శ్రీవారి భక్తులకు తీపి కబురు
తిరుమల తిరుపతి వెంకన్నకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులున్నారు. గత రెండు నెలలుగా స్వామివారి దర్శనాలు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు తీపి కబురు అందించారు. స్వామి వారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. చిన్న లడ్డూలను 50 రూపాయల నుంచి 25 రూపాయలకు ధర తగ్గించి విక్రయిస్తామని.. ఎల్లుండి నుంచి భక్తులు కోరినన్ని లడ్డూలు టీటీడీ సమాచార కేంద్రాలతో […]
తిరుమల తిరుపతి వెంకన్నకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులున్నారు. గత రెండు నెలలుగా స్వామివారి దర్శనాలు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు తీపి కబురు అందించారు. స్వామి వారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.
చిన్న లడ్డూలను 50 రూపాయల నుంచి 25 రూపాయలకు ధర తగ్గించి విక్రయిస్తామని.. ఎల్లుండి నుంచి భక్తులు కోరినన్ని లడ్డూలు టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు టీటీడీ కల్యాణ మండపాల వద్ద కొనుగోలు చేయవచ్చని తెలిపారు. రోజూ 3 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యేంత వరకూ లడ్డూ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా ప్రత్యేక ఆర్డర్‌పై స్వామి వారి లడ్డూలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
పెద్ద మొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ 9849575952, ఆలయ పేష్కార్ శ్రీనివాస్ 97010 92777ను సంప్రదించవచ్చని తెలిపారు. శ్రీవారి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు లడ్డూ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. తిరుపతిలో కోవిడ్19 ఆస్పత్రికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు టీటీడీ సాయమందిస్తుందని ఆయన ప్రకటించారు.
అలాగే 2019లో ఈ-హుండీ ఆదాయం 1.79 కోట్లు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 1.97కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనం త్వరలోనే కల్పిస్తామని భావిస్తున్నామన్న ఆయన, భక్తుల దర్శనార్థం దేవాలయం ఎప్పుడు తెరుస్తామో ఇప్పుడే చెప్పలేనన్నారు.