అధికారులు ఎస్కేప్.. రాక రాక పెద్దపులి వస్తే వేటగాళ్లకు వదిలేస్తారా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : పెద్దపులి మృతి కేసు తమ మెడకు చుట్టుకోకుండా అటవీ అధికారులు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా..? తమ తప్పిదం బయటకు పొక్కకుండా ఉండేందుకు పులి అంతం ఘటననే మార్చేశారా..? అసలు పెద్దపులి సంచరిస్తున్నట్టు కనీస సమాచారం కూడా వారి వద్ద లేదా..? గతంలో సంచరించినట్టుగా ఆనవాళ్లు లభించినా అందుకు తగ్గట్లుగా పరిరక్షణ ఏర్పాట్లకు చర్యలు తీసుకోలేదా.? అంటే ఏజెన్సీ వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఘటన జరిగిన తీరును తమకు ఇబ్బంది కలగకుండా […]
దిశ ప్రతినిధి, వరంగల్ : పెద్దపులి మృతి కేసు తమ మెడకు చుట్టుకోకుండా అటవీ అధికారులు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా..? తమ తప్పిదం బయటకు పొక్కకుండా ఉండేందుకు పులి అంతం ఘటననే మార్చేశారా..? అసలు పెద్దపులి సంచరిస్తున్నట్టు కనీస సమాచారం కూడా వారి వద్ద లేదా..? గతంలో సంచరించినట్టుగా ఆనవాళ్లు లభించినా అందుకు తగ్గట్లుగా పరిరక్షణ ఏర్పాట్లకు చర్యలు తీసుకోలేదా.? అంటే ఏజెన్సీ వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఘటన జరిగిన తీరును తమకు ఇబ్బంది కలగకుండా అటవీ అధికారులు మార్చి మీడియాకు వివరించినట్టుగా తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసలేం జరిగిందంటే..?
ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు తాడ్వాయి మండలం కోడిశాల గుంఫు, చింతల కటాపూర్ తండాల్లో నివాసముంటున్నారు. కూలీ నాలి చేసుకోవడం, అడవిలో దొరికే కొన్నిరకాల ఉత్పత్తులతో పాటు వేట వీరి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఉచ్చులు పెట్టి అటవీ జంతువులను సంహరిస్తుంటారు. ఈ జంతువుల మాంసాన్ని సమీప గ్రామాల్లో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే గత నెలలో అటవీలో ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఆ ఉచ్చులో అటుగా వచ్చిన పెద్దపులి చిక్కుకుని చనిపోయింది. ఈ విషయాన్ని వారు సైతం ఆలస్యంగా గుర్తించారు. పెద్దపులి చర్మానికి, గోర్లకు డిమాండ్ ఉందని భావించిన వారు వాటిని భద్రపరుచుకున్నారు. పులి మాంసాన్ని కూడా సమీప గ్రామంలో జింక మాంసంగా పేర్కొంటూ విక్రయించినట్లుగా తెలుస్తోంది.
ఎలా బయటకు వచ్చిందంటే..?
నాలుగు రోజుల కిందట తాడ్వాయి మండలంలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అటుగా వెళ్లిన పోలీస్ ప్రత్యేక బృందాలకు పెద్దపులి కళేబరం కనిపించింది. ఆ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. పెద్దపులి సంచారానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం స్థానిక అధికారుల వద్ద లేదని భావించిన ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం బయటకు వస్తే స్థానిక అధికారులకే కాదు శాఖ పనితీరుపైనే విమర్శలు వస్తాయని భావించిన ఉన్నతాధికారులు చాలా జాగ్రత్తగా ఘటన జరిగిన తీరును తమకు ఇబ్బంది కలగకుండా ప్రజెంట్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపులిని కావాలనే గొత్తికోయలు వేటారనే రీతిలో ఘటనను చెప్పుకొచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు దశాబ్దాల తర్వాత వస్తే కాపాడలేకపోయారు..
ఏటూరు నాగారం అభయారణ్యంలో పెద్దపులి చివరిసారిగా 2001లో కనిపించినట్టుగా అటవీశాఖ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ అరణ్యంలో అడుగుపెట్టిన పెద్దపులిని పరిరక్షించలేకపోవడం ఖచ్చితంగా అధికారుల వైఫల్యమేనని జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. గడిచిన సంవత్సర కాలంగా మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల పరిధిలో పెద్దపులులు, చిరుతలు సంచరిస్తున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు లభ్యమైన పరిరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపించాయి. వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న దరిమిలా.. తాడ్వాయి అడవుల్లో ఘోరం జరిగిపోయింది.