విద్యారంగ విధ్వంసం ఇంకానా!

రాష్ట్రంలో దశాబ్ద కాలపు బీఆర్ఎస్ పాలనలో విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం నిర్వీర్యమైంది. పదేళ్ల సుదీర్ఘ పరిపాలనలో పాఠశాల నుండి

Update: 2024-12-24 00:45 GMT

రాష్ట్రంలో దశాబ్ద కాలపు బీఆర్ఎస్ పాలనలో విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం నిర్వీర్యమైంది. పదేళ్ల సుదీర్ఘ పరిపాలనలో పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు బోధన బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, బడ్జెట్‌లో కనీస నిధుల కేటాయింపుల్లేక విద్యా రంగం సమూలంగా విధ్వసమైందన్నది జగద్విదితమే. విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని విద్యార్థుల విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు హెచ్చరించినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణించకుండా నిరంకుశంగా వ్యవహరించింది.

2014, 2018 ఎన్నికల్లో గెలిచి నిరంకుశ పాలనకు తెరలేపిన ప్రభుత్వానికి తెరపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం మాది ప్రజా పాలన అని ప్రకటించిన పార్టీ గత ప్రభుత్వం మాదిరే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందా? అని సందేహమేస్తోంది. విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన తామున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు విద్యామంత్రిని కేటాయించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన ఇప్పటికీ విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడం అత్యంత దురదృష్టకరం.

వీసీలను నియమిస్తే సరిపోదు..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక సమస్యలు నేడు కొనసాగుతున్నాయని చెప్పక తప్పదు. విద్యారంగానికి అరకొర నిధులు, ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించకపోవడం, యూనివర్సిటీలలో బోధన, బోధనేతర నియామకాలు చేపట్టకపోవడం, సంక్షేమ వసతి గృహాల అధ్వాన స్థితి, బాసర ఐఐఐటీపై నిర్ల క్ష్యం, ఇంటర్ విద్యలో కార్పొరేట్ సంస్థల ఫీజులుం, ఆగడా లు, ఆత్మహత్యా ఘటనలు వంటి అంశాలు ప్రభుత్వం నిర్లక్ష్యా న్ని విప్పి చెబుతున్నాయి. సకాలంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్‌లను నియమిచడం స్వాగతించదగ్గ అంశమే అయినా పాలకమండళ్లను నియమించకపోవడం, నిధులు కేటాయించకపోవడం, దాదాపుగా 80% ఖాళీలుగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకై కనీస చర్యలు చేపట్టకపోవడంతో యూనివర్సిటీ ప్రతిభ నానాటికీ దిగజారిపోతోంది. జాతీయ స్థాయిలో అనేక ప్రామాణిక సంస్థల సర్వే నివేదికలు దీనికి నిదర్శనం.

విద్యార్థుల మృతికి నిర్లక్ష్యమే కారణం

ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం గడిచినా గతంలో ఉన్న పెండింగ్, ప్రస్తుత విద్యాసంవత్సరపు రియంబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో, ప్రైవేటు విద్యా సంస్థలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడంతో పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్‌పై నమ్మకం కోల్పోయి విద్యకు దూరం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించ లేనంత జఠిలమైనవేమి కానప్పటికి అలవిమాలిన నిర్లక్ష్యం కారణంగా కలుషిత ఆహారంతో 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దారుణం. పేద విద్యార్థులకు వసతితో కూడిన విద్యనందించే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి.

విద్యారంగాన్ని గాడిన పెట్టాల్సిందే

దశాబ్ద కాలం పాటు విధ్వంసమైన విద్యారంగాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించడంతో పాటు, పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి ఖాళీగా ఉన్న బోధన, భోదనేతర నియామకాలు త్వరితగతిన చేపట్టడం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ హాస్టళ్ల నిత్య పర్యవేక్షణ, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. 

- అలివేలి రాజు

ఏబీవీపీ తెలంగాణ

85559 34161

Tags:    

Similar News