గులాబీ కోటలో కొత్త గుబులు.. ఆ కమిటీల పైనే వారి ఆశలు
దిశ, భద్రాచలం : చర్ల మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు గులాబీ నాయకుల నడుమ చిచ్చు రగిలించాయి. నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం పోటీపడుతున్నారు. రవికుమార్ గ్రూపుకి చెందిన నాయకుల్లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. పాత కమిటీనే కొనసాగించాలనే, అభిప్రాయంతో కొందరు ఉన్నారు. అధ్యక్షుడిని కొనసాగించినా అభ్యంతరంలేదని అయితే కార్యదర్శిని మాత్రం ఖచ్చితంగా మార్చాలని అందులోనే మరికొందరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి మండల కమిటీలో […]
దిశ, భద్రాచలం : చర్ల మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు గులాబీ నాయకుల నడుమ చిచ్చు రగిలించాయి. నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం పోటీపడుతున్నారు. రవికుమార్ గ్రూపుకి చెందిన నాయకుల్లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. పాత కమిటీనే కొనసాగించాలనే, అభిప్రాయంతో కొందరు ఉన్నారు. అధ్యక్షుడిని కొనసాగించినా అభ్యంతరంలేదని అయితే కార్యదర్శిని మాత్రం ఖచ్చితంగా మార్చాలని అందులోనే మరికొందరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి మండల కమిటీలో కొత్త వారికి అవకాశం కల్పించాలనే పట్టుదల శ్రీనివాస్ గ్రూపులో కనిపిస్తోంది. ఆ మేరకు పార్టీలో అసంతృప్తివాదులను ఈయన ఏకం చేసినట్లుగా తేలుస్తోంది.
ఎమ్మెల్సీ బాలసాని ముందే బలప్రదర్శనలు
టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీల ప్రకటన, పార్టీ అనుబంధ సంఘాల ఎన్నిక, మండల కమిటీకి అభిప్రాయ సేకరణ నిమిత్తం గురువారం చర్లలో మండల స్థాయి సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డా. తెల్లం వెంకట్రావు హాజరైనారు. ఇంతకు ముందు వేరే గ్రూపుకి అవకాశం ఇచ్చిన కారణంగా ఈసారి కమిటీలో కీలక పదవులు తమకే కేటాయించాలని పట్టుబడుతున్న శ్రీనివాస్ వర్గీయులు ప్రత్యేక వాహనాలతో సపరేట్ గ్రూపుగా వచ్చి బాలసాని, తెల్లం ముందు బలప్రదర్శన చేశారు. రెండు గ్రూపుల వారు సమావేశంలో తమ అభిప్రాయాలు చెప్పారు.
ఈ క్రమంలో గొడవలకు చోటులేకుండా ఈ సాయంత్రమే రెండు గ్రూపుల ముఖ్య నాయకులు అందరు కలిసి ఏకాభిప్రాయంతో పార్టీ అనుబంధ కమిటీలు వేసి, మండల కమిటీకి ఇష్టమైన పేర్లు ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ అధినాయకత్వం అన్ని విధాలుగా ఆలోచించి ఈనెల 20లోగా మండల కమిటీలను ప్రకటిస్తుందని ఎమ్మెల్సీ బాలసాని సర్దిచెప్పడంతో ఇరుపక్షాలు అంగీకరించారు.
సాయంత్రం సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ
సాయంత్రం ఏమౌతుందనేది చర్ల మండల టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అనుబంధ మండల కమిటీలలో తమవారికి చోటు లభిస్తే ప్రధానమైన టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలో తమ గ్రూపు నుంచి ఆశించిన వారికి పదవులు దక్కకుండా పోతాయనే భావనతో ఇరుపక్షాలు ఏమిచేయాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అవసరమైతే ఇక్కడ త్యాగం చేసి మెయిన్ కమిటీలో పట్టుబట్టి అయినా పదవులు పొందాలనే అలోచనతో రెండు గ్రూపుల నాయకులు వ్యూహప్రతివ్యూహాలతో మరి కొన్నిగంటల్లో జరగబోయే సమావేశానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది..