ఇల్లే వేదికగా.. ఈ-కామర్స్ బిజినెస్‌

దిశ, ఫీచర్స్ : ‘ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే.. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే’ అనే మాటల్లో నిజం లేకపోలేదు. ఒకరి లక్ష్యం కోసం పనిచేయడమా? లేక మన జీవితాశయమే ధ్యేయంగా ముందుకు సాగిపోవడమా? అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్లారిటీ తెచ్చుకోవడం ప్రధానమే అయినా, అసలు ‘సొంత బిజినెస్’ ఎక్కడ? ఎలా ప్రారంభించాలన్నది కూడా ముఖ్యమే. పైగా కొవిడ్ టైమ్‌లో ఇది మరింత రిస్క్‌ అనే అనుమానమూ లేకపోలేదు. దీనికి చక్కని పరిష్కారమే ‘ఈ […]

Update: 2021-04-19 23:03 GMT

దిశ, ఫీచర్స్ : ‘ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే.. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే’ అనే మాటల్లో నిజం లేకపోలేదు. ఒకరి లక్ష్యం కోసం పనిచేయడమా? లేక మన జీవితాశయమే ధ్యేయంగా ముందుకు సాగిపోవడమా? అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్లారిటీ తెచ్చుకోవడం ప్రధానమే అయినా, అసలు ‘సొంత బిజినెస్’ ఎక్కడ? ఎలా ప్రారంభించాలన్నది కూడా ముఖ్యమే. పైగా కొవిడ్ టైమ్‌లో ఇది మరింత రిస్క్‌ అనే అనుమానమూ లేకపోలేదు. దీనికి చక్కని పరిష్కారమే ‘ఈ కామర్స్’ బిజినెస్. ఇదంతా డిఫరెంట్ సెటప్ అయినప్పటికీ ఇంటినే కార్యాలయంగా మలచుకుని ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మరి ఈ-కామర్స్ ఎలా ప్రారంభించాలి? ఇందులో ట్రాఫిక్ పెంచుకొని డబ్బు ఎలా సంపాదించాలి? వంటి అంశాలపై ఎక్స్‌పెర్ట్స్ అందిస్తున్న టిప్స్ తెలుసుకుందాం.

ఒక రూపాయి వస్తువును మార్కెట్‌లోకి తీసుకురావాలన్నా సరే.. మార్కెట్ రీసెర్చ్ తప్పనిసరి. బిగ్ బ్రాండ్స్ మొదలు, లోకల్ ప్రొడక్ట్స్ వరకు అందరూ ఈ సూత్రాన్నే పాటిస్తారు. అలాగే ఈ కామర్స్ బిజినెస్‌కు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. టిక్‌టాక్, వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను గమనిస్తే, చాలామంది ఆయా వేదికలపై తమ ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజానికి బహిరంగ మార్కెట్‌‌తో పోలిస్తే.. ఆన్‌లైన్‌లో బిజినెస్ స్టార్ట్ చేయడం కాస్త సులభం. అంతేకాదు పెట్టుబడి అవసరమూ తక్కువే. అయితే ఈ-కామర్స్ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడంతో పాటు ట్రెండింగ్ ఉత్పత్తులను ఎలా కనుగొనాలో, టార్గెట్ కస్టమర్స్‌ను ఎలా చేరుకోవాలో తెలుసుకోవడం అత్యంత ప్రధానం. ఒకవేళ ఆన్‌లైన్ వ్యాపారం, మార్కెటింగ్ గురించి తెలియకపోతే.. ఖచ్చితంగా ఎంతో కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఉపయోగపడే రిసోర్స్(ఫేస్‌బుక్ బిజినెస్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్) చాలానే ఉన్నాయి. ఈ-కామర్స్ రన్ చేసే ప్రాథమిక అంశాలపై ఈ తరహా రిసోర్సెస్ అవగాహన కల్పిస్తాయి.

చూజ్ నిచ్

నిచ్ అంటే.. మార్కెట్‌లో ఓ ప్రత్యేక విభాగానికి చెందిన ఒక నిర్దిష్ట రకం ఉత్పత్తి లేదా సేవ. ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు.. మనం తీసుకోవాల్సిన తొలి స్టెప్ ‘నిచ్’ను ఎంచుకోవడం. ‘స్పెసిఫైడ్ నిచ్’ కలిగి ఉండటం వల్ల కస్టమర్స్‌ను మరింత సులభంగా పెంచుకోవచ్చు. అంతేకాదు స్పాన్సర్స్‌, అడ్వర్టైజర్స్‌తో కనెక్ట్ కావడం, కంటెంట్ క్రియేషన్ కూడా ఈజీ అవుతుంది. ఉదాహరణకు ఫిట్‌నెస్ నిచ్గా ఎంచుకుంటే.. యోగా, యోగా కోర్సెస్, ఫిట్‌నెస్ గేర్, హోమ్ వర్కవుట్స్, పర్సనల్ ట్రైనింగ్, వెయిట్ లాస్ వంటి విషయాలు ఈ కేటగిరిలోకి వస్తాయి. అలానే ఉమెన్ షూస్ తీసుకుంటే.. వర్కవుట్ షూస్, రన్నింగ్, ట్రెక్కింగ్, నర్సులు, ట్రాన్స్‌జెండర్ పీపుల్, ప్లస్ సైజ్డ్ వంటి వాటిని దీంట్లో సేల్ చేయొచ్చు. దీనివల్ల ఐడియల్ కస్టమర్స్‌ను గుర్తించగలుగుతాం. మార్కెట్‌లో వేలాది నిచ్లు ఉంటాయి. కానీ మనకంటూ ఓ స్పెసిఫిక్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి, ప్రత్యేకతను చాటుకోవడానికి ‘నిచ్’ ఎంపిక చాలా ముఖ్యం. అలాగని అన్ని రకాల ‘నిచ్’లు లాభదాయకమైన ఆన్‌లైన్ వ్యాపారాన్ని సృష్టించవు. అందుకే ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న లేదా ప్రజల ఆసక్తికి అనుగుణంగా ఉన్న ప్రొడక్ట్స్‌పైనే దృష్టి సారించాలి.

బిజినెస్ మోడల్?

నిచ్ తర్వాత, బిజినెస్ మోడల్ గురించి ఆలోచించాలి. ఓ పది సంవత్సరాల ముందు మనం బట్టలు కొనడానికి ఎక్కడికి వెళ్లాం? కిరాణా సామగ్రి ఎలా తెచ్చుకునేవాళ్లం? కానీ ఈ రోజుల్లో ‘ఈ-కామర్స్’ మనం షాపింగ్ చేసే విధానాన్ని మార్చేసింది. ఇది ‘బిజినెస్ టు కస్టమర్’ అనే బిజినెస్ మోడల్‌కు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందులో మరో మూడో టైప్స్ ఉన్నాయి. బిజినెస్ టు బిజినెస్(ఒక వ్యాపారం దాని ఉత్పత్తిని లేదా సేవను మరొక వ్యాపారానికి విక్రయిస్తుంది), కన్జ్యూమర్ టు బిజినెస్(తమ వస్తు సేవలను అమ్మడానికి సంస్థలు వ్యక్తులను అనుమతిస్తాయి), కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ (C2C వ్యాపారం.. వినియోగదారులకు ఒకరితో ఒకరు వ్యాపారం నిర్వహించడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తుంది). ‘సీ2సీ’ని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అని కూడా అంటారు. ఈబే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లు B2C, C2Cగానూ పనిచేస్తాయి.

సోషల్ మీడియా మార్కెటింగ్

మన వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో అనేక రకాలుగా పెంచుకోవడానికి, మార్కెట్ చేయడానికి.. సోషల్ మీడియా ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన మార్గాల్లో ఒకటి. ఈ ప్రక్రియలో అదనపు డబ్బు ఖర్చు చేయకుండా, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదారులకు తక్షణ యాక్సెస్ పొందడానికి ఇంతకన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. సమర్థవంతమైన హ్యాష్‌ట్యాగ్‌లు, కంటెంట్ క్రియేషన్ స్ట్రాటజీ అమలు చేస్తే ఈ కామర్స్ సైట్స్ వేగంగా న్యూ కస్టమర్స్‌ను ఆకట్టుకోవచ్చు. బ్రాండ్ అవేర్‌నెస్, ప్రమోషన్ చాలా ముఖ్యం. ట్రాఫిక్ పెంచుకోవడానికి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ప్రకటనలు ఇవ్వడం వల్ల టార్గెట్ కస్టమర్స్‌ను ఈజీగా పొందొచ్చు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వినియోగదారుల్లో ఎక్కువమంది మిలీనియల్స్ లేదా జెన్ జెడ్. వీరిని ఆకట్టుకోవాలంటే కాస్త సృజనాత్మకంగా ఆలోచించి ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. పింట‌రెస్ట్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. సో వాళ్లను అట్రాక్ట్ చేస్తే ట్రాఫిక్ ఈజీగా పెరుగుతుంది. ఇక లింక్డ్ఇన్‌లో వెల్ ఎడ్యుకేట్స్ ఉంటారు. వారిని ఆలోచింపజేసేలా ప్రొడక్ట్ యాడ్ ఉండాలి.

ఎవరైనా వ్యాపారం సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే ప్రారంభిస్తారు తప్ప నష్టాలు చవిచూస్తామనే నిరాశతో కాదు. అయితే అందుకు ఉత్తమ ప్రణాళిక‌లు ఉండాలి. ఊహించిన విధంగా జరగకపోయినా.. ఖాతాదారులను సంతృప్తికరంగా ఉంచడానికి మరింత ఉత్తమంగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కరోజులోనే అంతా మారిపోదు. వచ్చిన అవరోధాలను దాటుకుంటూ బిజినెస్ పెంచే మార్గాలను అన్వేషిస్తూ ముందుకు పోవాలి.

Tags:    

Similar News