కేటీఆర్.. మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా: విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్… అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో అవగాహన ఉందా..? వ్యాక్సిన్ గంటల్లోనో… రోజుల్లోనో… ఉత్పత్తి నడిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోమవారం ఆమె ఫేస్‌బుక్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై పైర్ అయ్యారు. సాధారణంగా టీకాల తయారీకే ఏళ్లు పడుతుందని, కానీ మోదీ సర్కార్ ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్… అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో అవగాహన ఉందా..? వ్యాక్సిన్ గంటల్లోనో… రోజుల్లోనో… ఉత్పత్తి నడిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోమవారం ఆమె ఫేస్‌బుక్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై పైర్ అయ్యారు. సాధారణంగా టీకాల తయారీకే ఏళ్లు పడుతుందని, కానీ మోదీ సర్కార్ ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలతో.. దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేయడంతో నేడు ఒకటి కాదు.. రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దేశీయ టీకా తయారీతో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇది భారత్ బలానికి, శాస్త్రీయ నైపుణ్యం, ప్రతిభకు రుజువు అన్నారు.
కేంద్రానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్‌కు సరైన విజ్ఞత లేదని, ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లో కాగా, భారత్ లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ఇది అమెరికా కంటే ఎక్కువ అని, ఈ లెక్కలు తెలుసా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని, డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను భారత్ సేకరించేలా ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు. టీకా పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని, స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీని ఓర్చుకోలేకపోతున్నారా..?అని దుయ్యబట్టారు. డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ఓ సలహా మేరకు, ఉత్పత్తి సంస్థల నిబంధనల ప్రకారం కొవాగ్జిన్, కొవిషీల్డ్ విదేశాలకు అనుమతులు, ఇతర వాణిజ్యపరమైన నిబంధనల ప్రకారం పంపినవే అన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం అవివేకం అన్నారు. కేసీఆర్ కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు అని, అందుకే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారత్‌కు ఎందుకు తీసుకురావడం లేదని, కేటీఆర్ దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? దేశంలో ఒక డోసు టీకా రూ. 250 ధరకే దొరకొద్దా..? రూ. 2వేలు, రూ.3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం టీఆర్ఎస్ దుర్బుద్ధి కాదా..?అని ప్రశ్నించారు.
కరోనా టైంలో సుమారు రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ప్రైవేటు ఆస్పత్రులకు దోచిపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లు దండుకుందని దుయ్యబట్టారు. వేలమంది పేదల ప్రాణాలను బలిపెట్టి ఖజానా నింపుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై స్పందించకుండా.. టాస్క్ ఫోర్స్ అంటూ కొన్ని ఆసుపత్రులపై జులుం చూపెట్టి.. దోపిడీ చేసే పలు ప్రైవేట్ ఆసుపత్రులను చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ లక్షకోట్ల అవినీతిలో సీఎం కేసీఆర్ కుటుంబ కమీషన్ ఎంతో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 80 లక్షల డోసులను కేంద్రం తెలంగాణకు ఉచితంగానే అందజేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో, ఎంత మందికి టీకా వేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయని, కేటీఆర్ హైదరాబాద్ జనాభా అంత కూడా లేని దేశాలతో 130 కోట్ల జనాభా గల భారత్‌ను పోల్చడం మీ అవగాహనరాహిత్యానికి నిదర్శనం కాదా? అన్నారు.
రాష్ట్రానికి దొరకని వ్యాక్సిన్లు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఎట్ల దొరుకుతున్నాయని..? ప్రశ్నించారు.కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టే బదులు వ్యాక్సినేషన్ విషయంలో మీ అసమర్థతను ఒప్పుకోండని కేటీఆర్ కు సూచించారు. అసలు కరోనాపై పోరాటంలో టీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందని, టెస్టులు తక్కువ చేసి.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చూపెడుతోందని విజయశాంతి ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని కొనసాగిస్తున్నాయని, నిర్వహణ వైఫల్యంతో వ్యాక్సిన్ పెద్దమొత్తంలో వృథా చేసిందన్నారు. కరోనాపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కేటీఆర్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై నిందలు మొపుతున్నారని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.