Nampally: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్‌లోని గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ(Telangana BJP) నేతలు యత్నించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ(Telangana BJP) నేతలు యత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ప్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే గాంధీ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పరిస్థితి చేదాటి పోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.