TPCC.. సాగర్ బై పోల్ వరకూ నిరీక్షణే..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మళ్లీ వాయిదా పడినట్టే. ఇప్పుడూ… అప్పుడూ… రాత్రి, పగలు అంటూ జరిగిన ప్రచారంపై నీళ్లు చల్లారు. పార్టీ అధినేత సోనియాగాంధీ నుంచి ప్రకటన వస్తుందని రోజంతా ఎదురుచూసిన పార్టీ శ్రేణులు మళ్లీ నిరుత్సాహంలో పడిపోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ చీఫ్ ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పటి వరకూ ఉత్తమ్‌నే టీపీసీసీ చీఫ్‌గా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాజీనామా లేఖ సమర్పించిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మళ్లీ వాయిదా పడినట్టే. ఇప్పుడూ… అప్పుడూ… రాత్రి, పగలు అంటూ జరిగిన ప్రచారంపై నీళ్లు చల్లారు. పార్టీ అధినేత సోనియాగాంధీ నుంచి ప్రకటన వస్తుందని రోజంతా ఎదురుచూసిన పార్టీ శ్రేణులు మళ్లీ నిరుత్సాహంలో పడిపోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ చీఫ్ ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పటి వరకూ ఉత్తమ్‌నే టీపీసీసీ చీఫ్‌గా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాజీనామా లేఖ సమర్పించిన ఉత్తమ్ పార్టీ పదవిని వీడటం లేదు. మరోవైపు టీపీసీసీ అంశం పార్టీలో వేడెక్కడంతో అధిష్ఠానం వాయిదా వేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
తేల్చరు.. నాన్చుడే..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఒడువని ముచ్చటగా మారింది. దాదాపు నెల రోజుల నుంచి రేపు, మాపు అంటూ సాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉత్తమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారనే అంశం తేల్చడం లేదు. దీనిపై ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్ 170 మంది పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అధిష్ఠానానికి సమర్పించి దాదాపు 25 రోజులు గడుస్తోంది. టీపీసీసీ ప్రకటన చేస్తే కొత్త నేత ఆధ్వర్యంలో పార్టీకి జవసత్వాలు వస్తాయని ఆశతో చూస్తున్న హస్తం నేతలకు నిరాశే ఎదురవుతోంది.
ఇప్పుడు సాగర్‌కు లింకు..
కాంగ్రెస్ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి అంశంలో తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల లింకు పెట్టారు. సాగర్ ఎమ్మెల్యే నోముల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక రానుంది. ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో ఇంకా ఖరారు కాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం తహతహలాడుతోంది. ఇక్కడ నుంచి జానారెడ్డిని కాంగ్రెస్ తరపున బరిలోకి దింపుతున్నట్లు ఇప్పటికే చెప్పుకుంటున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రెండేండ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఎంపీగా గెలిచిన తర్వాత ఉత్తమ్ పార్టీ పగ్గాలు వద్దంటూ అధిష్ఠానానికి విన్నవించుకున్నారు. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందనుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఉత్తమ్ అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపించారు. అనంతరం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఉత్తమ్ నాయకత్వంపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా మారుస్తారనుకున్నారు. కానీ ఆయన్నే కొనసాగించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులు సరిగా గెలవలేదు. అప్పుడు బాండ్లు తీసుకుని టికెట్లు ఇచ్చిన పద్ధతిపై విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో పార్టీ పగ్గాలు వద్దంటూ ఉత్తమ్ ప్రకటించారు. కానీ మళ్లీ పాతకథే. ఆ తర్వాత ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ఉత్తమ్ నాయకత్వమే కారణమన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ రాజీనామా లేఖను మరోసారి కోర్ కమిటీకి పంపించారు. కొత్త అధ్యక్షుడి కోసం అభిప్రాయ సేకరణ చేశారు. కానీ మళ్లీ వాయిదా వేస్తున్నట్లే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందంటూ పార్టీ నేతలు చెప్పుతున్నారు.
అంతా హైడ్రామా..
రాష్ట్ర కాంగ్రెస్‌లో హైడ్రామా నెలకొంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డికి ఖరారైందని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇస్తారంటూ రకరకాల ప్రచారం జరిగింది. ఇదే వరుసగా శ్రీధర్‌బాబు, మధుయాష్కి పేర్లు కూడా వచ్చాయి. కానీ రేవంత్‌రెడ్డికే చాన్స్ అంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇందు కోసం ఎంపీ కోమటిరెడ్డికి ఇంకో పదవి, శ్రీధర్‌బాబు, భట్టి, సీతక్క, షబ్బీర్ అలీ, కొండా సురేఖకు కూడా పార్టీలో కీలకపదవులు ఇస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు రెండు రోజుల నుంచి ప్రచారం ఊపందుకుంది. సోమవారం రాత్రే నిర్ణయం జరిగిందని, పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ సోమవారం రాత్రి సంతకం కూడా చేశారంటూ ప్రచారం జరిగింది. దీనికోసం వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం పిలిపించుకుని చర్చించిందని, ఢిల్లీకి రావాలంటూ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేయడంతో జీవన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లివచ్చారని, తాను పార్టీకి విధేయుడినని, అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని జీవన్‌రెడ్డి చెప్పారంటూ పార్టీ నేతల్లో చర్చించుకున్నారు.
అంతా బర్త్‌డే స్పెషల్సే!
జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనని, మంగళవారమే ప్రకటన వస్తుందని, జీవన్ రెడ్డికి బర్త్ డే కానుకగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకున్నాయి. చాలా మంది నేతలు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే దీనిపై జీవన్‌రెడ్డి మాత్రం ఇంకా తనకు ఏ విషయం తెలియదని, అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే బర్త్‌డే కానుక అంటూ నేతలను ఊరించారు. రేవంత్‌రెడ్డి బర్త్ డే అంటూ ఆయనకు పీసీసీ అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ బర్త్‌డే రోజున ప్రకటిస్తారనుకున్నా ఎటూ తేల్చలేదు. ఇక ఇప్పటికే పార్టీలో వర్గాలు రోడ్డెక్కాయి. రేవంత్‌రెడ్డికి ఇస్తే పార్టీలో చాలా మంది వెళ్తారని హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శించారు. వెంకట్‌రెడ్డికి ఇస్తే వ్యతిరేకించే వర్గాలు సైతం బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డికి ఇస్తే ఈ వర్గాలు నిశబ్ధంగా ఉంటాయని అనుకుంటున్నా… పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేంత దూకుడు జీవన్‌రెడ్డికి లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఏదిఏమైనా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ప్రకటన మళ్లీ వాయిదా పడినట్లేనంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల వరకు తేల్చరని, అప్పటి వరకు ఉత్తమ్‌నే కొనసాగిస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.