తెలంగాణలో 206 కేసులు.. 10 మంది మృతి
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కేసులు గణనీయంగా పెరుగుతాయంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి అభిప్రాయపడిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో 206 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 152 కేసులు ఉండగా, ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 18 చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ శనివారం […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కేసులు గణనీయంగా పెరుగుతాయంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి అభిప్రాయపడిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో 206 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 152 కేసులు ఉండగా, ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 18 చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ శనివారం మాత్రం ఏకంగా ఐదు కొత్త కేసులు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైతం ఇంతకాలం కరోనా రహిత జిల్లాగా ఉండగా ఇప్పుడు ఒక కేసు ఉనికిలోకి వచ్చింది. వనపర్తి, వరంగల్ రూరల్ లాంటి అతి కొద్ది జిల్లాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి లేదు. దాదాపు మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రతీరోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటలకు ఏకంగా పది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 123కు, మొత్తం కేసుల సంఖ్య 3,496కు చేరుకుంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,048 స్థానికంగా వచ్చినవికాగా, 448 మాత్రం వలస కార్మికులు, విదేశాల నుంచి విమానాల్లో వచ్చినవారికి చెందినవి. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను పటిష్టంగా అమలుచేసేంతవరకూ అదుపులో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఈ నెల 18 నుంచి ఆంక్షలను సడలించిన తర్వాత క్రమంగా పెరిగాయి. చివరకు ఎన్నడూ లేనంతగా 206 కొత్త కేసులు నమోదయ్యే స్థాయికి కరోనా వ్యాప్తి తీవ్రమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో చికిత్స అందించడానికి గాంధీ ఆసుపత్రిలో బెడ్‌లు సరిపోకపోవడంతో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి నుంచి అదనంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడడం, వారితో కాంటాక్టులో ఉన్నవారు క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
కొత్తగా మూడు వేల మంది వైద్య సిబ్బందిని సమకూర్చుకుంటున్నట్లు మంత్రి ప్రకటించినా, దాదాపు 300 మంది రెండు రోజుల వ్యవధిలోనే విధులకు దూరం కావాల్సి వచ్చింది. కరోనా పేషెంట్లు పెరిగే క్రమంలో మరింతమంది వైద్య సిబ్బంది అవసరం ఏర్పడుతుండగా ఐసొలేషన్, క్వారంటైన్ కారణంగా విధులకు దూరం కావడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కలవరానికి గురిచేస్తోంది. జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆలయాలు యధావిధిగా పనిచేయడం ప్రారంభిస్తే పాజిటివ్ కేసులు ఇంకెంతగా పెరుగుతాయో అనే ఆందోళన అటు ప్రజల్లోనూ, ఇటు వైద్యారోగ్య సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. ఇక కేసులు మరింతగా పెరుగుతూ జిల్లాలకు కూడా వ్యాపించడం రాష్ట్ర ప్రభుత్వానికి సంకటంగా మారింది.