రెండో రాజధానిగా హైదరాబాద్..
భారతదేశంలో ఈనాడు మేధావులు, ఆలోచనాపరులు లౌకికవాదులు దక్షిణ భారతానికి జరుగుతున్న వివక్షను గురించి పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు
భారతదేశంలో ఈనాడు మేధావులు, ఆలోచనాపరులు లౌకికవాదులు దక్షిణ భారతానికి జరుగుతున్న వివక్షను గురించి పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో జనాభా పెరగడం, దక్షిణ భారతంలో జనాభా తగ్గడానికి కారణం రాబోయే నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశంలో ఎంపీ నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉండడం మీద పెద్ద చర్చ జరుగుతుంది. డా॥బి.ఆర్.అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారతదేశానికి ప్రత్యేకమైన బడ్జెట్ అవసరమని ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక రాజధాని అవసరమని అన్నారు. రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉంటేనే మనకు రక్షణ అని చెప్పారు..
దక్షిణ భారతదేశ విజయాలు, సాఫల్యాలు ఉత్తర భారతదేశం కంటే ఎంతో ఆధిక్యంలోనే ఉన్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యం నానాటికీ పెరుగుతోంది. అయినప్పటికీ, 1947 నుంచి దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది పాలకులు చిన్నచూపు చూడడమే జరుగుతోంది. ప్రభుత్వాల అధికారిక అధ్యయనాలు సైతం దక్షిణాది రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమాల్లో తీరని అన్యాయం జరుగుతోందనే చెబుతున్నాయి. ఉత్తరాదిలో పనిచేస్తున్న దక్షిణాది రాష్ట్రాల అధికారులు దక్షిణాదికి ఏ మేరకు అన్యాయం జరుగుతున్నదో సోదాహరణంగా వెల్లడించడం జరుగుతూనే వుంది. దక్షిణాది వారి స్వరం పార్లమెంటులో వినబడకుండా చేయడం జరుగుతూనే వుంది. దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషా జాతుల సంస్కృతులను, కళలను, విద్యను సాంకేతికతను చిన్న చూపు చూస్తున్నారనక తప్పదు.
రక్షణ దుర్గంగా హైదరాబాద్
అంబేడ్కర్ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉంటేనే మనకు రక్షణ అని అంబేడ్కర్ చెప్పారు. ఢిల్లీకి, హైదరాబాద్‌కి చాలా వ్యత్యాసం ఉందని హైదరాబాద్ అయితే అందరికి అన్ని ప్రాంతాలకి సెంటర్‌గా ఉంటుందని చెప్పారు. బొంబాయికి (440), కలకత్తాకి (715 మైళ్లు), మద్రాసుకి (330 మైళ్లు), కర్నూల్‌కి (275 మైళ్లు), త్రివేంద్రంకి (660 మైళ్లు), పాటియాలాకి (990 మైళ్లు), చంఢీఘర్‌కి (1,045 మైళ్ళు), లక్నోకి (770 మైళ్ళు), హైదరాబాద్‌కి దూరం. భారతదేశానికి హైద్రాబాద్ నడిబొడ్డని ఈ మైళ్ళ దూరాలు చెబుతున్నాయి. అంతేగాక ప్రయాణం సులభం. హైద్రాబాద్ వాతావరణంలో సమతుల్యత ఉంది. హైద్రాబాద్ గొప్ప సాంస్కృతిక కేంద్రం. హైద్రాబాద్‌లో అన్ని భాషల వారు జీవిస్తున్నారు. హైద్రాబాద్ కళలకు కాణాచి. హైద్రాబాద్ పేరు భాగ్యనగరం, భాగమతి అనే దళిత స్త్రీ నామమే భాగ్యనగర్. హైద్రాబాద్‌ను ఎంతోమంది పాలించినా దాని దేశీయ అస్థిత్వాన్ని నిలుపుకుంటూనే వుంది. హైద్రాబాద్ ఏ ప్రాంతం వారైనా జీవించడానికి అనువైన ప్రాంతం. అదే ఢిల్లీకి అయితే ఈ నగరాలు సుదీర్ఘ దూరంలో ఉన్నాయి. ఈ విషయంగా అంబేడ్కర్ హైదరాబాద్ రిలవెన్స్ గురించి ఇలా చెప్పారు.
ఆ కాలంలోనూ రెండు రాజధానులు
ఢిల్లీ గురించి అంబేడ్కర్ చాలా పరిశోధనలు చేశారు. ఢిల్లీ ఎప్పటికీ రాజధానిగా పనికిరాదని ఆయన నిర్ధారించారు. బ్రిటీష్ వారు రాకముందు భారత దేశానికి ఎప్పుడూ రెండు రాజధానులుండేవి. మొగలాయిల కాలంలో భారతదేశానికి ఢిల్లీలో ఒక రాజధానీ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మరొక రాజధానీ ఉండేవి. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత, వారు కూడా రెండు రాజధానులను ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి కలకత్తా, మరొకటి సిమ్లా. కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుకున్న తరువాత కూడా వారు సిమ్లాను వేసవి రాజధానిగా అట్టేపెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే మొగలాయిలూ, బ్రిటీష్ వారూ కూడా ఈ రెండు రాజధానులను ఉంచుకున్నారు. బ్రిటీష్ వారు కాని, మొగలాయిలు కాని అవిరామంగా 12 నెలలపాటు ఢిల్లీలో లేదా కలకత్తాలో పూర్తికాలం ఉండలేక పోయేవారు. ఢిల్లీలో వేసవి కాలాన్ని మొగలాయిలు భరించలేకపోయేవారు. వేసవి నెలలకోసం వారు శ్రీనగర్‌ను తమ రెండవ రాజధానిగా చేసుకున్నారు. కలకత్తాలోని వేసవి నెలలు బ్రిటీష్ వారికి గూడా అంత భరింపశక్యం కానివిగానూ ఉండేవి. అందువల్ల వారు రెండో రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు.
అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో..
రక్షణ దృష్ట్యా హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వానికి భద్రత కల్పిస్తుంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి అది సమానమైన దూరంలో ఉంది. తమ ప్రభుత్వం కొంత కాలంపాటు తమతో ఉందన్న సంతృప్తిని కూడా అది దక్షిణాది ప్రజలకు ఇస్తుంది. శీతాకాలంలో భారత ప్రభుత్వం ఢిల్లీలో ఉండి మిగిలిన కాలమంతా అది హైదరాబాద్ లో ఉండవచ్చు. ఢిల్లీలో ఉన్న సదుపాయాలన్నీ, హైదరాబాద్‌కు ఉన్నాయి. అది ఢిల్లీ కన్నా మెరుగైన నగరం కూడా. ఢిల్లీకున్న వైభవాలన్నీ హైదరాబాద్ కూడా ఉన్నాయి. భవనాలు అక్కడ చౌక. అందమైనవి కూడా. ఢిల్లీలోని భవనాలకన్నా అవి ఉన్నతమైనవి. అవన్నీ ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇక కావల్సిందల్లా ఒక్క పార్లమెంట్ భవనమే! భారత ప్రభుత్వం దానిని సులభంగానే నిర్మించుకోగలదు. సంవత్సరం పొడుగునా పార్లమెంట్ సమావేశమై పని చేయడానికి హైదరాబాద్ అనువైన ప్రదేశం. అది ఢిల్లీలో సాధ్యం కాదు. హైదరాబాద్‌ను భారతదేశ రెండో రాజధానిగా వేయడంలో నాకెటువంటి అభ్యంతరం కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరిస్తున్న ఈ సమయంలోనే, ఆ పని చేయాలి. హైదరాబాద్, సికిందర్‌బాద్, బొల్లారాంలను కలిపి భారతదేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలి. యావత్తు దక్షిణ భారతదేశానికి, మహారాష్ట్రకూ, ఆంధ్రులకూ సంతృప్తికరంగా ఉండేటట్లు ఆ పనిని చాలా సులభంగా చేయవచ్చు. ఈనాడు ఢిల్లీలో వున్న పొల్యూషన్ బట్టి డిల్లీ నగరం రాజధానిగా ఉండడం కష్టమేనని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దక్షిణ భారతదేశం వర్ధిల్లాలి అంటే దక్షిణ భారతదేశ చరిత్ర, సంస్కృతి, భాష, నాగరికత, తత్వం, ఆర్థిక వనరులు, మేధో వికసనం విస్తృతం కావడం కోసం హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయడమే కాక అన్ని రాష్ట్రాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, ఉత్పత్తులు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచినప్పుడే ఈ దేశం పురోగమిస్తుంది. డా. బి.ఆర్.అంబేడ్కర్ చెప్పిన విధంగా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా రూపొందించుకునే ఉద్యమంలో భాగస్వాములవుదాం. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని భారతదేశ సమైక్యతను కాపాడుకుందాం. అంబేద్కర్ ఆలోచన మార్గమే దేశానికి విముక్తి.
- డాక్టర్ కత్తి పద్మారావు,
98497 41695