ఏడుపాయల జాతరపై.. ఎందుకీ శీతకన్ను..!
దిశ, మెదక్: దట్టమైన కీకారణ్యం.. పచ్చని పొలాలు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. గలగళలాడే మంజీరా పరవళ్ళు.. కొండల్లో వెలసిన వనదుర్గామాత.. భక్తుల కోరికలు తీరుస్తూ.. వెలసిన అమ్మవారు.. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి ప్రాశస్త్యం పొందిన ఏడుపాయల జాతరపై పాలకులు పార్శ్వాలిటీ చూపిస్తున్నారు. మొదటి పండగను ఘనంగా నిర్వహించి ఆ తర్వాత విస్మరిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్నా, ఇక్కడ అభివృద్ధి మాత్రం సున్నా.. ఏటా అరకొర నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల […]
దిశ, మెదక్: దట్టమైన కీకారణ్యం.. పచ్చని పొలాలు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. గలగళలాడే మంజీరా పరవళ్ళు.. కొండల్లో వెలసిన వనదుర్గామాత.. భక్తుల కోరికలు తీరుస్తూ.. వెలసిన అమ్మవారు.. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి ప్రాశస్త్యం పొందిన ఏడుపాయల జాతరపై పాలకులు పార్శ్వాలిటీ చూపిస్తున్నారు. మొదటి పండగను ఘనంగా నిర్వహించి ఆ తర్వాత విస్మరిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్నా, ఇక్కడ అభివృద్ధి మాత్రం సున్నా.. ఏటా అరకొర నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఆధ్యాత్మిక కేంద్రాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. యాదాద్రి నుంచి మొదలై, ప్రసిద్ధిగాంచిన దేవాలయాలపై ఫోకస్ చేస్తున్నారు, కానీ మెతుకుసీమలో స్వయంభుగా వెలసిన అమ్మవారిని పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు మాత్రమే హడావిడిగా చేసి, మమ అనిపించేస్తున్నారు. పాలకుల తీరుతో ఆ శక్తి స్వరూపిణికి కూడా వివక్ష తప్పడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
హామీలు గాలికి..
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు ముందు, ఆ తర్వాత గులాబీ బాస్ మెదక్ పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం కేసీఆర్ ఏడుపాయలను టూరిజం స్పాట్‌గా చేస్తామని ప్రకటించారు. 2014లో ఓసారి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి పర్యటించిన సీఎం ఏడుపాయల ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ పర్యటనల అనంతరం అమ్మవారి ఖ్యాతిని ఎల్లలు దాటేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అత్యధిక నిధులు మంజూరు చేసి మరింత డెవలప్ చేస్తామని ఇచ్చిన మాట అటకెక్కింది. ఎప్పటిలాగే ఏడాదికి కొద్దో గొప్పో గ్రాంట్, అదీ మహాశివరాత్రి సందర్భంలో రిలీజ్ చేయడం, అనంతరం షరా ‘‘మాములు’’ గానే ఏడాది మొత్తం మర్చిపోవడం ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా రూ.కోటి మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వాసి, మలివిడత తెలంగాణ ఉద్యమ రథసారథి, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న కేసీఆర్ దుర్గమ్మ పట్ల వివక్ష చూపుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఇదీ.. లెక్క..
ఏడుపాయల దుర్గాభవాని మాత జాతరను ప్రభుత్వం ఏటా జరుపుతోంది. ఈ క్రమంలో ఏడాది పొడుగునా భక్తులు పోటెత్తడంతో కానుకలు ఇతర వస్తువుల రూపంలో సంబంధిత శాఖతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం కూడా అంతే స్థాయిలో వస్తుంది. ఏడాదికి రూ.5 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 2017లో జాతర సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ రూ.1.55 కోట్లు విడుదల చేయగా దీంట్లో రూ.1.24 కోట్లు ఖర్చు చేశారు. 2018లో రూ.1.50 కోట్లు మంజూరు కాగా రూ.1.39 కోట్లు ఖర్చు చేశారు. 2019లో రూ.1.50 కోట్లు విడుదల కాగా, రూ.1.23 కోట్లు ఖర్చు చేశారు. 2020లో రూ.75 లక్షల రూపాయలు మంజూరు కాగా దీంట్లో రూ.50 లక్షల రూపాయలు ఖర్చయినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేశారు. ఇలా ప్రతీ సంవత్సరం ఏడుపాయలకు నిధులు మంజూరవుతున్నా, ఇప్పటికీ భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయకమిటీ ఖర్చుల లెక్కలు చూపిస్తున్నా.. కనీసం పర్మినెంట్ సమస్య ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో పాటు భక్తుల కానుకల రూపంలో వస్తున్న వాటిని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు బొక్కేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలు కొంతమంది అధికారులు నేతల జేబుల్లోకి వెళ్తున్నట్టు విమర్శలున్నాయి. గతంలో అమ్మవారికి సమర్పించిన ముక్కుపుడక మాయమవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అమ్మవారి సన్నిధిలో అవినీతి పెచ్చుమీరడం సంబంధిత అధికారులంతా మిలాఖత్ కావడం,క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇద్దరు హేమాహేమీలున్నా..
తెలంగాణ ఉద్యమంలో అధినేత అడుగుల్లో అడుగేసి తన మాటల తూటాలతో ప్రసంగాల వర్షాన్ని కురిపించిన వ్యక్తి మెదక్ ఎమ్మెల్యే పద్మ, ఇక ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా గులాబీ బాస్‌తోనే ఉన్న మరో నేత ఐన సీఎం రాజకీయ కార్యదర్శి స్థానిక ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి. ఇద్దరు గట్టి నాయకులున్నా ఏడుపాయలకు సరైన న్యాయం చేయడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధినేత దేవుళ్ళ మధ్య వివక్షను విడనాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. దీనికి ఇద్దరు నాయకులు స్పందించి సీఎంను ఒప్పించి దుర్గాభవాని మాతకు మొక్కుబడి పనులు కాకుండా, శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేస్తున్నారు.
అమ్మవారిపై వివక్ష సరికాదు :
ఏళ్లుగా స్వయంభుగా కొలువైన అమ్మవారిపై పాలకులు శీతకన్ను వేయడం సరికాదు, ఏటా అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కుబడిగా ఉత్సవాలను చేయడం దుర్మార్గం, గతంలో సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, ఏడుపాయల్లో అవినీతిపై సంబంధిత అధికారులపై సీఎం స్పందించాలి, ఎంతసేపూ యాదాద్రిపైనే కాదు ఈ జిల్లా ముఖ్యమంత్రిగా ఏడుపాయలను అభివృద్ధి చేయడం సీఎం తన బాధ్యతగా గుర్తించాలి. – గడ్డం శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు