రాజ్యసభ ఓటింగ్‌లో TRS ఎవరివైపు..?

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఇక కేంద్రంతో సమరమే’ అని టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేశవరావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, యూపీఏ కూటములు వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టినందున ఏ కూటమికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక కూటమికి మద్దతు ఇస్తుందా? లేక తటస్థంగా ఉంటుందా? లేక ఓటింగ్‌ను బహిష్కరిస్తుందా.. ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఏ కూటమికి మద్దతు […]

Update: 2020-09-14 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఇక కేంద్రంతో సమరమే’ అని టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేశవరావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, యూపీఏ కూటములు వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టినందున ఏ కూటమికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక కూటమికి మద్దతు ఇస్తుందా? లేక తటస్థంగా ఉంటుందా? లేక ఓటింగ్‌ను బహిష్కరిస్తుందా.. ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఏ కూటమికి మద్దతు ఇస్తుందనే దానిపై టీఆర్ఎస్ రాజకీయ వైఖరి తేటతెల్లం కానుంది. నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంటి కీలకమైన అనేక సమయాల్లో ఎన్డీఏకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలోనూ అలాంటి మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమాతో ఉంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అభ్యర్థి హరివంశ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత కేకేకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు తెలిసింది.

మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 244 మంది సభ్యులు ఓటు హక్కులో పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా కొద్దిమంది గైర్హాజరయ్యే అవకాశం ఉందని రాజ్యసభ వర్గాలు అనుమానిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికీ ఇద్దరు హాజరుకాకపోవచ్చని సమాచారం. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నందున మొదటి రోజునే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనున్నట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు.

ఎన్డీఏ కూటమి తరపున హరివంశ్ నారాయణ సింగ్ (జేడీయూ) పోటీ చేస్తుండగా, యూపీఏ కూటమి తరపున మనోజ్ ఝా (ఆర్‌జేడీ) పోటీ చేస్తున్నారు. అభ్యర్థి గెలుపొందడానికి 123 ఓట్లు మ్యాజిక్ ఫిగర్‌గా ఉంటుంది. కానీ ఎన్డీఏ కూటమి బలం కేవలం 117 మాత్రమే. యూపీఏ కూటమి బలం 97గా ఉంది. ఏ కూటమికీ చెందని బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. టీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకూ ఏ కూటమికి మద్దతు ఇచ్చే విషయాన్ని బహిర్గతం చేయలేదు. ఇదే విషయాన్ని ఎంపీ కేకేతో పాత్రికేయులు ప్రస్తావించగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో రాజకీయం చేయవద్దంటూ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

బిజూ జనతాదళ్ ఇప్పటికే ఎంపీలకు విప్ జారీ చేసింది. ఓటింగ్ సమయంలో సభకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా మౌఖికంగా చెప్పింది. వైఎస్సార్సీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపనుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన పీడీపీ, ఎల్‌జేడీ, ఎన్‌డీఎఫ్ లాంటి కొన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్‌తో శివసేన పొత్తులో ఉన్నప్పటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం ఎన్డీఏకే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇక జేడీఎస్ నుంచి కూడా ఒకరు ఎన్డీఏకే మద్దతు ఇచ్చేలా ఉన్నారు. ఇలాంటి ఓట్లన్నంటినీ కలిపితే ఎన్డీఏ కూటమికి సుమారు 140కు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, ఎండీఎంకే, తెలుగుదేశం లాంటి సభ్యులందరినీ కలిపినా యూపీఏ కూటమికి మాత్రం వందకు మించి వచ్చే అవకాశం లేదు. కేంద్రంతో సమరమే.. యుద్ధం అనుకున్నా ఫర్వాలేదు అని కేకే స్వయంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరి తేలిపోనుంది.

డీఎస్ దారెటు?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనే దానిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డీఎస్ దారి ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. తాను ఇప్పటికీ టీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడినే అంటూ మీడియా ప్రతినిధులు అడిగినప్పుడల్లా చెబుతున్నారు డీఎస్​. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో తన సన్నిహితుడైన ఒకరితో ‘నాకు సొంత పార్టీ నుంచి ఆదేశం రాలేదు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఏ కూటమికి మద్దతు ఇవ్వాలో తెలియదు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలనేది ఎవరూ చెప్పలేదు. ఇలాంటిప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి?’ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నిర్ణయమే తేలని గందరగోళం ఒకవైపు ఉండగానే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీల్లో ఒకరైన డీఎస్ ఓటు ఎవరికి పడుతుందనే సస్పెన్స్​గా మారింది.

Tags:    

Similar News