300 కుటుంబాలు.. 1,374 తాటిచెట్లు.. 12 రోజులుగా ఆందోళన

దిశ, స్టేషన్ ఘన్ పూర్: నియోజకవర్గంలోని ఉప్పుగల్లు గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో 1374 తాడి చెట్లు మునిగిపోతుండడంతో గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ రిజర్వాయర్ ద్వారా పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, రిజర్వాయర్‌లో మూడు వందల కుటుంబాల జీవనాధారమైన తాటి చెట్లు మునిగిపోతుండడంతో ఆ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. దీంతో గీత కార్మిక కుటుంబాలు రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకొని, 12 రోజులుగా ఆందోళన […]

Update: 2021-03-12 11:38 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: నియోజకవర్గంలోని ఉప్పుగల్లు గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో 1374 తాడి చెట్లు మునిగిపోతుండడంతో గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ రిజర్వాయర్ ద్వారా పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, రిజర్వాయర్‌లో మూడు వందల కుటుంబాల జీవనాధారమైన తాటి చెట్లు మునిగిపోతుండడంతో ఆ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. దీంతో గీత కార్మిక కుటుంబాలు రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకొని, 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి అధికార, ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.

గీత కార్మికుల భూమి 500 ఎకరాలు

ఉప్పుగల్లు గ్రామంలోని చౌడ చెరువు సమీపంలో 0.5 టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి జూలై 27, 2016న అప్పటి గిరిజన శాఖ మంత్రి చందూలాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 1,250 ఎకరాల భూమిని సేకరించగా.. అందులో 5 వందల ఎకరాల భూమి గీత కార్మికులది. కల్లుగీత కార్మికుల కులవృత్తి, జీవనాధారమైన 1,374 తాటి చెట్లు కూడా ఈ రిజర్వాయర్‌లో మునిగిపోతున్నాయి. దీంతో ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు రిజర్వాయర్ పనుల ప్రారంభం రోజు పనులను అడ్డుకొని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరారు.

పార్టీల మద్దతు

జీవనోపాధి కోల్పోతున్న తమకు ప్రత్యామ్నాయం చూపాలని గీత కార్మికులు చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు గీత కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించి వారికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గీత కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నిరసనకు మద్దతు ప్రకటించారు.

ప్రత్యామ్నాయం చూపాలని..

తమకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చిరిస్తున్నారు.

కుల వృత్తినే నమ్ముకున్నం : బుర్ర కొమురయ్య
పొద్దున, సాయంత్రం కల్లు అమ్ము కుంటే నాలుగు పైసలు వచ్చేవి. తాటి వనమే లేకుంటే కల్లు ఎక్కడి నుంచి వస్తది. కల్లు లేకుంటే ఇల్లు ఎలా గడుస్తది. ఇన్నాళ్లుగా కులవృత్తినే నమ్ముకుని బతుకుతున్నం.

ఎట్లా బతికేది : మూల యాదయ్య

భూమి, తాటి చెట్లు రిజర్వాయర్‌లోనే మునిగి పోతే తాము ఎట్లా బతికేది. రిజర్వాయర్‌లో మునుగిపోతున్న చెట్లకు నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కో చెట్టుకు 25 వేల చొప్పున ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. మేము మా కుటుంబాలు బతికేందుకు మార్గం దొరుకుతుంది.

20 ఎకరాలు కేటాయించాలి : నాయిని యాదగిరి, గౌడ సంఘం అధ్యక్షుడు

రిజర్వాయర్‌లో 1,374 తాటి చెట్లు రిజర్వాయర్‌లో మునిగడంతో మాకు ఉపాధి లేకుండా పోతోంది. మరో చోట తాటి, ఈత చెట్లను పెంచేందుకు 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలి.

Tags:    

Similar News