మహిళల సాధికారతతోనే దేశాభివృద్ధి..ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిలాషించారు. 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఇందుకోసం బ్యాంకులు సైతం విరివిగా రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్‌లోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం (ఆర్.ఎస్.ఈ.టి.ఐ) నూతన భవనం కౌసల్య […]
దిశ, ఏపీ బ్యూరో: దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిలాషించారు. 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఇందుకోసం బ్యాంకులు సైతం విరివిగా రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్‌లోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం (ఆర్.ఎస్.ఈ.టి.ఐ) నూతన భవనం కౌసల్య సదనాన్ని శనివారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ మాతృమూర్తి కౌసల్యమ్మ పేరిట ఈ భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవన నిర్మాణం కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా సహకారాన్ని అందించారు. గృహిణిగా తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహించి, మహిళా సాధికారతకు నిజమైన నిదర్శనంగా నిలిచిన తన అత్తగారు పేరిట గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ప్రేరణగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ సంస్థను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపాలన్నారు. ప్రజలు సంపూర్ణంగా ఈ సంస్థ అందించే సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపావెంకట్, లోక్ సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
కౌసల్య సదనం లక్ష్యాలివే
స్వర్ణభారత్ ట్రస్ట్ బలంగా విశ్వసించి కృషి చేస్తున్న అంశాల్లో మహిళా సాధికారత అత్యంత కీలకమైనది. ఏ దేశ ప్రగతిలో అయినా మహిళలు పోషించే పాత్ర ఉన్నతమైనది. వారి సాధికారతే దేశ స్థాయిని ఉన్నతంగా నిలబెడుతుంది. ఈ నేపథ్యంలో మహిళల సాధికారత లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ట్రస్ట్‌తో కలిసి 2003లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థను స్థాపించారు.
ఈ సంస్థకోసం ప్రత్యేకంగా కౌసల్య సదనం పేరిట అన్ని సౌకర్యాలతో నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడం, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి మార్గం సుగమం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసులో ఉండి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులకు రెండు నుంచి ఆరు నెలల వ్యవధిలో వృత్తి నైపుణ్యాలను అందింస్తుంది. టాలీ, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్‌వర్కింగ్, సెల్ ఫోన్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఎలక్ట్రికల్ మోటార్ రీవైండింగ్ అండ్ మెయింటెనెన్స్, ఎయిర్ అండ్ కండిషనింగ్, రీఫ్రిజిరేషన్ మొదలైన వాటిలో శిక్షణ అందించడం జరుగుతోంది.
టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, ఎంబ్రాయిడరీ, ఫాబ్రిక్ పెయింటింగ్, అగరు బత్తీల తయారీ వంటి కోర్సుల్లో మహిళలకు శిక్షణ అందించడం జరుగుతోంది. అన్ని కోర్సులు ఉచితంగా అందించడమే గాక, శిక్షణార్ధులకు కోర్సు మెటీరియల్స్, ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉన్నాయి. ప్రోత్సాహకంగా, డే స్కాలర్‌లకు ప్రయాణ భత్యం అందజేయడం జరుగుతుంది. శిక్షణ అనంతరం ఔత్సాహికులు చిన్నపాటి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు యూనియన్ బ్యాంక్ రుణాలను అందిస్తోంది’ అని వెంకయ్యనాయుడు వెల్లడించారు.