డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇంకా తింటున్నారా? అమీర్‌పేట్ ఘటన తర్వాత మరో ఇన్సిడెంట్!
‘మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం’ ఇది క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ స్లోగన్ అందరికీ తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ‘మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం’ ఇది క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ స్లోగన్ అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవారి వరకు డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే ఈ చాక్లెట్ చుట్టూ నెట్టింట తీవ్ర వివాదం నడుస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ వద్ద క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు. తీరా కవర్ తీసి తిందామనకునే సరికి అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో ఆయన జీహెచ్ఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేసిన ఫాపుపై అధికారులు దాడులు చేశారు.
అతను కొన్న చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ అభిప్రాయపడుతూ ఇటీవల ఓ రిపోర్టు విడుదల చేసింది. డైరీ మిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని.. వీటిని తినొద్దని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
అయితే తాజాగా హైదరాబాదీ పిల్లా అనే నెటిజన్ డైరీ మిల్క్ చాక్లెట్‌ను కోనుగోలు చేశారు. తీరా తిందామని కవర్ తెరిచి చూస్తే ఫంగస్ కనిపించడంతో షాక్ అయ్యింది. ఈ క్రమంలోనే నెటిజన్ ఎక్స్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 ఉందని, తయారీ తేదీ నుంచి 12 నెలల వరకు దాని ఎక్స్‌పైరి డేట్ ఉందని పేర్కొన్నారు. కానీ చాక్లెట్ తెరిచి చూస్తే ఇలా ఉందని, దీన్ని చూడండి అంటూ డైరీ మిల్క్‌కు ట్విట్టర్‌లో ఫోటోలతో సహా ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్ లో కూడా తేడా కనిపించిందని కంపెనీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ క్యాడ్ బరీ సురక్షితం కాదని అధికారులు హెచ్చరించిన కూడా ఇంకా కొంత మంది తింటున్నారు.