తహసీల్దారు బదిలీ.. మేయర్ హస్తముందా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతోనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వ సిబ్బంది బదిలీలపై నిషేధం ఉంటుంది. అయినా, సీసీఎల్ఏ రంగారెడ్డి జిల్లా షేక్‌పేట తహసీల్దారు శ్రీనివాసరెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డిని నియమించారు. ఇప్పుడిది వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు జరగరాదనే నిబంధన ఉన్నప్పటికీ హఠాత్తుగా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతోనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వ సిబ్బంది బదిలీలపై నిషేధం ఉంటుంది. అయినా, సీసీఎల్ఏ రంగారెడ్డి జిల్లా షేక్‌పేట తహసీల్దారు శ్రీనివాసరెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డిని నియమించారు. ఇప్పుడిది వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు జరగరాదనే నిబంధన ఉన్నప్పటికీ హఠాత్తుగా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాఅధికారులు, ప్రజా ప్రతినిధుల వత్తిడి మేరకే హఠాత్తుగా ఈ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లేకుండానే ప్రభుత్వం ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
మేయర్‌తో వివాదమే కారణమా?
జీహెచ్ఎంసీ మేయర్‌గా రెండు రోజుల క్రితం ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి షేక్‌పేట్ తహసీల్దారుపై పోలీసు స్టేషన్‌లో గత నెల 20న ఫిర్యాదు చేశారు. తహసీల్దారు శ్రీనివాసరెడ్డి కూడా ఆమెపై అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం విషయంలో విజయలక్ష్మి తనతో ఫోన్‌లో మాట్లాడి సర్టిఫికెట్ ఇవ్వవద్దంటూ చెప్పారని శ్రీనివాసరెడ్డి గత నెల 20న మీడియాకు వివరించారు. అప్పుడు కార్పొరేటర్ గానే ఉన్న విజయలక్ష్మి మాత్రం కల్యాణలక్ష్మి పథకం అమలుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై మాట్లాడడం కోసమే ఫోన్ చేసినట్లు మీడియాకు చెప్పారు. ఫోన్‌లోనే తనతో వాదనకు దిగడంతో ఫోన్ కట్ చేశానని శ్రీనివాసరెడ్డి వివరించారు. కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున గద్వాల విజయలక్ష్మి రెండుసార్లు ఫోన్ చేసినా తాను ఎత్తలేదని, చివరకు ఆమె అనుచరులతో కలిసి ఆఫీసుకు వచ్చి తనను బయటకు వెళ్ళకుండా అడ్డుకుని విధి నిర్వహణకు విఘాతం కలిగించారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మేయర్ అయిన తర్వాత బదిలీ వేటు
వివాదం జరిగినప్పుడు కార్పొరేటర్‌గా మాత్రమే ఉన్న విజయలక్ష్మి ఇప్పుడు మేయర్ కావడంతో రెండు రోజుల వ్యవధిలోనే ఆయనపై బదిలీ వేటు పడడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బదిలీ జరగరాదని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 19.4.1లోని కొన్ని సబ్ క్లాజులు పేర్కొన్నప్పటికీ ప్రధాన కార్యదర్శి బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం రెవెన్యూ సిబ్బందిలోనే చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జరిగిన ఘర్షణ కారణంగానే మేయర్ హోదాలో ఇప్పుడు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి బదిలీ ఉత్తర్వులు జారీ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నా నోటీసులో లేదు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
షేక్‌పేట తహసీల్దారును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతిగానీ, ఆ స్థానంల మరొకరిని నియమించిన సంగతిగానీ నా దృష్టికి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. బదిలీ ఉత్తర్వులు కూడా నాకు అందలేదు. ఎవరిని, ఎక్కడి నుంచి ఎక్కడకు బదిలీ చేశారో నా దగ్గర సమాచారం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బదిలీలకు సంబంధించిన విషయం నా దృష్టికి రావాలి. కానీ ఆ ఉత్తర్వులు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాయో చూడకుండా నేను ఇప్పుడే చెప్పలేదు. సోమవారం ఆ ఉత్తర్వులు నాకు అందిన తర్వాత చూసి స్పష్టంగా వివరించడానికి వీలవుతుంది. తదుపరి చర్యలు తీసుకోవడంపై కూడా ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించలేను. బదిలీ జరిగినట్లు నాకు వార్తల ద్వారానే తెలిసింది. అధికారిక సమాచారం రాలేదు. సోమవారం తర్వాత ఏం చేయాలనేదానిపై నేను నిర్ణయం తీసుకోవడం వీలవుతుంది.
బదిలీపై సీరియస్‌గా స్పందిస్తాం : ట్రెసా నాయకులు
షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని అకారణంగా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సీసీఎల్‌ఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. దీని వెనక కొందరి ఒత్తిడి ఉన్నట్టు అనుమానముంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేయింబవళ్లు పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నాం. ఈ శాఖలో జరుగుతున్న పరిణామాలు మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ఇటీవల నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. కేటాయింపులో పద్ధతి పాటించలేదు. గ్రూప్ -2 ద్వారా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇప్పటికీ పోస్టింగ్స్ ఇవ్వలేదు. జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టులనూ భర్తీ చేయలేదు. సీఎం ఆదేశించినా పదోన్నతులు పూర్తి కాలేదు. కానీ బదిలీ ఉత్తర్వు మాత్రం ఆగమేఘాల మీద వచ్చేసింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం.