మంత్రి మల్లారెడ్డికి నేతలతో తలనొప్పి.. మంత్రిగారు మర్చిపోయారంటూ నిరసన..
దిశ,మేడ్చల్: మంత్రి మల్లారెడ్డికి తన సొంత పార్టీ నేతలతో తలనొప్పి మొదలైంది. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని వార్డు సభ్యులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రావల్ కోల్ గ్రామంలో వెంటనే రోడ్డు వేయాలని టీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి రోడ్డు వెడల్పు పనుల కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి వార్డు సభ్యులు శుక్రవారం పాలాభిషేకం చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు […]
దిశ,మేడ్చల్: మంత్రి మల్లారెడ్డికి తన సొంత పార్టీ నేతలతో తలనొప్పి మొదలైంది. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని వార్డు సభ్యులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రావల్ కోల్ గ్రామంలో వెంటనే రోడ్డు వేయాలని టీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి రోడ్డు వెడల్పు పనుల కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి వార్డు సభ్యులు శుక్రవారం పాలాభిషేకం చేసి తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రావల్ కోల్ గ్రామం నుండి రాజ బొల్లారం వెంకటేశ్వర దేవాలయం వరకు 60 అడుగుల రోడ్డు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణానికి 2019 లో మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారని, కానీ ఇప్పటివరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి రోడ్డు విషయాన్ని మర్చిపోయారని, దాన్ని గుర్తు చేయడానికే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల సౌకర్యార్థం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావల్ కోల్ వార్డు సభ్యులు భాస్కర్, గణేష్ ,శ్రీనివాస్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.