‘గులాబీ’ నజర్.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా!
దిశ, తెలంగాణ బ్యూరో : “వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు ఇది పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ బృందం.’’ “హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఆరుగురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు, నలుగురు ఎమ్మెల్సీలు. ఇదీ పీవీ వాణీదేవి గెలుపు కోసం చెమటోడ్చుతున్న గులాబీ దళం”. రాష్ట్రంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : “వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు ఇది పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ బృందం.’’
“హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఆరుగురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు, 10 మంది జెడ్పీ చైర్మన్లు, నలుగురు ఎమ్మెల్సీలు. ఇదీ పీవీ వాణీదేవి గెలుపు కోసం చెమటోడ్చుతున్న గులాబీ దళం”.
రాష్ట్రంలో జరుగుతున్న మండలి ఎన్నికలను టీఆర్‌ఎస్ చాలా కీలకంగా తీసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలువాలనే లక్ష్యంతో క్యాడర్ పని చేస్తున్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా కేబినెట్ మొత్తం ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమైంది. ఒక్కరోజు కూడా తమ శాఖలకు చెందిన ఫైల్‌ను ముట్టుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా మండలి ప్రచారాన్ని చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గులాబీ లీడర్లు మొత్తం ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో మకాం వేశారు.
గతంలోకి వెళ్తే…
వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్‌ఎస్‌కు మండలి ఎన్నికల్లో షాక్ తగిలింది. కరీంనగర్–నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బీఫాం ప్రకటించలేదు. కానీ తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పోటీ చేయాలని సూచించారు. కానీ ప్రచారంలోకి దిగిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా వెనకరాలేదు. కేవలం ఇద్దరు సహచరులతో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. పోటీ చేయమని చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్నికలు పూర్తియ్యేసరికి మళ్లీ పలకరించలేదు. ఫలితంగా ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కు అంతే. పోటీ చేయమని చెప్పి సహకారానికి వచ్చిన వారెవ్వరూ లేరు. ఉద్యోగ సంఘాలతో కలిసి తిరిగి ప్రచారం చేసుకున్నారు. పార్టీ నేతలు కనీసం కరపత్రాలు కూడా పంపిణీ చేయలేదు. ఫలితంగా ఓటమిపాలయ్యారు. బీజేపీకి చెందిన రామచంద్రారావు గెలిచారు.
వరంగల్–నల్గొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. పూల రవీందర్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఇక్కడ మొత్తం 18,814 ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి కె.రఘోత్తంరెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు 5,462 ఓట్లు, బట్టాపురం మోహన్ రెడ్డికి 4,253 ఓట్లు, మామిడి సుధాకర్ రెడ్డికి 2,631 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్ రెడ్డికి 2,486 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుధాకర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది.
దీంతో గులాబీ గెలుపు గుర్రానికి కళ్లెం పడింది. రాష్ట్రంలో తమకు ఎదురే లేదన్నట్లుగా సాగుతున్న అధికార టీఆర్‌ఎస్‌కు ఝలక్ తగిలింది. తెలంగాణలో తమ పార్టీ మినహా ఇతర పార్టీలకు చోటు లేకుండా కేసీఆర్ నిర్వహిస్తున్న రాజకీయ యాగానికి ఉపాధ్యాయులు, పట్టభద్రులు బ్రేకు వేశారు. ఉపాధ్యాయ, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ స్థానాలను టీఆర్‌ఎస్ కోల్పోయింది.
మర్మమేమిటి…?
ప్రస్తుతం జరుగుతున్న మండలి పోరును చూస్తుంటే తెలంగాణ ఉద్యోగులు, పట్టభద్రులకు పాత ఎన్నికలు గుర్తుకు వస్తున్నాయి. రాత్రింబవళ్లు ఓట్ల కోసం కష్టపడుతున్న మంత్రులు గతంలో మండలి ఎన్నికలకు ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. ఉద్యోగ సంఘాల నేతలను కావాలనే బరిలోకి దింపి వారు ఓడినా గెలిచినా పట్టించుకోలేదు. ఉద్యో గ సంఘాల నేతలను ఒక వ్యూహం ప్రకారమే పోటీకి దింపారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు మండలి పోరులో మంత్రులు చిన్న ఉద్యోగ సంఘం దగ్గరకు వెళ్లీ మరీ బతిమిలాడుతున్నారు. టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నామంటూ ప్రకటన చేసేదాకా వదిలిపెట్టడం లేదు. ముందుగా బతిమిలాడటం అదే పనిగా వినకుంటే బెదిరించడం ఇప్పుడు గులాబీ టీం చేస్తున్న ప్లాన్ ఇదే. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు.
అయితే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు చేస్తున్న మండలి ప్రచారం, వ్యూహాల్లో కనీసం 25 శాతం చేసినా ఆ అభ్యర్థులంతా గెలిచేవారని ఉద్యోగవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కథలను చూసి దేవీప్రసాద్, చంద్రశేఖర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి వంటి నేతలకు ఎందుకు మోసం చేశారంటూ ప్రశ్నించుకుంటున్నారు.
ఇప్పుడెందుకంటే..?
టీఆర్‌ఎస్‌కు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. గతంలో ఏ ఎన్నికైనా మాదే గెలుపు అనే ధీమాతో ఉన్న గులాబీలు ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానాన్ని ఆక్రమించేందుకు పరుగు తీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పందెంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనికితోడుగా ఉద్యమ సమయంలో వెన్నంటి నిలిచిన మేధావి వర్గం మొత్తం వ్యతిరేకమై పోటీకి దిగారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇది ఇప్పుడు కూడా కొనసాగితే రాష్ట్రంలో పార్టీ పట్టు తప్పి పోతుందనే సంకేతాలు బలంగా వెళ్తాయి. దీంతో సొంత పార్టీలోనే విమర్శలు మొదలుకానున్నాయి. వ్యతిరేకించే వర్గం ఇప్పటికే సిద్ధంగా ఉన్నా కేసీఆర్‌ను చూస్తూ నోరు అదుపులో పెట్టుకుంటున్నారు.
ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు వల వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మండలి ఎన్నికల్లో కూడా ఓటమిపాలైతే పరిస్థితి చేతులు దాటుందని గులాబీ అధిష్ఠానం భావించి కేబినెట్‌ను మొత్తం మండలి ప్రచారంలో పెట్టింది. అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. హైదరాబాద్ స్థానంపై టికెట్ కేటాయింపుల్లోనే వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. పీవీ కూతురును బరిలోకి దింపింది. అటు కేసీఆర్ కోటరీలోని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరాలనేదే ఏకైక లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు.