రామసేతు! చిక్కుముడి వీడినట్లేనా..? తేనెతుట్టె మళ్లీ కదిలిందా?

సముద్రంలో మునిగి ఉన్న ఒక పురాతన వంతెన రామసేతు ఉనికిని కనిపెట్టడానికి నాసా తన వంతు సాయం చేసినట్లు తాజా వార్త.

Update: 2024-08-20 15:42 GMT

సముద్రంలో మునిగి ఉన్న ఒక పురాతన వంతెన రామసేతు ఉనికిని కనిపెట్టడానికి నాసా తన వంతు సాయం చేసినట్లు తాజా వార్త. అత్యంత వివాదాస్పదంగా మారిన రామసేతు, ప్రకృతి సహజమైన నిర్మాణమా లేక మానవ నిర్మితమా లేదా పౌరాణిక కల్పనా అనే చర్చ సంవత్సరాలుగా సాగుతోంది. కానీ ఈ చర్చపై ఏకాభిప్రాయం రావడానికి వీలు లేనంత చిక్కుముళ్లు ఏర్పడిపోయాయి. పైగా పురాణ కథనంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతంలో నౌకా రవాణా విషయంలో భారీగా దూరాన్ని తగ్గించడానికి సేతుసముద్రం ప్రాజెక్టుకు 20 సంవత్సరాల క్రితమే తెరలేపారు. ఈ ప్రాజెక్టు కోసం రామసేతు ఉన్న ప్రాంతంలో కిలోమీటర్ల పొడవునా లోతుగా డ్రెడ్జింగ్ జరపాల్సి రావడంతో, ఇది స్థానికుల జీవన అవకాశాలను దెబ్బతీస్తుందని, అపారమైన జీవ వైవిధ్యం ధ్వంసమైపోతుందని పర్యావరణవేత్తలు వాదిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రామసేతు ప్రకృతి సహజంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే చర్చతోపాటు, పర్యావరణంపై సేతుసముద్ర ప్రాజెక్టు ప్రభావం గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది.

‌‌ - రాజశేఖర్​

రామాయణం ప్రకారం..

రామసేతు వంతెనకు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. వాల్మీకి రచించిన రామాయణం.. ఒక హిందూ ఇతిహాసం. ప్రసిద్ధ రామసేతు వంతెన గురించి మొదటిసారిగా రామాయణమే ప్రస్తావించింది. రాముడి ఆదేశానుసారం వానర సేన దీన్ని నిర్మించిందని పురాణగాథ. వానరులలో ఒకరైన నల... ఈ రామసేతుకు చీఫ్ ఇంజినీర్‌గా పరిగణిస్తున్నారు. రాముడు తన భార్య సీతను రావణుడి నుంచి రక్షించడానికి లంక చేరుకోవడం కోసం ఈ వంతెన నిర్మించినట్లు కథ. వంతెనను నిర్మించడానికి తేలియాడే రాళ్లను ఉపయోగించారు. ఈ రాళ్లపై శ్రీరాముడి పేరు చెక్కినందున అవి నీటిలో మునిగిపోకుండా తేలి ఉన్నాయని హిందువుల నమ్మిక. కాగా, లంకకు మార్గం కోసం వంతెన చుట్టూ ఉన్న సముద్రాన్ని రాముడు ప్రార్థించాడని, దీంతో సముద్రుడు కూడా వానరసేనకు సహకరించాడని మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.

కల్పన కాదు వాస్తవమే

నాసా ఉపగ్రహం ICESat-2 అందించిన అత్యాధునిక ఛాయాచిత్రాల ఆధారంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... రామసేతుపై ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు వంతెన కాల్పనికం కాదని, అది సముద్రంలో ఉండడం వాస్తవమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో నిర్ధారించింది. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పొడవు 29 కిలోమీటర్లు (సముద్రంలో మునిగిన వంతెన పొడవు) అని, సముద్రగర్భం నుండి ఇది 8 మీటర్ల ఎత్తులో ఉందని, ఈ వంతెన 1.5 కిలోమీటర్ల వెడల్పుతో ఉందని ఇస్రో పేర్కొంది. సముద్రంలోపల 40 అడుగుల లోతు వరకు వెళ్లే అత్యాధునిక లేజర్ బీమ్‌ని పంపించి నాసా ఉపగ్రహం అత్యంత కచ్చితమైన రిజల్యూషన్‌తో నీటిలోపలి వంతెన గుట్టు విప్పింది. కేంద్ర ప్రభుత్వం నీటి అడుగున అన్వేషణకు ఆమోదం తెలిపిన తర్వాత, నాసా పంపిన ఆరేళ్ల డేటా సహాయంతో ఇస్రో అక్కడ ఒక వంతెన ఉన్నది వాస్తవమేని ప్రకటించింది. కానీ ఈ వంతెన సహజసిద్ధంగా ఏర్పడిందా లేక దీన్ని ఎవరైనా నిర్మించారా అనేది రుజువు కావలసి ఉంది. ఈ రెండు వాదనలూ బలంగా ఉండటం విశేషం.

ప్రకృతి సహజంగా ఏర్పడిందే!

రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి కృత్రిమంగా నిర్మించింది కాదని, అది ప్రకృతి సహజంగా ఏర్పడిందని చాలా కాలంగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ వంతెన నిజానికి భారతదేశంలోని రామేశ్వరం, శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య వ్యాపించి ఉన్న సున్నపురాయి గొలుసు. ఈ సున్నపురాయి గొలుసు పొడవు 48 కి.మీ. భారతదేశంలోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ ద్వీపాలు క్రీ.పూ 7,000 నుంచి 18,000 సంవత్సరాల మధ్య సముద్ర గర్భంలోంచి ఉపరితలం పైకి ఉబికివచ్చాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ‘ప్రాజెక్ట్ రామేశ్వరం’ అనే పేరుతో ఒక అధ్యయనంలో పేర్కొంది. సముద్ర మట్టం వద్ద వివిధ సహజ తీర ప్రక్రియలు, గాలి కోత ద్వారా సంభవించే కార్యకలాపాలు, టెక్టానిక్ కదలికలు, అలల చర్య వంటివి రామేశ్వరం సమీపంలోని మండపం పట్టణం చుట్టూ ఉన్న తీర ప్రాంతంలో దీర్ఘకాలంలో పరిణామానికి దారితీశాయి. అందుకే 1480 వరకు సముద్ర మట్టానికి పైన ఉన్న రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ సహజ ప్రక్రియల ప్రభావం కారణంగా తుపాను ప్రభావంతో లోతులేని సముద్రపు నీటిలో మునిగిపోయింది.

ఇసుక మేటలే కారణమా?

సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భాగాలు నీటిలోంచి ఉపరితలంవైపు పెరగడం, కొన్ని సందర్భాల్లో కుంగిపోవడం అనే పరిణామాన్ని అవక్షేపణ, నిక్షేపణ అంటారు.గత 30 సంవత్సరాలలో, ధనుష్కోడి సమీపంలోని పాంబన్ ద్వీపంలో మార్పులను మనం గమనించవచ్చు, ఇక్కడ లోతైన విభాగంలో ఉన్న ద్వీపాలు అస్థిరంగా ఉన్నాయి, అయితే పంబన్‌కు దగ్గరగా లోతు తక్కువగా ఉన్న జలాల్లో ఇసుక ఏకీకృతం అవుతోంది. అంటే ఇసుక మేటలు పడుతుందన్నమాట. నిండుగా పారే ఏటిలో కూడా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే కొద్దీ నదిలో పాత మేటల స్థానంలో కొత్త మేటలు ఏర్పడటం నదీప్రాంతాల్లోని వారికి తెలిసిన విషయమే. సునామీ వంటి తీవ్ర వైపరీత్యాలు కలిగినప్పుడు సముద్రంలో కూడా లోతు తక్కువ ప్రాంతాల్లో కొత్త కొత్త దిబ్బలు ఏర్పడటం మనకు తెలుసు. రామసేతు ప్రాంతంలో ఇసుక సహజంగానే కిలోమీటర్ల పొడవునా పోగుపడటానికి లోతు తక్కువ జలాల్లో ఇసుక ఏకీకృతం కావడమే కారణమై ఉండవచ్చని కొందరు శాస్త్రజ్ఞుల ప్రతిపాదన. కానీ రామసేతు ఇసుక పొర లేదా మేట పైన వరుసగా సున్నపు రాతి గొలుసు ఎలా పేరుకుపోయింది అనే చిక్కుముడిని ఇంకా విప్పాల్సి ఉంది

రామసేతు మానవ నిర్మితమా?

రామసేతు లేదా ఆడమ్స్ వంతెన మానవ నిర్మితం కాదు అని 130 సంవత్సరాల క్రితం జర్మన్ పరిశోధన నిర్ధారించిన విషయాన్ని ద్రావిడ హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ ఏ. రామస్వామి ఉటంకించారు. దీని ప్రకారం జెనా యూనివర్శిటీ (జర్మనీ) ప్రొఫెసర్ డాక్టర్ జాన్స్ వాల్తేర్ 1891లో రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌పై పరిశోధన చేపట్టారు. రామసేతును రాముడి తరఫున వానరులు నిర్మించారని నమ్ముతున్నప్పటికీ, ఈ వంతెన మానవ నిర్మితమని పేర్కొనే శాస్త్రీయ రుజువు లేదు. 15వ శతాబ్దం వరకు, ఈ వంతెన సముద్ర ఉపరితలంపైనే ఉండి కాలినడకన వెళ్లేందుకు వీలుగా ఉండేది. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం, 1480 వరకు వంతెన పూర్తిగా సముద్ర మట్టానికి పైన ఉంది. అయితే, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా వంతెన పూర్తిగా లోతులేని సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ సముద్రం లోతు 30 అడుగుల లోపేనని గుర్తించాలి. ఈ ప్రాతిపదికన రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది సహజమైన సున్నపు రాయితో చేసిన వంతెన అని చెప్పవచ్చు.

జవాబు లేని ప్రశ్నలు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వంతెనపై ఉన్న రాళ్ళు 7,000 సంవత్సరాల పురాతనమైనవి, వాటి కింద ఉన్న ఇసుక మేట లేదా పొర వయస్సు 4,000 సంవత్సరాలు మాత్రమే అని కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నాయి. సముద్ర జీవుల శిలాజాల నుండి సున్నపురాయి ఏర్పడుతుంది. మిలియన్ల సంవత్సరాలలో, సముద్రపు జంతువుల పెంకులు, అస్థిపంజరాలు సముద్రపు అడుగుభాగంలో పేరుకుపోతాయి, ఒకదానికొకటి క్రిందికి నెట్టడం ద్వారా ఘన శిల ఏర్పడుతుంది. వంతెన మానవ నిర్మితమై ఉండకపోవచ్చనడానికి ఇది ఒక చిన్న సాక్ష్యంగా చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం ఒక జాతీయ టీవీ చర్చలో భాగంగా వక్తలు మాట్లాడుతూ రామసేతులో సున్నపురాళ్ల కింద ఉన్న ఇసుక పొర సహజమైనదే కావచ్చు కానీ ఆ పొర పైన పేర్చిన సున్నపు రాతి గుంటలు సహజమైనవి కావు అని పేర్కొన్నారు. ఇసుక పైన ఉన్న రాళ్ళు వాస్తవానికి ఇసుక కంటే ముందుకాలంలోనే ఉన్నాయి, వాస్తవానికి ఈ వంతెన నిర్మాణంపై జరిగిన అధ్యయనాలతోపాటు ఇండియానా యూనివర్సిటీ నార్త్‌వెస్ట్, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ సదరన్ ఒరెగాన్ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తల అధ్యయనాలను బట్టి కూడా రామసేతు మానవ నిర్మితమే అనే ప్రతిపాదనకే చాలామంది మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ వివాదంలో కనుగొనవలసింది ఇంకా ఎక్కువ ఉందని సదరన్ ఒరెగాన్ విశ్వవిద్యాలయంలో చారిత్రక పురావస్తు శాస్త్రవేత్త, అనుబంధ ఫ్యాకల్టీ సభ్యుడు చెల్సియా రోజ్ స్పష్టం చేశారు.

జీవవైవిధ్యానికి పెనుముప్పు!

సేతుసముద్రం ప్రాజెక్ట్ భారతదేశంలోని పాంబన్ ద్వీపం, శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య చిన్న మార్గాన్ని రూపొందించడానికి ఉద్దేశించబడింది. 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. సేతుసముద్రం కాలువ ప్రాజెక్టు కింద 83 కిలోమీటర్ల పొడవైన లోతైన నీటి కాలువను సృష్టించడం కోసం విస్తృతమైన డ్రెడ్జింగ్‌తోపాటు సున్నపు రాయిని తొలగించడం అవసరం. కానీ రామ సేతు అని పిలుస్తున్న వారధిపై పరిచినట్లున్న సున్నపు రాయి దిమ్మెలకు తొలి నుంచి పవిత్రతను ఆపాదిస్తూ వచ్చారు. శ్రీరాముడి చుట్టూ బలీయమైన మనోభావాలు ప్రజల్లో పాతుకుపోయి ఉన్నందున, ఆ ప్రాంతంలో నిర్మించదలిచిన సేతు సముద్రం ప్రాజెక్ట్ మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఈ ప్రాంతంలోని సముద్ర జీవవైవిధ్యానికి ముప్పు తెస్తుందని కూడా చాలామంది విమర్శించారు. స్థానికలు వృత్తి జీవనం దెబ్బతినడంతోపాటు, వేల ఏళ్లుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పగడపు దిబ్బలకు ప్రమాదం కలిగించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రామసేతును కూడా పరిరక్షించేందుకు వీలుగా పంబన్ కనుమను లోతుగా చేయడం ద్వారా సేతుసముద్రం ప్రాజెక్టును చేపట్టాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రతిష్టంభనలో ఉంది.


రామసేతును తవ్వే ఆలోచన పాతదే

తమిళనాడు తీరంలోని పంబన్ ద్వీపాన్ని శ్రీలంక తీరంలో ఉన్న మన్నార్ ద్వీపానికి కలిపే సున్నపురాయి కాలిబాటనే రామసేతు, లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. రామసేతు ఉన్న ప్రాంతంలో అంతర్జాతీయంగా వ్యూహాత్మక ఆసక్తి, ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రామసేతు వంతెన వెంట సముద్రం 3 నుండి 30 అడుగుల లోతులో మాత్రమే ఉంటుంది. అందువల్ల, ఈ మార్గంలో నౌకలు ప్రయాణించడం చేయడం అసాధ్యం. భారతదేశ తూర్పు తీరం వైపు వెళ్లే నౌకలు చెన్నై, టుటికోరిన్, వైజాగ్, పారాదీప్ మొదలైన ఓడరేవులను చేరుకోవడానికి శ్రీలంక ద్వీపం మొత్తం చుట్టుముట్టి వెళ్లాల్సి ఉంది. 19వ శతాబ్దం మొదట్లోనే బ్రిటీష్ వారు భారత తీరం వెంబడి పెద్ద ఓడలు ప్రయాణించడానికి లేదా తూర్పు, పశ్చిమ తీరాల మధ్య నావిగేట్ చేయడానికి వీలుగా రామసేతును లోతుగా తవ్వేయాలని (డ్రెడ్జ్) సర్ అర్థర్ కాటన్ కాలం నుంచి ప్లాన్ చేశారు. సూయెజ్ కాలువలాగా వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గించే ఈ డ్రెడ్జింగ్ కార్యక్రమంపై బ్రిటిష్ ప్రణాళికలు ఎప్పుడూ విజయవంతం కాలేదు. 200 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని స్వతంత్ర భారతదేశంలో సేతుసముద్రం ప్రాజెక్ట్‌గా 2005లో పునరుద్ధరించారు. ఇది ప్రారంభం నుంచి వివాదాల్లో చిక్కుకుపోయింది. రామసేతు నిర్మాణానికి, రామాయణానికి మధ్య సంబంధం ఉందని విశ్వసించే వారు ఈ ప్రతిపాదనను నిత్యం వ్యతిరేకించారు. దీంతో రామసేతును నిజంగా రాముడు నిర్మించాడా అనే చర్చ గత రెండు దశాబ్దాల్లో వేగం పుంజుకుంది.

రామసేతు రాళ్లు ఎందుకు తేలుతాయి?

చాలా మంది శాస్త్రవేత్తలు తేలియాడే రాళ్ల వెనుక రహస్యాన్ని అధ్యయనం చేసి ఛేదించడానికి ప్రయత్నించారు. తేలియాడే రాళ్ల వెనుక సైన్స్ ఉందని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. రామసేతు తేలియాడే రాతి అగ్నిపర్వత శిలలతో నిర్మించబడింది. సైన్స్ ప్రకారం, రాళ్లలో సిలికా లోపల గాలి ఉంటుంది. అవి రాళ్లుగా కనిపిస్తాయి కానీ తేలికగా ఉంటాయి. వీటిని మోయడం కూడా సులువు. ఈ దృగ్విషయం నీటిపై మంచు తేలియాడే విధానాన్ని లేదా అగ్ని పర్వతంలో అగ్నిశిలలు తేలుతున్న విధానాన్ని పోలి ఉంటుంది. ప్యూమిస్ అనేది అగ్నిపర్వతం లావాకి చెందిన గట్టిపడిన నురుగు. అగ్నిపర్వతం నుండి లావా విస్ఫోటనం చెందినప్పుడు అది బయటి చల్లని గాలితో సంకర్షణ చెందుతుంది, కొన్నిసార్లు అది రాయిలో చిక్కుకున్న గాలితో గడ్డకడుతుంది. గాలి వాల్యూమ్‌లో 90% ఈ లావా నురుగులో దూరి ఉంటుంది. అయితే, మత విశ్వాసాల ప్రకారం, వరుణుడి ఆశీర్వాదంతోపాటు వాటిపై రాముడి పేరు రాయడం వల్ల రామసేతు రాళ్లు నీటిలో మునిగిపోవు అనే వాదనకు ఇది పూర్తి భిన్నంగా ఉంది.

రామసేతు నీట మునిగిపోయిందా?

1480 వరకు, రామసేతు పూర్తిగా సముద్ర మట్టానికి పైన ఉండేదని, అయితే ఈ ప్రాంతాన్ని తాకిన పెను తుఫాను కారణంగా అది నాశనమైందని అనేక శాస్త్రీయ నివేదికలు పేర్కొన్నాయి. 15వ శతాబ్దం వరకు ఈ జలమార్గం కాలినడకన ప్రయాణించగలిగేది, తర్వాత్తర్వాత అది నీటి అడుగుకు వెళ్లిపోయింది. ఈ వంతెన గతంలో భారతదేశం, శ్రీలంకలను భూమి ద్వారా అనుసంధానించిందని సూచించడానికి భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. పరిశోధనల ప్రకారం, వంతెన సున్నపురాయి గుంటలు, పగడపు దిబ్బల సరళ శ్రేణితో కూడి ఉంది. ఇది రామేశ్వరం అంతటా కనుగొనబడిన తేలియాడే శిలలతో కూడి ఉందని ఆధారాలు కూడా ఉన్నాయి. పైగా అగ్నిపర్వత శిలలు నీటిపై తేలవచ్చు అనే నమ్మకాలు కూడా ఉన్నాయి.

రామసేతు రవాణా కారిడార్

గత లక్ష సంవత్సరాలుగా సముద్ర మట్టం తగ్గిన సమయంలో రామసేతు వంతెన భారతదేశం, శ్రీలంక మధ్య భూ సంబంధాన్ని అందించింది. నిస్సార జలాల కారణంగా, వంతెన పాక్ జలసంధి ద్వారా నావిగేషన్‌కు ఆటంకం కలిగించింది. భారతదేశం-శ్రీలంక సరిహద్దు అంతటా వాణిజ్య కార్యకలాపాలు కనీసం మొదటి సహస్రాబ్ది బీసీ నుండి జరుగుతున్నాయి, ఇది చిన్న పడవలు, డింగీలకు మాత్రమే పరిమితం చేయబడింది. 1823లో, సర్ ఆర్థర్ కాటన్ రామేశ్వరం ద్వీపం నుండి భారత ప్రధాన భూభాగాన్ని విభజించి, రామసేతు వంతెన యొక్క మొదటి లింక్‌ను ఏర్పరిచే పాంబన్ ఛానెల్‌ని సర్వే చేశారు. భౌగోళిక ఆధారాల ప్రకారం, సంవత్సరాల క్రితం భూమి కనెక్షన్ దీనికి వంతెనగా మారింది. రామనాథస్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని రికార్డుల ప్రకారం 1480లో వచ్చిన హింసాత్మక తుఫానులు లింక్‌ను దెబ్బతీశాయి. కాటన్‌ ఛానల్‌లో తప్పనిసరిగా డ్రెడ్జింగ్‌ చేసి ఓడలు వెళ్లేలా చూడాలని సూచించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ, 1828లో, మేజర్ సిమ్ కొన్ని రాళ్లను పేల్చివేయడానికి మరియు తొలగించడానికి పూనుకున్నాడు. 1837లో, రామసేతు వంతెనపై వివరణాత్మక సముద్ర సర్వే నిర్వహించబడింది. మరుసటి సంవత్సరం మార్గాన్ని తవ్వడానికి చర్యలు సిఫార్సు చేయబడ్డాయి. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, తేలికపాటి నౌకలకు తప్ప ఈ మార్గంలో పెద్ద నౌకలు ప్రయాణించేలా చేయడం సాధ్యపడలేదు.


Similar News