్వం పోయిందనే తీర్పు ఇవ్వడం సబబు కాదని, ‘వర్జినిటీ టెస్ట్’ ఆధారంగా అమ్మాయి పాత్రను అంచనా వేయడం తగదని యునైటెడ్ ఆర్గనైజేషన్ సైతం పేర్కొన్న విషయాలను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళల ‘స్వచ్ఛత’ను పరీక్షించడం పూర్తిగా అన్యాయం. సమాజంలో వారి ప్రవర్తనను నిర్వచించే సామాజిక లేబుల్ ఇకపై ఉండకూడదు. స్త్రీ తత్వానికి విలువనిస్తూ, జెండర్ సమానత్వం దిశగా మన పయనం సాగాలని ఆకాంక్షిస్తూ..