దుర్గంధంగా కొండగట్టు.. పట్టించుకునేవారే కరవు
దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటి. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి సంవత్సరం దేవాదాయ శాఖకు కోట్ల రూపాయల ఆదాయం ఈ దేవాలయం నుండి సమకూరుతుంది. కోట్లలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో అన్నట్లు తయారైంది పరిస్థితి. దుర్గంధంగా మెట్ల దారి.. కేవలం హనుమాన్ […]
దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటి. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి సంవత్సరం దేవాదాయ శాఖకు కోట్ల రూపాయల ఆదాయం ఈ దేవాలయం నుండి సమకూరుతుంది. కోట్లలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో అన్నట్లు తయారైంది పరిస్థితి.
దుర్గంధంగా మెట్ల దారి..
కేవలం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రమే హడావుడి చర్యలు చేపట్టిన తర్వాత మెట్లదారి పట్టించుకోకపోవడం వల్ల మెట్ల దారి వెంట మొత్తం గడ్డి పిచ్చి మొక్కలు పెరిగి భక్తులకు ఇబ్బందిగా మారింది. చెత్త చెదారంతో పాటు ఎటు చూసిన దుర్గంధ భరితంగా తయారైంది. మెట్ల మార్గంలో వచ్చే భక్తులు ముక్కు మూసుకుంటే గాని అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. కోట్లలో ఆదాయం ఉన్నప్పటికీ మెట్లదారిని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ 2.50కోట్ల రూపాయలు పురాతన మెట్లదారి ఆధునీకరణకు మంజూరు చేయగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫిబ్రవరి 25,2018 లో పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ఏడాదిన్నరలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు మొదలు కాలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మెట్ల మార్గాన్ని శుభ్రం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, మార్గమధ్యంలో ఉచిత మంచినీటి సౌకర్యంతో పాటుగా సౌచాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
బహిరంగ మలమూత్ర విసర్జన..వినియోగంలో లేని మరుగుదొడ్లు..!
స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం అధికారుల నోటిమాట వరకు మాత్రమే పరిమితం అయింది. కొండపైన నాలుగు సౌచాలయాలు ఉన్నప్పటికీ కేవలం ఘాట్ రోడ్డు కూడలి వద్ద ఉన్న ఒకటి కోనేరు వద్ద ఉన్న మరొకటి మాత్రమే వినియోగంలో ఉన్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సౌచాలయాలు గడ్డి పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థలో ఉన్నాయి. కొండపైకి వచ్చే భక్తులకు సౌచాలయాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఉన్నాయో లేదో, తాగునీరు కూడా ఎక్కడ ఉందని కూడా తెలియని పరిస్థితి. సౌచాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియకనే అత్యవసర పరిస్థితితులలో గత్యంతరం లేక బయటకు వెళ్లాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం ఎటు చూసిన చెత్తతో ఉండటం ఆలయ అధికారులు పనితీరుకు అద్దం పడుతున్నాయి.
శానిటేషన్ అధికారిపై చర్యలు తీసుకోవాలి
దూర ప్రాంతం నుండి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి . అధికారుల నిర్లక్ష్యం కొండగట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. ఎటు చూసిన చెత్తనే దర్శనం ఇస్తుంది. పవిత్రమైన ప్రసాద తయారీ కేంద్రం వద్ద చెత్తను డంప్ చేస్తున్నారు.మెట్ల దారి చాలా దుర్గంధం గా ఉండడం వల్ల ముక్కు మూసుకొని కొండపైకి చేరుకోవాల్సి వస్తుంది .ఆడవాళ్లు చిన్న పిల్లలు సౌచాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి . ఆలయ పరిసరాలను వెంటనే శుభ్రం చేసి భక్తులకు ఉచితంగా సౌచాలయాలు, కొండపైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని హిందువాహిని డిమాండ్ చేస్తుందని తెలిపారు.
హిందూ వాహిని అధ్యక్షుడు కోల అనిల్
చర్యలు చేపడతాం ఆలయ ఈవో :వెంకటేష్
గతంలో మెట్లదారి అభివృద్ధి కోసం 2.50 కోట్లు మంజూరు అయిన మాట వాస్తవమే కానీ 10ఫీట్ల దారిని 15ఫీట్ల కి పెంచాల్సి ఉన్నందున కొన్ని సమస్యలు తలెత్తాయి.ఈ విషయం అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ దృష్టికి తెససుకెళ్లారు. సరైన అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను వెంటనే భక్తులకు అందుబాటులో తీసుకొస్తాం. సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మెట్ల దారి అభివృద్ధికై చర్యలు చేపడతాం.