రోశయ్య సర్వజన హితాభిలాషి.. వెంకయ్య నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాప సందేశం పంపించారు. ‘రోశయ్య పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ అంకితభావం, నిబద్ధతతో ముందుకు సాగిన రోశయ్య ఆదర్శప్రాయులు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజానేత ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టి తదనంతరం ఎమ్మెల్యేగా, ఎంపీగా, […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాప సందేశం పంపించారు. ‘రోశయ్య పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ అంకితభావం, నిబద్ధతతో ముందుకు సాగిన రోశయ్య ఆదర్శప్రాయులు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజానేత ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టి తదనంతరం ఎమ్మెల్యేగా, ఎంపీగా, వివిధ శాఖలకు రాష్ట్ర మంత్రిగా ప్రజాసమస్యల విషయంలో నిరంతర పోరాటం చేస్తూనే ఓర్పు, నేర్పుతో తాను చేపట్టిన పదవులను సమర్థవంతంగా నిర్వహించారు’ అని తెలిపారు.
అంతేకాకుండా ‘రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా కూడా హుందాగా వ్యవహరించారు. రోశయ్య నాకు చిరకాల మిత్రులు, సర్వజన హితాభిలాషి, చక్కని వక్త. వివిధ అంశాలపై స్పష్టమైన విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ప్రసంగాల్లోనూ ఎవరినీ నొప్పించకుండానే విషయాన్ని సూటిగా, స్పష్టంగా తెలియజేయడంలో సిద్ధహస్తులు. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వారికే దక్కింది. మంచి వ్యక్తిత్వం, నిగర్వి, నిరాడంబరంగా జీవించిన రోశయ్య ఇకలేరనే వార్త బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలియజేశారు.