Biryani : ఈ నగరానికి ఏమైంది? మొన్న జెర్రీ, నిన్న సిగరెట్, నేడు బొద్దింక.. బిర్యానీలో ప్రత్యక్ష్యం!
హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్.. అలాంటిది బిర్యానీ హోటళ్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బిర్యానీ (Hyderabadi biryani) అంటే వరల్డ్ ఫేమస్.. అలాంటిది బిర్యానీ హోటళ్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నగరంలోని పలు హోటళ్లలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే జెర్రీ, కప్ప, టొబాకో కవర్, సిగరెట్ పీకలు, బొద్దింకలు లాంటివి ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల వరుసగా జరిగిన ఈ సంఘటనలు చూసి.. ఈ నగరానికి ఏమైందని బిర్యానీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. మొన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తింటుండగా.. తాగేసిన సిగరెట్ పీక కనిపించిన ఘటన అందరికీ తెలిసిందే.
తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ఓ ప్రముఖ హోటల్‌లో తింటున్న బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి.. తమ ఆహార భద్రత బృందం తనిఖీలు చేసి సమస్య పరిష్కరిస్తామని కామెంట్ చేసింది. కాగా, నగరంలో దాదాపు చిన్న హోటళ్ల నుంచి పెద్ద స్టార్ హోటళ్ల వరకు ఆహార నాణ్యత పాటించడం లేదని నెటిజన్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలు చూస్తుంటే.. హోటల్స్‌లో ఫుడ్ తినకపోవడమే మంచిదని నెటిజన్లు భావిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై దాడులు చేస్తున్నప్పటికీ యజమానులు ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.