ఊతకర్రలు.. ఉఫ్!
ఉద్యమంలో ఊతకర్రల ఉనికి ప్రశ్నార్థకమై ఉత్తకర్రలయ్యాయి. అధికారమొచ్చినవేళ అక్కరలేనివయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో సుదీర్ఘకాలం సాగిన ఉద్యమానికి తమ మాట, పాట, కలం, గళంతో ఊతమిచ్చిన మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు ఎందరో నిరాదరణకు గురయ్యారు. ప్రతి దశలోనూ ఎవరో ఒకరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అండగా నిలబడి అందలమెక్కించినా.. అక్కర తీరాక అల్లంత దూరాన పెట్టారు. తెలంగాణలో కథానాయకులుగా ఉండాల్సిన వారంతా కాలగమనంలో కానివారయ్యారు. ఇది ఉద్యమ చరిత్రలో చోటుచేసుకున్న తప్పిదమా లేక చరిత్ర నుంచి వ్యూహాత్మకంగా […]
ఉద్యమంలో ఊతకర్రల ఉనికి ప్రశ్నార్థకమై ఉత్తకర్రలయ్యాయి. అధికారమొచ్చినవేళ అక్కరలేనివయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో సుదీర్ఘకాలం సాగిన ఉద్యమానికి తమ మాట, పాట, కలం, గళంతో ఊతమిచ్చిన మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు ఎందరో నిరాదరణకు గురయ్యారు. ప్రతి దశలోనూ ఎవరో ఒకరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అండగా నిలబడి అందలమెక్కించినా.. అక్కర తీరాక అల్లంత దూరాన పెట్టారు. తెలంగాణలో కథానాయకులుగా ఉండాల్సిన వారంతా కాలగమనంలో కానివారయ్యారు. ఇది ఉద్యమ చరిత్రలో చోటుచేసుకున్న తప్పిదమా లేక చరిత్ర నుంచి వ్యూహాత్మకంగా తప్పించడమా అనేవి అనుమానాలుగానే ఉండిపోయాయి. తనకు అవసరమనుకుంటే వారి ఇంటికెళ్లి మరీ ఆశ్చర్యపరిచే ‘కేసీఆర్’.. కాదంటే మాత్రం కనీసం ముఖం చూసేందుకైనా ఇష్టపడడనేది ప్రచారంలో ఉన్న వాస్తవం. నాడు ‘ఆలె నరేంద్రతో మొదలుకొని బాబుమోహన్ వరకు ఇలా నిరాదరణకు గురైనవారే. నాటి జలదృశ్యం మొదలు.. నేటి ప్రగతిభవన్ వరకు ఈ చరిత్రకు సాక్ష్యాలే.
ఆలె నరేంద్ర స్థాపించిన తెలంగాణ సాధన సమితి(టీఎస్‌ఎస్)ని టీఆర్ఎస్‌లో విలీనం చేసుకుని పోటీ లేకుండా చేసుకున్న కేసీఆర్ చివరకు నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ‘తల్లి తెలంగాణ పార్టీ’ని స్థాపించిన విజయశాంతి విషయంలోనూ ఇదే ఫార్ములాను అనుసరించారు. కేసీఆర్ కంటే ముందు నుంచి తెలంగాణ కోసం పనిచేసిన ‘గాదె ఇన్నయ్య’ను కూడా అవసరం తీరాక పక్కక పెట్టిన సంగతి తెలిసిందే. ఉద్యమం కోసం తన ఇంటిని పార్టీ కార్యాలయంగా వాడుకునేందుకు ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని పట్టించుకున్న పాపాన పోలేదు. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, రహమాన్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, రవీంద్ర నాయక్, కేకే మహేందర్‌రెడ్డి, దిలీప్ కుమార్, రాములు నాయక్.. ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు పంతొమ్మిదేండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో లెక్కకు మించిన నాయకులు తమ అస్థిత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. తెల్లారి లేస్తే మీడియా చానళ్లలో తమ పదునైన చర్చలతో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన రఘనందన్ రావు, శ్రవణ్ కుమార్‌లను పార్టీ నుంచి ఏవిధంగా బయటకు పంపారో తెలంగాణ సమాజానికి విదితమే. ఒక దశలో ఉద్యమంలో టీఆర్ఎస్ విశ్వసనీయతను కోల్పోయి వెనకబడినా తన కార్యాచరణతో ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ సమయంలో ఆయన్ను ఇంద్రుడు చంద్రుడు అన్న స్థాయిలో పొగిడిన కేసీఆర్ సీఎం అయ్యాక కనీసం ‘సర్పంచ్‌గన్న గెలిచినవా’ అని అవమానించిన తీరు మనకు తెలిసిందే.
ఉద్యమ ప్రస్థానాన్ని పక్కనబెడితే అధికారంలోకొచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్‌లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వరంగల్‌లో కొండా దంపతులు, సీతారాం నాయక్, మొలుగూరి భిక్షపతి, పెద్దపల్లిలో వివేక్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. వీరంతా కేసీఆర్ బాధితులే. వీరి విషయం పక్కనబెడితే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ ఆదరణకు నోచుకోని నాయకులూ ఉన్నారు. సీనియర్ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఇటీవలే ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సమయం వచ్చినప్పుడల్లా నాయిని నర్సింహారెడ్డి తన అసమ్మతిని వినిపిస్తూనే ఉన్నారు.
ఏదేమైనా.. సొంత చరిష్మాతో ఎదిగిన నాయకులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదనే విషయం మాత్రం సుస్పష్టం. ప్రస్తుతానికి తన చాణక్యంతో గట్టెక్కుతున్నా పరిస్థితులు అన్నిసార్లు అనుకూలించవు. ‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటానే’ నానుడి నిజం కాకతప్పదు.