ఇన్‌స్టాలో దుమ్ములేపుతోన్న ఓ వృద్ధ జంట
దిశ, ఫీచర్స్ : మనమంతా సోషల్ మీడియా యుగంలో నివసిస్తున్నాం. ఇక్కడ ఎవరి లైఫ్‌కు వాళ్లే హీరో. ఎవరి స్టైల్‌కు వాళ్లే మేకర్స్. ఈ వేదికపై ఎవరైనా ఓవర్‌నైట్ స్టార్ అయిపోవచ్చు. వయసు, ప్రాంతం, కులం, మతం, భాష ఏ అడ్డంకులు లేవిక్కడ. ఎవరో తొక్కేస్తారన్న అనుమానులేం లేవు. హ్యాపీగా మనం ఇష్టమైనవి చేసుకోవచ్చు. ఈ రూల్సే ఫాలో అయిపోతూ ఓ వృద్ధ జంట ఇన్‌స్టాలో దుమ్ములేపుతోంది. ఫ్యాషన్ దుస్తుల్లో కుర్రకారుకు పోటినిస్తూ.. మీమ్స్, జోక్స్, ఫన్నీ […]
దిశ, ఫీచర్స్ : మనమంతా సోషల్ మీడియా యుగంలో నివసిస్తున్నాం. ఇక్కడ ఎవరి లైఫ్‌కు వాళ్లే హీరో. ఎవరి స్టైల్‌కు వాళ్లే మేకర్స్. ఈ వేదికపై ఎవరైనా ఓవర్‌నైట్ స్టార్ అయిపోవచ్చు. వయసు, ప్రాంతం, కులం, మతం, భాష ఏ అడ్డంకులు లేవిక్కడ. ఎవరో తొక్కేస్తారన్న అనుమానులేం లేవు. హ్యాపీగా మనం ఇష్టమైనవి చేసుకోవచ్చు. ఈ రూల్సే ఫాలో అయిపోతూ ఓ వృద్ధ జంట ఇన్‌స్టాలో దుమ్ములేపుతోంది. ఫ్యాషన్ దుస్తుల్లో కుర్రకారుకు పోటినిస్తూ.. మీమ్స్, జోక్స్, ఫన్నీ వీడియోస్ చేస్తూ 76ఏళ్ల బామ్మ, 82 ఏళ్ల తాత ఇద్దరూ కలిసి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. స్టీరియోటైప్స్ బద్దలు కొడుతూ మిస్టర్ అండ్ మిసెస్ వర్మ చేస్తున్న అల్లరి పనులేంటో చూసేద్దాం.
హర్యానాలోని కల్కాలో నివసించే మిస్టర్ అండ్ మిసెస్ వర్మ గురించి నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ 2020 లాక్‌డౌన్ ఈ వృద్దజంటను సోషల్ మీడియాలో పాపులర్ చేసింది. ఈ క్రమంలోనే 82ఏళ్ల యశ్‌పాల్ సింగ్, 76 సంవత్సరాల శాంత వర్మలు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మారిపోయారు. అయితే వీళ్లు ఇలా పాపులర్ అవడానికి ప్రధాన కారకురాలు వాళ్ల మనమరాలు 22 ఏళ్ల జోనిట. వాళ్ల తాత యశ్‌పాల్ ప్రతిభను ప్రదర్శించడానికి జోనిట ‘గ్యాంగ్‌స్టా గ్రాండ్‌పా’ అనే పేజీని గత ఏడాది ఏప్రిల్‌లో ఓపెన్ చేసింది. ఇందులో తొలిగా యశ్‌పాల్ డ్యాన్స్ వీడియోలను షేర్ చేయగా మంచి అప్లాజ్ వచ్చింది. అయితే తాతయ్య సలహాతో వాళ్ల నానమ్మపై కూడా వీడియోలు తీయడం ప్రారంభించింది జోనిట. దాంతో గ్యాంగ్‌స్టా గ్రాండ్‌పా కాస్త ‘మిస్టర్ అండ్ మిసెస్ వర్మ’ పేజీగా మారిపోయింది. ఈ పేజీలోని వీడియోలలో ప్రాంక్స్, ప్రముఖ సోషల్ మీడియా ట్రెండ్స్, ట్రాన్సిషన్ క్లిప్స్, హ్యుమరస్, ఫ్యాషన్ కంటెంట్ ఇందులో ఉంటాయి. వీరి ఇన్‌స్టా అకౌంట్‌కు 16వేల ఫాలోవర్స్ ఉన్నారు.
‘మా నానమ్మ ఎంతో చలాకీ, ఆమె ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆమెలో మనోజ్ఞతను కలిగి ఉంటుంది. నా కంటే బట్టలు ఆమెపై చాలా మెరుగ్గా కనిపించే సందర్భాలు ఉన్నాయి. ఆమెతో ఫ్యాషన్ వేర్, ట్రెడిషనల్ రెండూ ప్రయత్నిస్తున్నాను. జీన్స్, జాకెట్లు, చీరలు ఆమెకు అన్నీ నప్పుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ రియల్ మోడల్. ఇక ఈ పేజీని ప్రారంభించడానికి లాక్‌డౌన్ కారణం కాగా, మా గ్రాండ్ పేరేంట్స్ మమ్మల్ని అలరించడానికి ఇదొక మార్గంలా కనిపించింది. వాళ్లు కూడా వీడియోలో భాగం కావడాన్ని ఇష్టపడ్డారు. మా పేరెంట్స్ కూడా వారితో కలిసి వీడియోలను సమకూర్చడంలో సహాయపడ్డారు’ అని జోనిట వివరించింది. తాను మొదట్లో కొంచెం ఇబ్బందిపడటంతో పాటు సిగ్గుపడ్డానని.. తర్వాత నా మనవరాలు చెప్పినట్లు చేశానని యశ్ తెలిపాడు. 40 ఏళ్ళకు పైగా రెగ్యులర్ ఉద్యోగం గడిపిన తరువాత ఈ వయసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రను పోషించడం ఆనందిస్తున్నానని యశ్ పేర్కొన్నాడు.
‘నా 15వ ఏటనే నాకు పెళ్లయింది. నేను నా పిల్లలను చూసుకోవటానికి, ఇంటిని చక్కదిద్దడానికే నా శక్తిని ఖర్చు చేశాను. మా కాలంలో సోషల్ మీడియా లేదు. కాబట్టి మాకు కెమెరా ముందు నిలిచే అవకాశం రాలేదు. అంతేకాదు మా తరంలో మేము చీరకట్టు, సంప్రదాయ దుస్తులకే పరిమితమయ్యాం. నాకు వెస్ట్రన్ స్టైల్ క్లాతింగ్ ధరించే అవకాశం ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం నేను దాన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను. ముఖ్యంగా నేను ప్రయత్నించే దుస్తులు. అవి అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. నేను వాటిని ఇష్టపడుతున్నాను. కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఎప్పుడైనా మన కలలకు రెక్కలు తొడగవచ్చు. వయసు ఓ సంఖ్య మాత్రమే అని గుర్తుపెట్టుకోండి’ అని శాంత వర్మ తెలిపింది.