Viral Video : జాతీయ పక్షితో అనాగరికత హద్దులు దాటింది.. గాయపడిన నెమలి ఈకలు పీకుతున్న దృశ్యాలు!
జాతీయ పక్షి నెమలికి దేశంలో సముచిత స్థానం ఉంది. దానిపై దాడి చేయడం, గాయపర్చడం వంటివి చేస్తే చట్టరీత్యా నేరం.
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ పక్షి నెమలికి దేశంలో సముచిత స్థానం ఉంది. దానిపై దాడి చేయడం, గాయపర్చడం వంటివి చేస్తే చట్టరీత్యా నేరం. అయిన కూడా కొంతమంది దానిపై దాడి చేసి చంపిన ఘటనలు అక్కడక్కడ చూసి ఉంటాం. ఇలా చేసిన వారిపై ప్రభుత్వాలు చర్యలు కూడా తీసుకున్నాయి. తాజాగా నెమలితో అత్యంత క్రూరంగా ప్రవర్తించారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న నెమలిని కొంత మంది ప్రజలు దాని ఈకలను పీకుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా చాలా మంది అక్కడికి చేరుకుని ఈకలు పీకడం చేశారు. నెమలి మాత్రం రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు వీడియోలో కన్పిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జాతీయ పక్షిపై ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అంటూ ‘మిషన్ గ్రీన్ ముంబాయి’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా దారుడు తాజాగా వీడియో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. వీడియో చూస్తుంటే నెమలి బతికే ఉందా, చనిపోయిందా అని ఊహించలేం.. కానీ జాతీయ పక్షితో అనాగరికత హద్దులు దాటిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత కృరంగా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.