యూరియా ఎక్కడ సారూ.?
‘‘దేశానికి కేసీఆర్ అంటే ఏందో చూపిస్త. ఇయ్యాల నేను చెప్పిందే చరిత్ర అవుతది. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అలాంటి కష్టాలు ఉండవు. వందకు వంద శాతం యూరియాను ఉచితంగా రైతులకు అందిస్తా. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా అందిస్తా. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతులకు ఉచితంగా ఎరువులు అందజేసే బాధ్యత ఈ కేసీఆర్‌దే’’ – సీఎం కేసీఆర్ 2017, ఏప్రిల్ 13న […]
‘‘దేశానికి కేసీఆర్ అంటే ఏందో చూపిస్త. ఇయ్యాల నేను చెప్పిందే చరిత్ర అవుతది. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అలాంటి కష్టాలు ఉండవు. వందకు వంద శాతం యూరియాను ఉచితంగా రైతులకు అందిస్తా. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా అందిస్తా. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతులకు ఉచితంగా ఎరువులు అందజేసే బాధ్యత ఈ కేసీఆర్‌దే’’ – సీఎం కేసీఆర్ 2017, ఏప్రిల్ 13న ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: యూరియా, పొటాష్, డీఏపీ వంటి ఎరువులను కూడా ఉచితంగా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల క్రితమే ప్రకటించారు. విత్తనాలను సబ్సిడీతో అందిస్తామన్నారు. పురుగుల మందు మాత్రం రైతులే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వంపై ఎంత భారం పడినా సరే రైతుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘ప్రభుత్వం మనది.. మన సంక్షేమం కోసమే నిర్ణయం తీసుకుంటున్నాం. తెలంగాణ రైతాంగానికి కరెంటు కోతలు ఏ మాత్రం ఉండబోవు. సప్లై ఎంత ఉన్నా నిరంతర కరెంటు అందిస్తాం. రానున్న రెండేళ్లలో నాలుగున్నర గొర్రెలను అందిస్తాం. దాంతో ఎరువులు పుష్కలంగా అందుతాయి. తెలంగాణలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తాం. వీటి వల్ల రైతులందరూ ఒకే పంట వేయకుండా.. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ అధిక దిగుబడి వచ్చేలా.. ఎవరికీ పంట నష్టం లేకుండా చూడటమే మా లక్ష్యం” అని చెప్పారు. రైతులతో ప్రగతి భవన్లో సమావేశమైనపుడు సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. దీంతో ఎరువుల కష్టాలు తప్పినట్లేనని రైతులు ఆశ పడ్డారు. హామీ నెరవేరలేదు. ఎరువుల కొరత అన్నదాతను వేధిస్తూనే ఉంది. యాసంగి పనులు మొదలుకావడంతో యూరియా కోసం రైతులు దుకాణాల వెంట తిరుగుతున్నారు. వారు నిల్వలు లేవంటూ ధరలు పెంచి అమ్ముతున్నారు.
అవసరం 15.62 లక్షలు..
యాసంగి సీజన్ మొదలైంది. రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేశారు. 15,62,520 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనాల్లో పేర్కొన్నారు. దీనిలో అగ్రస్థానం యూరియాదే. మొత్తం 7,53,40 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుంది. 1,25,619 మెట్రిక్ టన్నుల డీఏపీ, 5,08,400 మెట్రిక్ టన్నుల ఎన్పీకే, 1,13,300 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 61,661 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అవసరముంటుదని నివేదికల్లో వెల్లడించారు. మొత్తం యాసంగి సీజన్‌కు 15.62 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించనున్నారు.
ప్రతి సీజన్లో కష్టాలే..
ఎరువులు దొరక్క ప్రతి సీజన్లో రైతులు కష్టాలే పడుతున్నారు. ప్రతిసారి పుష్కలంగా ఎరువులు ఉన్నాయంటూ ముందుగానే ప్రకటించుకుంటున్న వ్యవసాయ శాఖ తీరా సమయంలో చేతులెత్తేస్తోంది. ఎరువులు దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా యూరియా కొరత తీవ్రంగా ఉంటోంది. గత వానాకాలంలో కూడా ఇదే పరిస్థితి. సీజన్ ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31వరకు రాష్ట్రానికి కేంద్రం 8.69 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించి 5.77 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని వ్యవసాయ శాఖ లెక్కల్లో పేర్కొన్నారు. 2020-21 వానాకాలానికి 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతోపాటు, 11.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు కలిపి మొత్తం 22.30 లక్షల టన్నులు అవసరం ఉండగా యూరియా సరఫరాలో మాత్రం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం దాదాపుగా చేతులెత్తేశాయి.
విడుదలలో ఆలస్యం చేయడంతో నిల్వలున్నచోట వ్యాపారులు దోపిడీకి దిగారు. సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి 5.77 లక్షల మెట్రిక్ టన్నులు రాగా సెప్టెంబర్‌లో 2.56 లక్షల మెట్రిక్ టన్నులను అత్యవసరంగా సరఫరా చేశారు. వాస్తవంగా రాష్ట్రానికి 10.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 8.33 లక్షల మెట్రిక్ టన్నులే అందుబాటు పెట్టడంతో 2.17 లక్షల మెట్రిక్ టన్నులు లోటు ఏర్పడింది. అయితే కోటా ప్రకారం సరైన సమయానికి ఇచ్చామని కేంద్రం చెబుతుండగా, సరైన సమయంలో రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొరతను సాకుగా చూపిస్తూ వ్యాపారులు ధరలు పెంచి రెండింతలు చేసి విక్రయాలు చేశారు.
ఉసురు తీసుకున్నారు..
కొన్ని ప్రాంతాల్లో రైతులు రేయింబవళ్లు యూరియా కోసం బారులు తీరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో గతేడాది యూరియా కోసం లైన్లో నిలబడి రైతు ఎల్లయ్య మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సహకార సంఘం దగ్గర ఓ మహిళా రైతు లైన్లో ఉండి సొమ్మసిల్లి మృతి చెందింది. ఇలా రైతులు యూరియా కోసం ఉసురు తీసుకున్నారు.
సర్కారు ఏం చేస్తోంది..?
ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ మూడేండ్ల కిందట ఉచితంగా యూరియా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అసలు యూరియానే రైతులకు దొరకడం లేదు. ఉచితంగా కాకున్నా అవసరం ఉన్న మేరకు అందుబాటులో పెడితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకుంటామని రైతులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్లో వరినాళ్లు మొదలయ్యాయి. కొన్నిచోట్ల నారుమళ్లు సిద్ధమయ్యాయి. అయితే ప్రస్తుతం యూరియా కొరత మళ్లీ ముందుకొచ్చింది. వాస్తవంగా ఈ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నులకు ఇప్పటికే మూడు లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 80 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని అధికారులు చెప్పుతున్నా రైతులకు మాత్రం దొరకడం లేదు. కొద్దిమేరకు నిల్వలు ఉన్నచోట్ల డీలర్లు ధరలు పెంచి అమ్ముతున్నారు. ప్రభుత్వం యూరియా బస్తాకు రూ.266.50 ధర నిర్ణయించగా ప్రైవేట్ డీలర్లు రూ.350 నుంచి రూ.380 వరకు విక్రయించారు. ఇంత ధర ఏమిటని నిలదీస్తే యూరియా దొరకడం లేదని, తీసుకుంటే తీసుకోవాలని, లేకుంటే యూరియా దొరకనట్టే అన్న పరిస్థితులను కల్పిస్తున్నారు.