ఆ స్కూల్ లో అందరూ ఫెయిల్.. ఓ స్కూల్ లో ఒకరు.. మరో స్కూల్ లో ఇద్దరు మాత్రమే పాస్..
ఎస్ఎస్సీ బోర్డు బుధవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని మూడు పాఠశాలలు అద్వాన్నంగా ఫలితాలు సాధించాయి.
దిశ, నవాబుపేట: ఎస్ఎస్సీ బోర్డు బుధవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని మూడు పాఠశాలలు అద్వాన్నంగా ఫలితాలు సాధించాయి. పోమాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 29 విద్యార్థులలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. కొల్లూరు పాఠశాలలో చదివిన 45 మందిలో ఒక్కరు మాత్రమే పాస్ కావడం, చౌడూర్ పాఠశాలలో చదివిన 28 మంది విద్యార్థులలో ఇద్దరు మాత్రమే పాస్ కావడం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత అధ్వాన్నంగా విద్యావ్యవస్థ ఉందో అర్థమవుతుంది.
మండలంలో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక కస్తూరిబా విద్యాలయంతో సహా మొత్తం 12 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో అత్తెసరు మార్కులతో 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఫలితాలు ఈ విధంగా వచ్చాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఫలితాలు ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.