కరోనా ఆస్పత్రులే వారి టార్గెట్..!
దిశప్రతినిధి, హైదరాబాద్: దొంగతనాలు ఇళ్లల్లో, బ్యాంకుల్లోనే జరుగుతాయంటే మీరు మోసపోయినట్లే. ఇప్పుడు దొంగలు దవాఖానాలను చోరీలకు స్పాట్లుగా ఎంచుకున్నారు. ఆపదొచ్చి ఆస్పత్రికి వస్తే వీరి చేతి వాటంతో ఉన్న సొమ్ము కోల్పోవాల్సి వస్తోంది. పేద రోగులను టార్గెట్ చేస్తూ వారి కండ్లుగప్పి ఏది దొరికితే దాంతో ఉడాయిస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ వారి కళ్లు కప్పి తప్పించుకుంటున్నారు. కరోనా ఆస్పత్రులనూ వదలడం లేదు.. కరోనా బారిన పడిన వారి కోసం ప్రభుత్వం […]
దిశప్రతినిధి, హైదరాబాద్: దొంగతనాలు ఇళ్లల్లో, బ్యాంకుల్లోనే జరుగుతాయంటే మీరు మోసపోయినట్లే. ఇప్పుడు దొంగలు దవాఖానాలను చోరీలకు స్పాట్లుగా ఎంచుకున్నారు. ఆపదొచ్చి ఆస్పత్రికి వస్తే వీరి చేతి వాటంతో ఉన్న సొమ్ము కోల్పోవాల్సి వస్తోంది. పేద రోగులను టార్గెట్ చేస్తూ వారి కండ్లుగప్పి ఏది దొరికితే దాంతో ఉడాయిస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ వారి కళ్లు కప్పి తప్పించుకుంటున్నారు.
కరోనా ఆస్పత్రులనూ వదలడం లేదు..
కరోనా బారిన పడిన వారి కోసం ప్రభుత్వం నగరంలో కొన్ని ఆస్పత్రులను కొవిడ్ దవాఖానాలుగా మార్చింది. వీటిల్లో చేరే రోగుల వద్ద సహాయకులుగా ఉండేందుకు అనుమతి లేదు. కేవలం కొవిడ్ రోగులు మాత్రమే వార్డులలో చికిత్సలు పొందుతుండగా అటువంటి వారిని కూడా చోరులు వదలడం లేదు. మాస్కులు, గ్లౌజులు ధరించి సిబ్బందిలా నటిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, విలువైన గడియారాలు , పర్సులు, నగదు కనబడితే చిటికెలో మాయం చేస్తున్నారు. కింగ్ కోఠి, గాంధీ, టిమ్స్, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులను స్పెషలిస్టు ఆస్పత్రులుగా గుర్తించింది. ఇవే కాకుండా ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్ జే, కోఠి, పేట్లబుర్జు, ఈఎన్జీ, సరోజిని , చెస్ట్ , ఈఎస్ఐ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోరీల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.
డాక్టర్లను సైతం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని సైతం దొంగలు వదలడం లేదు. రోగుల సహాయకులుగా వార్డుల్లో తిరుగుతూ అదును కోసం ఎదురుచూడడం, వీలు చిక్కగానే చోరీ చేసి నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి జారుకుంటున్నారు. ముఖ్యంగా రద్దీ అధికంగా ఉండే ఆస్పత్రులను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఓపీ సమయంలో అధికంగా రద్దీ ఉండడంతో క్యూ లైన్లో నిల్చొని పర్సులు, నగదు కొట్టేస్తున్నారు. చికిత్సల సమయంలో డాక్టర్లు, సిబ్బంది ఫోన్లు , ఇతర విలువైన వస్తువులు పక్కన పెడితే వాటిని కూడా ఎత్తుకెళ్తున్నారు.
పీఎస్‌లలో నమోదు కాని కేసులు..
ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందే వారిలో అధిక శాతం స్థానికేతరులు కావడంతో చాలా వరకు కేసులు పోలీస్ స్టేషన్లకు చేరడం లేదు. చోరీ జరిగిన వస్తువులు దొరికే సంగతి అటుంచితే పలుమార్లు విచారణ కోసం తిరగడానికి వారు ఇష్టపడడం లేదు. ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు సైతం అటుగా అంత దృష్టిసారించడం లేదు. కేవలం విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగిన సమయాల్లోనే వారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఉస్మానియా వంటి ఆస్పత్రుల్లో దొంగలు చివరకు ఫ్యాన్లు, ఏసీ ఔటర్లు, కరెంటు మోటార్లు వంటివి కూడా వదలడం లేదు. వీటినూ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశారు.