నగరానికి దగ్గరలో ప్రకృతి సిరులు ‘అనంతగిరులు’
దిశ, వికారాబాద్: పక్షుల కిల కిలా రావాలు.. పరవళ్లు తొక్కే సెలయేటి గలగలలు.. మైమరిపించే ప్రకృతి సోయగాలు..ఈ ప్రత్యేకతలకు ‘తెలంగాణ ఊటీ’గా పేరొందిన అనంతగిరి అడవులు ఆలవాలంగా నిలుస్తున్నాయి. ఇక ఈ అటవీ ప్రాంతంలోని ప్రతీ చెట్టు ఔషధ గుణం కలదే. అందుకే ‘అనంతగిరి కా హవా.. లాకో మరీంజోంకా దవా..’ అనే నానుడి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇక్కడి అడవుల నుంచి వీచే గాలి, లక్ష రోగాలకు మందులా పని చేస్తుందనేది దానర్థం. ఇంతటి […]
దిశ, వికారాబాద్: పక్షుల కిల కిలా రావాలు.. పరవళ్లు తొక్కే సెలయేటి గలగలలు.. మైమరిపించే ప్రకృతి సోయగాలు..ఈ ప్రత్యేకతలకు ‘తెలంగాణ ఊటీ’గా పేరొందిన అనంతగిరి అడవులు ఆలవాలంగా నిలుస్తున్నాయి. ఇక ఈ అటవీ ప్రాంతంలోని ప్రతీ చెట్టు ఔషధ గుణం కలదే. అందుకే ‘అనంతగిరి కా హవా.. లాకో మరీంజోంకా దవా..’ అనే నానుడి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇక్కడి అడవుల నుంచి వీచే గాలి, లక్ష రోగాలకు మందులా పని చేస్తుందనేది దానర్థం. ఇంతటి ప్రకృతి రమణీయతను సంతరించుకున్న ఈ ప్రాంతంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉండగా..1,300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి పర్యాటకుల తాకిడి ఎక్కువే. పైగా హైదరాబాద్ మహా నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో పర్యాటకులు, భక్తులతో కిటకిటలాడుతోంది.
అనంతగిరి నుంచి కాశీ.. సొరంగ మార్గం
మార్కండేయుని కోరిక మేరకు అనంతగిరిలో వెలసిన శ్రీ అనంత పద్మనాభునికి మార్కండేయ రుషి నిత్య పూజలుచేస్తూ ఆరాధించేవారు. ఆయన పూజల్లో విశేషంగా చెప్పుకోదగినది..ఈ సొరంగ మార్గం గుండానే కాశీ వెళ్లి, అక్కడి నుంచి తెచ్చిన గంగా జలంతో అభిషేకం చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనకు ఆనవాళ్లుగా స్వామి వారి గర్భగుడిలో అందుకు సంబంధించిన గుహ ఒకటి సాక్ష్యంగా నిలిచింది. అయితే ఆ గుహలోకి కోతులు, ఇతర జంతువులు వెళ్లి మృతిచెందుతుండటంతో ఆలయ అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. మానవాతీత శక్తులు కలిగి ఉన్నవారే ఈ మార్గం గుండా కాశీకి వెళ్లగలరని, అన్యులకు సాధ్యం కాదని ఆలయ అర్చకులు చెప్తున్నారు.
మూసీ నది జన్మస్థలం అనంతగిరిలోనే..
కృష్ణా నదికి ఉపనదిగా పిలువబడే మూసీ నది అనంతగిరి దేవాలయంలోని కోనేటి ఆవరణలోనే జన్మించింది. మూసీనది పుట్టుక సైతం ఈ ఆలయ చరిత్రతో ముడిపడి ఉంది. ద్వాపర యుగంలో కాలయవ్వనుడు అనే రాక్షసుడు ద్వారక నగరంపై దండెత్తి యాదవ సైన్యాన్ని నాశనం చేస్తాడు. కాగా కాలయవ్వనుడిని అంతం చేసే క్రమంలో ‘ముచుకుందుడు’ అనే మహర్షికి అతడు నిద్రాభంగం కలిగించేలా బలరామ కృష్ణులు వలపన్నుతారు. అది తెలియని కాలయవ్వనుడు ముచుకుందుడికి నిద్రా భంగం కలిగించగా, ఆ మహర్షి చూపులతోనే రాక్షసున్ని భస్మం చేస్తాడు. ఆ తర్వాత బలరామ కృష్ణులు ముచుకుందునికి దర్శనమివ్వగా తన్మయత్వంతో వారి పాదాలు కడిగి సాక్షాత్కారం పొందుతాడు. వారి పాదాలను కడిగిన నీళ్లే ముచుకుందా నదిగా ఉద్భవించగా.. కాలక్రమేణా మూసీ నదిగా పిలువబడుతోంది.
ఏడాదిలో రెండుసార్లు జాతర ఉత్సవాలు..
వందల ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి జాతర ఉత్సవాలు ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ఆషాడ శుద్ద ఏకాదశి, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున చిన్న జాతర, పెద్ద జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు తరలివస్తారు. ఆలయ కోనేటిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.