పక్కకు పోయిన ప్రణాళిక.. దారి మళ్లిన నిధులు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసి వాటికి తగినట్లుగా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పడిన వరదల రూపంలో చూస్తున్నాం. ప్రతీ సీజన్‌కు తగినట్లుగా, వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న సమాచారానికి అనుగుణంగా ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పాలసీయే లేకుండా పోయింది. విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్లాన్ కూడా లేదు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయినా ఆ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసి వాటికి తగినట్లుగా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పడిన వరదల రూపంలో చూస్తున్నాం. ప్రతీ సీజన్‌కు తగినట్లుగా, వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న సమాచారానికి అనుగుణంగా ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పాలసీయే లేకుండా పోయింది. విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్లాన్ కూడా లేదు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయినా ఆ దిశగా ప్రయత్నాలూ లేవు. హఠాత్తుగా వరదలు వస్తే నివారించడానికి, ఎదుర్కోడానికి, సన్నద్ధం కావడానికి అవసరమైన చర్యలూ లేవు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో SDMA (జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ) చట్టంతో ప్రతీ రాష్ట్రంలో ఎస్డీఎంఏ (స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఏర్పడ్డాయి. తెలంగాణకూ అలాంటి అథారిటీ ఉన్నా అది కాగితాలకే పరిమితమైంది. ఈ అథారిటీ తరచూ సమావేశమవుతూ ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్డ్‌నెస్ అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశమై నిర్దిష్ట యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలి. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై కార్యాచరణను రూపొందిస్తుంది.
ఐదేళ్లలో రూ. 1,514 కోట్లు..
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 1,514 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) కేంద్రం దగ్గర ఉన్న ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నుంచి మొదటి వాయిదాగా రూ. 224.50 కోట్లు విడుదలయ్యాయి. ఈ సంవత్సరానికి కేంద్రం తన వాటాగా రూ. 449 కోట్లను, రాష్ట్ర వాటాగా రూ. 150 కోట్లతో మొత్తం రూ. 599 కోట్లు కేవలం విపత్తు నిర్వహణ అవసరాలకే మంజూరయ్యాయి. 2019-20లో రూ. 333 కోట్లు కేటాయింపులు (ఇందులో రాష్ట్ర వాటా రూ. 83.25 కోట్లు) జరిగినా కేంద్రం దగ్గర ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లోంచి మొదటి విడతగా రూ. 362.62 కోట్లు, రెండవ విడతగా రూ. 124.87 కోట్లు విడుదలయ్యాయి.
ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని ఎస్డీఎంఏ కీలకమైన నివారణ, ఉపశమనం, సన్నద్ధతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణపై కేంద్రీకరించాలి. ఒకవేళ విపత్తులే చోటుచేసుకుంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు, రంగంలోకి దించడానికి పూర్తి సన్నద్ధత, శిక్షణ కలిగిన బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఇప్పటివరకు ఎస్డీఎంఏ తరఫున ఎలాంటి శిక్షణ లేదు. అలాంటి బృందాలు కూడా లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తోంది. తాజాగా సంభవించిన వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను వరద నీటి నుంచి పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయిగానీ ఒక్కచోటనైనా ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర డిజాస్టర్) బృందాలు కనిపించడంలేదు.
కేంద్రం నుంచి ఎస్డీఆర్ఎఫ్ కోసం అందిన నిధులు (కోట్ల రూ.లలో):
2015-16 – 274
2016-17 – 288
2017-18 – 302
2018-19 – 317
2019-20 – 333
2020-21 – 599 (ఇందులో రూ. 224 కోట్లు విడుదలయ్యాయి)
డిజాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వానిది నిర్లక్ష్యం:
‘‘ప్రతీ రాష్ట్రానికి ఒక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఉంటుంది. కానీ తెలంగాణలో అలాంటిది కనిపించదు. హైదరాబాద్‌లో వరదల నివారణకు 13 వాటర్ షెడ్‌లు ఉన్నాయి. వీటిని ఒక ప్రత్యేక యంత్రాంగం కిందకు తీసుకొచ్చి లక్ష్యాన్ని పూర్తిచేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ రెవెన్యూ సరిహద్దులే ప్రమాణంగా పనుల కేటాయింపు చేసుకోవడంతో అన్నీ 90% మేర జరిగాయని చెప్పుకోడానికే తప్ప మిగిలిన 10% పూర్తి కాకపోవడంతో మొత్తం ప్రాజెక్టే ఎందుకూ పనికిరాకుండా పోతోంది. పదేళ్ల కిందట భారత వాతావరణ కేంద్రం ద్వారా డాప్లర్ రాడార్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పినా దాని నుంచి వచ్చే డాటాను విశ్లేషించడం, తదనుగుణంమైన సన్నాహక చర్యలను రూపొందించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ, ఎప్పుడు, ఎంత మోతాదులో వర్షం పడుతుందో దీని ద్వారా ముందుగానే తెలుసుకునే అవకాశం ఉన్నా తాజా వర్షాల సమయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించలేదు..’’
-మర్రి శశిధర్ రెడ్డి, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్