Viral Video : రీల్స్ పిచ్చి ముదిరితే ఇంతే! సైన్ బోర్డుపై యువకుడి పుల్ అప్స్.. స్పందించిన పోలీసులు

సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు.

Update: 2024-09-29 11:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వారి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటివి కొంత మంది చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు హైవేపై ఉండే సైన్ బోర్డు పైకి ఎక్కి పుల్ అప్స్ తీస్తూ ప్రమాదకరంగా స్టంట్లు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ సమీపంలోని జాతీయ రహాదారి 931పై జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నేపథ్యంలో ఆ యువకుడు చొక్కావిప్పి సైన్ బోర్డు రాడ్డును పట్టుకుని ప్రమాదకరంగా పుల్‌అప్స్ తీస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది.

సైన్‌బోర్డు సుమారు పది మీటర్ల ఎత్తులో అతను వేలాడుతున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అమేథీ పోలీసులు ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. వైరల్ వీడియోపై విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాగా, నెటిజన్లు దీనిపై తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చి బాగా ముదిరితే ఇలాంటి పనులే చేస్తారని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అంత ఎత్తునుంచి పుల్ అప్స్ చేస్తూ పట్టు తప్పి కింద పడితే ఇక అంతే సంగతులు అని కామెంట్లు పెడుతున్నారు.


Similar News