మే డే.. నో.. పే..!

– కరోనాతో కళ తప్పిన కార్మిక దినోత్సవం – లాక్‌డౌన్‌తో రాని జీతాలు – జేబులు, బ్యాంకు ఖాతా ఖాళీ దిశ, న్యూస్ బ్యూరో: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే డే’ను యావత్తు కార్మికలోకం ఘనంగా జరుపుకుంటుంది. రెక్కలు తప్ప ఆస్తులు లేని ఖాకీ బట్టల కార్మికులకు మే దినోత్సవం ఒక స్ఫూర్తి. కానీ, ఈసారి కరోనా కారణంగా కళ తప్పింది. ఒకటో తారీఖున వారికి ఖుషీ లేకుండా పోయింది. దేశంలో, రాష్ట్రంలో చాలా మంది కార్మికులకు […]

Update: 2020-04-30 08:19 GMT

– కరోనాతో కళ తప్పిన కార్మిక దినోత్సవం
– లాక్‌డౌన్‌తో రాని జీతాలు
– జేబులు, బ్యాంకు ఖాతా ఖాళీ

దిశ, న్యూస్ బ్యూరో: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే డే’ను యావత్తు కార్మికలోకం ఘనంగా జరుపుకుంటుంది. రెక్కలు తప్ప ఆస్తులు లేని ఖాకీ బట్టల కార్మికులకు మే దినోత్సవం ఒక స్ఫూర్తి. కానీ, ఈసారి కరోనా కారణంగా కళ తప్పింది. ఒకటో తారీఖున వారికి ఖుషీ లేకుండా పోయింది. దేశంలో, రాష్ట్రంలో చాలా మంది కార్మికులకు జీతాలకు దిక్కులేకుండా అయింది. రోజు కూలీ చేసుకొని పొట్ట నింపుకునే అసంఘటిత కార్మికులకు రేషన్ బియ్యమే గతైంది. వలస కార్మికులకు ‘లాంగ్ మార్చ్‌’లు తప్పలేదు. లాక్‌డౌన్ కారణంగా ప్రగతి రథ చక్రాలుగా భావించే పరిశ్రమల యంత్రాలు ఆగిపోయాయి. వాటి చప్పుడే లేదు. వాటిని నమ్ముకున్న కార్మికులకు నెల రోజుల జీతం పడలేదు. పడుతుందో లేదో తెలియదు. హక్కుల సాధన కోసం పునరంకితమయ్యే ‘మే డే’ రోజున వారు జరుపుకునే వేడుకలు ఈసారి నామమాత్రమే అవుతున్నాయి.

నేతలను తొలుస్తున్న ప్రశ్న..

కరోనా పేరుతో ఎంతమంది ఉద్యోగాలు ప్రశ్నార్థకమవుతున్నాయో తెలియదు. ఎవరికి జీతమొస్తుందో రాదో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులకే సగం జీతం కట్ అవుతుంటే ఇక ప్రైవేటు జీతాలు అనుమానమే. ఇప్పుడు కార్మిక హక్కుల కోసం నినదించే ‘మే డే’ రోజున సంఘటిత, అసంఘటిత కార్మికుల ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? వారి హక్కుల సాధనకు అనుసరించాల్సిన మార్గమేంటి.. ఇవే ఇప్పుడు కార్మిక సంఘాల నేతలను తొలుస్తున్న ప్రశ్న. కరోనా వైరస్ కోట్లాది మంది పేదల కడుపు కొట్టినా పాలకుల పుణ్యమా అని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టినవారికి మాత్రం కనకవర్షం కురిపించింది. ఒక్క దెబ్బతో సుమారు 68 వేల కోట్ల మేరా యాభై మంది రుణ ఎగవేతదారులకు తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా చేసింది. పేదలు పస్తులుంటుంటే సంపన్నులు మాత్రం వేల కోట్ల రూపాయలు మాఫీ అయినందుకు సంబురాల్లో మునిగిపోయారు. కార్మికులకు మాత్రం బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లలో డెబిట్ తప్ప క్రెడిట్ లేకుండా అయిపోయింది. కార్మికులు ఆనందంతో ఉత్సవాలు జరుపుకోవాల్సిన మే డే వేడుకలకు కరోనా గండికొట్టింది. ఇటు జేబులు, అటు బ్యాంకులో సేవింగ్స్ ఖాళీ అయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోజరంగా మారింది.

tags: May Day, Workers, Rights, Corona, Trade Unions

Tags:    

Similar News