పల్లెల్లో కార్లు రయ్ రయ్..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పల్లె జనం క్రమంగా విలాస జీవనం వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కార్లు ఇప్పుడు పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త కార్ల కొనుగోలు విషయంలోనూ గ్రామీణ ప్రజలు ముందంజలో ఉన్నారని షో రూమ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామీణ వినియోగదారులు ఎక్కువగా ఖరీదైన కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాలలో ఒకప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కార్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు పల్లెల్లోనూ సెడాన్, స్పోర్ట్స్, మల్టీ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పల్లె జనం క్రమంగా విలాస జీవనం వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కార్లు ఇప్పుడు పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త కార్ల కొనుగోలు విషయంలోనూ గ్రామీణ ప్రజలు ముందంజలో ఉన్నారని షో రూమ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామీణ వినియోగదారులు ఎక్కువగా ఖరీదైన కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాలలో ఒకప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కార్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు పల్లెల్లోనూ సెడాన్, స్పోర్ట్స్, మల్టీ యుటిలిటీ కార్లు చక్కర్లు కొడుతున్నాయి. మోతుబరి రైతులు ఎక్కువగా కార్లు కొనుగోలు చేసేందుకు వస్తున్నారని అంటున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువగా కార్లు కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కార్ల వినియోగం కొంత తక్కువగానే ఉంది. రాజకీయ నేతలు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రియల్ వ్యాపారులు, విలాస జీవనానికి అలవాటు పడిన యువత ఎక్కువగా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయం ఉంది.
ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నా..
రియల్ వ్యాపారులకు భూములు అమ్ముకున్నవారితో పాటు, .అనేక మంది గ్రామీణులు కార్లు కొనేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. ఆర్థికంగా వనరులు పెద్దగా పెరగకపోయినప్పటికీ కార్ల వినియోగం పెరుగుతుండడం చూస్తే, పట్టణ వాసులకు ఏమాత్రం తీసిపోకుండా తమ జీవన శైలి ఉండాలన్న ఆలోచన గ్రామీణుల్లో పెరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. అనేక బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కార్ లోన్ వెంటనే సమకూర్చే కంపెనీల కారణంగా వినియోగం పెరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రవాణా సౌకర్యం కొరకు కారు కొంతవరకు తప్పనిసరి అవసరంగా కూడా మారింది. అందుకే చాలా మంది కార్ల కొనుగోలు మీద దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా కార్ల కొనుగోలు వైపు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.
అనుకూలంగా ఉంటుందనే..
గతంలో మా ఊర్లో ఒక్క కారు కూడా ఉండక పోయేది. ఇప్పుడు 50కి పైగా కార్లు ఉన్నాయి. వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తుంటాం. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన కార్లు ఇప్పుడు పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. మాకు మా కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయన్న కారణంగానే కొనుగోలు చేస్తున్నాం.
–నవీన్ రెడ్డి, మూటాపూర్, నిర్మల్
70 శాతం పైగా గ్రామీణ కస్టమర్లే..
రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు ఎక్కువగా పెరిగారు. కరోనా సమయంలోనూ కార్ల కొనుగోలు పెద్దగా తగ్గలేదు. గత ఏడాది మా నిర్మల్ షోరూం లో 220 కార్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 150 దాకా అమ్మాం. ఇందులో 100 గ్రామీణులే కొన్నారు. దీపావళితోపాటు ఇయర్ ఎండ్ సేల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అమ్మినా కార్లలో 70 శాతం పైగానే గ్రామీణ ప్రాంత కస్టమర్లు కొనడం చూస్తే కార్లు కొనుగోలు చేసేందుకు పల్లె ప్రజలు వెనుకాడడం లేదని అర్థమవుతోంది.