నగరిలో ఉద్రిక్తత.. ఫైర్ బ్రాండ్ రోజాకు ఊహించని షాక్
దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియనివారుండరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా విపక్షాలపై మాటలతూటాలు పేల్చేవారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. అంతేకాదు రాజకీయాల్లో అన్ని అంశాలపై మంచి పట్టున్న రోజా విపక్షాలను ఢీకొట్టడంలో ముందుంటారు. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన రోజా రాజకీయాల్లో తనదైన స్టైల్‌తో దూసుకుపోతున్నారు. 2019లో మంత్రి పదవి వస్తుందని […]
దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియనివారుండరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా విపక్షాలపై మాటలతూటాలు పేల్చేవారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. అంతేకాదు రాజకీయాల్లో అన్ని అంశాలపై మంచి పట్టున్న రోజా విపక్షాలను ఢీకొట్టడంలో ముందుంటారు. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన రోజా రాజకీయాల్లో తనదైన స్టైల్‌తో దూసుకుపోతున్నారు. 2019లో మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు ఆశించారు కానీ రాలేదు. ఈసారి వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో రోజాకు అసమ్మతి సెగ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నుంచి రోజా అసమ్మతి ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే వర్గ పోరులో సైతం రోజా అసమ్మతి వర్గాన్ని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటారు. అసమ్మతి సెగను ఖంగు తినిపించారు.
అంతేకాదు హైకమాండ్ దగ్గర తన మార్క్ ప్రదర్శించారు. ఇటీవల కాలంలో అసమ్మతి వర్గం రోజాపై ఆగ్రహంగా ఉంది. ఒంటరిగా రోజాను ఏమీ చేయలేమని భావించిన అసమ్మతి వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఇటీవలే ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించాయి. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, ఆయన భార్య రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కే.జే శాంతి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడలమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, విజయపురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతి రాజులు ఈ అసమ్మతి సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నేతలను పట్టించుకోవడం లేదని అక్కసు వెళ్లగక్కారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో నిండ్ర, విజయపురం మండలాల్లో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని అందలం ఎక్కించి నగరిలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
భవిష్యత్తులోనూ సమావేశమై కార్యకలాపాలను విస్తృతం చేసి రోజాపై పార్టీ ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు సార్లు రోజాను ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశామని ఆ తప్పు ఇక చేయబోమంటూ అసమ్మతి వర్గం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల సందర్భంగా వేరు కుంపటి పెట్టాలని అసమ్మతి వర్గం భావిస్తోంది. ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో జరిగే పుట్టినరోజు వేడుకలకు ధీటుగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేతో కలిసి కాకుండా ప్రత్యేకంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరిలో లేదంటే పుత్తూరులో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి అనుకూల వర్గంతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. సీఎం జగన్ బర్త్ డే వేడుకల్లో కేజే కుమార్ నేతృత్వంలోని అసమ్మతి వర్గం ఒక అడుగు ముందుకేసింది. సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలు కొందరు దుండగులు చింపివేయడంతో కేజే కుమార్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలను చింపివేయడాన్ని నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తానికి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలో వేరే కుంపటి సెగ భవిష్యత్‌లో ఇబ్బందికరంగా మారే పరిస్థితి లేకపోలేదని తెలుస్తోంది.