వారే టూల్‌కిట్ సృష్టికర్తలు
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతునిస్తూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ చేసిన ట్వీట్‌తో సంచలనం రేపిన టూల్‌కిట్ కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. టూల్ కిట్‌ను కర్ణాటకకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశారవి, అడ్వకేట్ నికితా జాకోబ్, మహారాష్ట్రకు చెందిన ఇంజినీర్ గ్రాడ్యుయేట్ శాంతాను ముకుల్‌లు తయారుచేసినట్టు తెలిపారు. శాంతాను ముకుల్ టూల్‌కిట్ ఓనర్ అని వివరించారు. దీన్ని దిశారవి స్వీడన్ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌తో టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని చెప్పారు. […]
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతునిస్తూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ చేసిన ట్వీట్‌తో సంచలనం రేపిన టూల్‌కిట్ కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. టూల్ కిట్‌ను కర్ణాటకకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశారవి, అడ్వకేట్ నికితా జాకోబ్, మహారాష్ట్రకు చెందిన ఇంజినీర్ గ్రాడ్యుయేట్ శాంతాను ముకుల్‌లు తయారుచేసినట్టు తెలిపారు. శాంతాను ముకుల్ టూల్‌కిట్ ఓనర్ అని వివరించారు. దీన్ని దిశారవి స్వీడన్ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌తో టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని చెప్పారు. ఖలిస్తానీ మద్దతుదారులతో వీరు భేటీ అయ్యారని, తర్వాతే టూల్‌కిట్‌ను అభివృద్ధి చేశారని వివరించారు. కెనడకు చెందిన మహిళ పునీత్ ఖలిస్తానీ మద్దతు సంస్థ పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీఎఫ్‌జే) తరఫున నికితను సంప్రదించారని, పీఎఫ్‌జే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దలివాల్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించారని జాయింట్ సీపీ(సైబర్ సెల్) ప్రేమ్‌నాథ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో నికితా జాకోబ్, దిశారవి, శాంతాను సహా 60 మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టూల్‌కిట్ విధివిధానాలను నిర్ణయించారని వివరించారు.
ఈ భేటీలోనే దలివాల్, ఇతరులు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా నిర్ణయించారని పేర్కొన్నారు. సాధ్యమైనంత తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడమే వారి ప్లాన్ అని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున ట్విట్టర్‌లో రైతులకు భారీగా మద్దతును కూడగట్టాలని, డిజిటల్‌తోపాటు ఫిజికల్‌గానూ ఆందోళనలకు టూల్‌కిట్ పిలుపునిచ్చిందని తెలిపారు. అంతేకాదు, దేశ వారసత్వ సంపదలను, విదేశాల్లో దేశ ఎంబసీలను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టాలని ప్రోత్సహించినట్టు వివరించారు. భారత ప్రతిష్ఠను మసకబార్చడమే దీని లక్ష్యంగా ఉన్నదన్నారు. టూల్‌కిట్ చాలా తెలివిగా తయారుచేశారని, ఎవరు ఎవరిని ట్యాగ్ చేయాలని? ఎప్పుడు, ఎలా షేర్ చేయాలో వివరాలన్నీ పొందుపరిచారని తెలిపారు. ఖలీస్తానీ సమాచారమందించే అనేక హైపర్ లింకులు కూడా ఇందులో చేర్చారని వివరించారు. దిశారవి ఇప్పటికే పోలీసు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మిగతా ఇద్దరు నికిత, శాంతానులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని, త్వరలో అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు వివరించారు. కాగా, నికితా జాకోబ్ బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం న్యాయస్థానం నికిత యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది. భారత్‌లోనే ఉన్నవారు రైతులకు మద్దతునివ్వడానికి సూచనలనిస్తున్నట్టు గ్రెటా థన్‌బెర్గ్ ఈ టూల్‌కిట్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ ట్వీట్ తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ పోలీసులు టూల్‌కిట్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ఆందోళనలకు సంబంధించిన కార్యచరణను పొందుపరిచినట్టు తెలిసింది.
నికిత ఇంట్లో తనిఖీలు
టూల్‌కిట్‌కు సంబంధించి సరిపడా సమాచారం అందిన తర్వాత ఈ నెల 9న కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందామని, అదేరోజు నికితా ఇంట్లో తనిఖీలు చేశామని జాయింట్ సీపీ ప్రేమ్‌నాథ్ తెలిపారు. రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌ను జప్తు చేశామని వివరించారు. వీటి ఆధారంగానే పునీత్ నికితను కాంటాక్ట్ అయ్యారని, గత నెల 11న పీఎఫ్‌జేలతో జూమ్ మీటింగ్‌లో సమావేశమైనట్టు తెలిసిందని చెప్పారు. కానీ, దర్యాప్తు కోసం మరో బృందం అక్కడికి చేరగానే నికిత అదృశ్యమయ్యారని తెలిపారు.
దిశారవి వాట్సాప్ చాట్ లీక్
గ్రెటా థన్‌బెర్గ్ టూల్‌కిట్ ట్వీట్‌ను తొలగించిన తర్వాత దిశారవి ఆమెతో వాట్సాప్‌లో చాట్ చేసినట్టు తెలిసింది. ఆ వాట్సాప్ చాట్ లీకైనట్టు కొన్నివర్గాలు వెల్లడించాయి. ‘ఈ విషయం గురించి కొన్నిరోజులు మనం మాట్లాడకపోవడం మంచిది. నేను లాయర్లతో మాట్లాడబోతున్నాను. మన పేర్లు ముందుకువచ్చాయి. అందుకు సారీ. దాదాపుగా మాపై ఉపా కేసు నమోదయ్యే అవకాశం ఉంది’ అని గ్రెటా థన్‌బెర్గ్‌కు దిశారవి చాట్ చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. టూల్‌కిట్‌ను ప్రచారం చేయడానికి దిశారవి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసిందని, అనంతరం దాన్ని డిలీట్ చేశారని పోలీసులు వివరించారు.
ఈ ‘దిశారవి’ ఎవరు?
దిశారవి. ప్రస్తుతం దేశం మొత్తం మార్మోగుతున్న పేరు. ఈ 21ఏండ్ల పర్యావరణ కార్యకర్త బెంగళూరులోని మౌంట్ కామెల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తిచేశారు. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ పేరుతో సోషల్ మీడియాలో గ్రూప్‌లను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో వాతావరణంలో మార్పులపై కాలమ్స్ రాస్తున్నారు. సోషల్ మీడియాలో వాతావరణంపై నిర్వహించే క్యాంపెయినింగ్‌లో ముఖ్యమైన సభ్యురాలు.
వాతావరణం గురించి ఎందుకు ఉద్యమం చేస్తోంది?
ఆటో రిపోర్ట్ ఆఫ్రికా-2020 పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దిశారవి ‘మన దేశంలో వాతావరణ ఉద్యమం’ గురించి ప్రస్తావించారు. ‘మా నానమ్మ, తాతలు రైతులు. పర్యావరణ మార్పులు రైతులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతున్నాయో తెలుసుకున్నాను. అప్పటి నుంచే వాతావరణంలో జరిగే మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాను’ అని తెలిపింది. ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ పేరుతో 2018లో స్వీడీష్‌కు చెందిన ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ ‘గ్రేటా థన్‌బర్గ్’ ఓ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కార్యకలాపాలను భారత్‌లో దిశారవి నిర్వహిస్తున్నారు. ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ క్యాంపెయినింగ్‌లో భాగంగా పిల్లలు ప్రతి శుక్రవారాల్లో తరగతులను బహిష్కరించి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయాలని పిలుపునిస్తున్నారు.
మత, రాజకీయ, ఆర్థిక ఎజెండా లేదు: నికిత
మత, రాజకీయ, ఆర్థిక ఎజెండా తనకు లేదని, రైతులపై అవగాహన పెంచడమే టూల్‌కిట్ ఉద్దేశమని నికితా జాకోబ్ తన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. హింస, అల్లర్లు, భౌతిక దాడులకు పురికొల్పే చర్యలకు పాల్పడలేదన్నారు. పోలీసులకు సహకరించానని, కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని వివరించారు. ఈ కేసులో తాను నిందితురాలా? సాక్షా? అనేది ఇంకా తనకు వివరించలేదని పేర్కొన్నారు. తాను ఆప్ సభ్యురాలిని కాదని వివరంచారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేయాలని బాంబే హైకోర్టును కోరారు. నికితా జాకోబ్‌తోపాటు ఎన్‌జీఓ హెడ్ శాంతాను ములుక్ కూడా ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌ను ఆశ్రయించారు.
రైతులకు మద్దతివ్వడం నేరం కాదు
పర్యావరణ కార్యకర్త దిశారవి అరెస్టును విపక్షాలు ఖండించాయి. దేశ ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. ‘మీ పెదాలు ఇంకా స్వేచ్ఛగానే ఉన్నాయి, మాట్లాడండి. సత్యం ఇంకా నిలిచే ఉన్నదని స్వరం వినిపించండి. వాళ్లు భయపడ్డారు, కానీ దేశం కాదు’ అని అన్నారు. 21ఏళ్ల దిశారవి అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి అని, రైతులకు మద్దతునివ్వడం నేరం కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజాస్వామ్యంపై ఆందోళన కలుగుతున్నదని, అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నదని ఆర్జేడీ లీడర్ మనోజ్ ఝా అన్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన, భూగ్రహం కోసం పోరాడుతున్న యువతిని అస్పష్ట ఆరోపణల కింద అరెస్టు చేశారని కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడా విమర్శించారు.