మల్టిలింగువల్ డిజిటల్ ఎక్స్‌ప్రెషన్
దిశ, ఫీచర్స్ : మనుషుల జీవితాలను ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వచిస్తున్నాం. ఉదయం వెబ్‌సైట్ల స్క్రోలింగ్‌తో మొదలుపెడితే ఫుడ్ ఆర్డర్, షాపింగ్, బిల్ పేమెంట్ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. టెక్నాలజీ విస్తృత ప్రభావానికి ఏ రంగం అతీతం కాదు. అందుకే స్థానిక కంపెనీలు, ప్లాట్‌ఫామ్స్ తమ వ్యాపారాల వృద్ధికి భాషా సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండియా వైడ్‌గా అన్ని ప్రాంతాల ప్రజలకు తమ ఉత్పత్తులను చేరవేసేందుకు వీలుగా స్థానిక భాషల్లోనే తమ యాప్ ఫీచర్స్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే డిజిటల్ […]
దిశ, ఫీచర్స్ : మనుషుల జీవితాలను ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వచిస్తున్నాం. ఉదయం వెబ్‌సైట్ల స్క్రోలింగ్‌తో మొదలుపెడితే ఫుడ్ ఆర్డర్, షాపింగ్, బిల్ పేమెంట్ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. టెక్నాలజీ విస్తృత ప్రభావానికి ఏ రంగం అతీతం కాదు. అందుకే స్థానిక కంపెనీలు, ప్లాట్‌ఫామ్స్ తమ వ్యాపారాల వృద్ధికి భాషా సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండియా వైడ్‌గా అన్ని ప్రాంతాల ప్రజలకు తమ ఉత్పత్తులను చేరవేసేందుకు వీలుగా స్థానిక భాషల్లోనే తమ యాప్ ఫీచర్స్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మల్టీ లింగువలిజం(బహుళ-భాషావాదం)కు ప్రాముఖ్యత కల్పిస్తున్నప్పటికీ.. భారతీయుల సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ విషయంలో మాత్రం తెలియని లోటు కనిపిస్తోంది. చాలావరకు గ్లోబల్ ప్రొడక్ట్స్ ఇంగ్లీష్‌పైనే ఫోకస్ చేస్తుండటంతో.. ఆశావాహ భారతీయులు యూనివర్సల్ లాంగ్వేజ్‌లో తమ భావాలను వ్యక్తీకరించడంలో వెనకాడుతున్నారు.
22 అధికారిక భాషలు.. 6,000కు పైగా మాండలికాలు గల విభిన్న దేశంలో 90 శాతం మంది మాతృభాషలోనే మాట్లాడతారు. కాగా మల్టీ లింగువల్ ఫీచర్ పూర్తిస్థాయిలో సాధ్యమైతే ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య త్వరలోనే 900 మిలియన్లు దాటొచ్చు.
వ్యక్త పరచాల్సిన అవసరం..
ఇంటర్నెట్ ఉత్పత్తులు ప్రాథమికంగా ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్, కనెక్షన్, ఎక్స్‌ప్రెషన్ చుట్టే తిరుగుతాయి. ప్రస్తుతానికి ఇంటర్నెట్‌లో వ్యక్తీకరణనే శక్తివంతమైన అంశం. ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తీకరణ అనేది అంతర్లీనంగా ఉంటుంది. మన ఆలోచనలను అందరితో పంచుకోవాలని, మన వ్యక్తీకరణలోని ఔచిత్యం విస్తృతంగా ఇతరులకు చేరువ కావాలని భావిస్తాం. క్రీడలు, రాజకీయాలు, కళలు మరియు సంస్కృతి, పండుగలు, సాహిత్యం లేదా పౌర వ్యవహారాలకు సంబంధించి సారూప్య సంస్కృతి, భాషా నేపథ్యాలకు చెందిన వ్యక్తులతో పరస్పర చర్చలు జరపాలని, వారితో సంబంధాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటుంటాం. మన మాతృభాషలో అలా చేయడానికి మనకు అనుమతి ఉన్నప్పుడు ఈ వ్యక్తీకరణ ఉత్తమంగా జరుగుతుంది. ఆంగ్ల అనువాదాలు లేకుండా మాతృభాషలో వ్యక్తీకరించడం ఎవరికైనా ఉత్తమ అనుభవాన్ని కలిగిస్తుంది.
కానీ చెలామణిలో ఉన్న సోషల్ మీడియా బ్రాండ్ల ప్రధాన ఫోకస్ మొత్తం ఇంగ్లీష్ పైనే. ఆ తర్వాతే స్థానిక భాషల ఆలోచన. భౌగోళికంగానూ గ్లోబల్ జెయింట్స్ దృష్టి ఇంగ్లీష్ మాట్లాడే ఇండియన్ సిటీస్‌పైనే ఉంటుంది. అయితే 1.3 బిలియన్ జనాభా గల భారత్‌లో దాదాపు 90 శాతం మంది సెమీ-రూరల్ ప్రాంతాలే కావడం గమనార్హం. అంటే దాదాపు 1 బిలియన్ ప్రజలను వారు పరిగణించట్లేదని అర్థం. వీరంతా ఇంటర్నెట్-అవగాహన కలిగి ఉంటారు.
కిరాణా సామగ్రి, రైడ్-హెయిలింగ్ కోసం యాప్స్ ఉపయోగిస్తుంటారు. కానీ మైక్రో-బ్లాగింగ్ సైట్ల విషయానికొచ్చేసరికి తటపటాయిస్తుంటారు. ఎందుకంటే ఈ గ్లోబల్ సర్వీసుల్లో అంతా ఆంగ్ల ఆధిపత్యమే. ఇక్కడ నేటివ్ స్పీకర్స్‌కు స్థానం లేకపోవడంతో పాటు రీటైల్, ఎడ్యుటెక్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్ తదితర గ్లోబల్ సోషల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఇంగ్లీష్ ప్రయారిటీ.. వినియోగదారుల విస్తృతి పెరగకుండా, బ్రాండ్ నేమ్ బలోపేతం కాకుండా నిరోధిస్తుంది.
వెర్నాక్యులర్ లాంగ్వేజ్..
ఈ రోజుల్లో ప్రతీ పట్టణం, తాలూకా లేదా గ్రామం.. ప్రొడక్ట్స్ నుంచి పాలిటిక్స్ వరకు కీలక నిర్ణయాల కోసం ఇంటర్నెట్-బేస్డ్ వరల్డ్‌పై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక బ్రాండ్స్.. జనాల్లో తాము విస్తరించేందుకు వెర్నాక్యులర్ లాంగ్వేజెస్‌లో లోకలైజ్డ్ మెసేజెస్‌ను రూపొందిస్తున్నాయి. ప్రతి 10 మంది కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో తొమ్మిది మంది స్థానిక భాష మాట్లాడేవారే. అందువల్ల ప్రాంతీయ భాషల్లోని వినియోగదారులతో కనెక్ట్ కావడం బ్రాండ్‌లకు అత్యవసరం. కానీ అనేక భారతీయ భాషల్లో సంభాషణలు, అనువాదాల కోసం ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటంతో అవి అసంపూర్తిగా ఉంటున్నాయి.
సంభాషణ, అనువాదాలు
ట్రాన్స్‌ఫర్మేటివ్ వరల్డ్‌లో ఇకపై భాష అడ్డంకి కాదు. క్రియేటర్స్, యూజర్ల మధ్య స్థానిక భాషలో వ్యక్తీకరణ అనేది డిజిటల్‌గా అనుసంధానించబడిన ప్రపంచానికి ఎంత కీలకమో, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ కూడా అంతే అవసరం. డిజిటల్ ట్రెండ్స్‌ను ప్రోత్సహించేందుకు ఆకట్టుకునే భాషానుభవం అవసరం. వినియోగదారులను సైతం వారి మాతృభాషలో వ్యక్తీకరించడానికి అనుమతించడం డిజిటల్ సాధికారతకు సంబంధించి ఒక కీలక అంశం. రెండు వేర్వేరు స్థానిక భాషలు మాట్లాడే వినియోగదారుల మధ్య సంభాషణను ప్రారంభించే అనుకూలత కల్పించడమే రెండవ అంశం.
ఉదాహరణకు.. కన్నడ, బెంగాలీ మాట్లాడే స్థానికులు ఇద్దరూ క్రికెట్ గురించి తమ ఆలోచనలను పంచుకోవాలనుకుంటే.. అప్పుడు సిస్టమ్ వీరిద్దరినీ ఎలా కనెక్ట్ చేస్తుంది? వారు తమ స్థానిక భాషలో సంభాషించుకునేలా ఎలా చేస్తుంది? అంటే రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్(అసలైన కంటెంట్‌కు తగిన భావాన్నిచ్చే అనువాదం, సరైన అవుట్‌పుట్‌ను అందించడానికి ప్రతీ భాషకు జోడించబడిన సూక్ష్మ నైపుణ్యాలను గ్రహించడం) ద్వారా ఇన్నోవేటివ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ సమర్థవంతమైన పాత్రను పోషిస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఇటువంటి పద్ధతిలో రూపొందించినపుడు యూజర్ A.. తన భాషలో కంటెంట్‌ను ప్లేస్ చేయగానే, యూజర్ B సదరు వాక్యాలను తన స్థానిక భాషలో చూడొచ్చు. కాబట్టి కంటెంట్ క్రియేటర్, యూజర్ ఇద్దరు కూడా తమ తమ భాషల్లో ఆసక్తి ఉన్న కామన్ టాపిక్‌పై మాట్లాడుకుంటారు. ఇది ఎక్కువ మంది యూజర్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మరింత సమచారాన్ని అన్వేషించేందుకు ప్రోత్సహిస్తుంది.