90 ఏళ్ల బామ్మ ‘పెయింటింగ్స్’కు 3 లక్షల ఫాలోవర్స్!
దిశ, ఫీచర్స్: సమాజం ఇప్పుడిప్పుడే మార్పును అలవాటు చేసుకుంటుంది. ముఖ్యంగా మహిళల విషయంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. చదువు, ఉద్యోగాలు, బిజినెస్, ఫిట్‌నెస్ ఇలా చాలా విషయాల్లో ఎంతోమంది స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి తమకు నచ్చిన పనులుచేస్తూ సంతృప్తి పొందడమే కాకుండా, విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అంతేకాదు తమ కలలు నెరవేర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. 80 ఏళ్ల వయసులో ఓ బామ్మ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారితే, సెంచరీ చేరువలోని ఓ గ్రాండ్ […]
దిశ, ఫీచర్స్: సమాజం ఇప్పుడిప్పుడే మార్పును అలవాటు చేసుకుంటుంది. ముఖ్యంగా మహిళల విషయంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. చదువు, ఉద్యోగాలు, బిజినెస్, ఫిట్‌నెస్ ఇలా చాలా విషయాల్లో ఎంతోమంది స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి తమకు నచ్చిన పనులుచేస్తూ సంతృప్తి పొందడమే కాకుండా, విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అంతేకాదు తమ కలలు నెరవేర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. 80 ఏళ్ల వయసులో ఓ బామ్మ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారితే, సెంచరీ చేరువలోని ఓ గ్రాండ్ మదర్ స్కై డైవింగ్ చేసింది. ఈ క్రమంలోనే తొంభై పడిలో ఓ అమ్మమ్మ తన కళా నైపుణ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. స్పెయిన్, వాలెన్సియాకు చెందిన కాంచా గార్సియా జైరా ఏదైనా నేర్చుకోవటానికి పట్టుదల ఉంటే సరిపోతుందని, వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపిస్తోంది.
దశాబ్దం క్రితం అనారోగ్యం కారణంగా గార్సియా జైరా తన భర్తను కోల్పోయింది. కుటుంబ సభ్యులున్నా, భర్త లేనిలోటుతో 80ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిపోయింది. భర్త జ్ఞాపకాలతో ఆమె సతమతమైంది. అందరిలానే ఆ ఆలోచనల నుంచి బయటపడేందుకు తనను తాను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయంలో తన ఫ్యామిలీమెంబర్స్ ఆమెకు సపోర్ట్ చేస్తూ, ఓ పాత కంప్యూటర్‌ను అందించారు. ఆ కంప్యూటర్‌లో రోజుకో కొత్త విషయం నేర్చుకుంటూ, సమయాన్ని గడుపుతున్న ఆమెకు ‘ఎంఎస్ పెయింట్’ తన జీవితంలో కొత్త రంగులు నింపింది. తన కలల ప్రపంచానికి, సృజనాత్మకత జోడించి ఆమె వేసిన బొమ్మలను చూసిన ఇంటి సభ్యులు ఫిదా అయిపోయారు. దాంతో 2017లో ఆమె మనవరాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కాంచా గజైరా’(conchagzaera)పేరుతో అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రోజు నుంచి తను వేసిన బొమ్మలను అందులో పోస్టు చేయడం మొదలుపెట్టింది. దాంతో నెటిజన్లు ఆమె డీటెయిల్డ్, కలర్‌ఫుల్ ఆర్ట్ వర్క్‌ను ఇష్టపడటంతో.. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ సంఖ్య 3 లక్షలు దాటడం విశేషం. మనలో చాలామంది చిన్నతనంలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినప్పటికీ, కొద్దిమంది మాత్రమే పెయింట్ ఉపయోగించారు. కానీ జైరా మాత్రం తన కళాత్మక నైపుణ్యానికి పెయింట్‌ను ఉపయోగించుకుంది.
‘నాకు అస్సలు ఊహశక్తి లేదు. నా భర్త నాకు పంపిన పోస్ట్‌కార్డ్‌లపై చిత్రాలతో పాటు, కొన్ని డ్రాయింగ్స్ నుంచి ప్రేరణ పొంది ఆయా చిత్రాలు గీశాను. ఒక కళాకృతిని పూర్తి చేయడానికి వారం లేదా రెండు వారాలు పడుతుంది. నేను ఉంటున్న ఈ నగరం(వాలెన్సియా) కూడా నా చిత్రాల్లో ధ్వనిస్తుంది’ అని చెబుతోంది జైరా.