చర్లలో నిఘా.. నేరాలకు అడ్డుకట్ట
దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత చర్ల మండలం పూర్తిగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీ టీవీ) నిఘాలో ఉంది. మండల కేంద్రమైన చర్లలో దాదాపు ప్రతీ వీధితోసహా పలు సమస్యాత్మక గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడ ఏమి జరిగినా సీసీ టీవీ ద్వారా పోలీసులకు ఇట్టే తెలిసిపోతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటోంది. ఇంతకు ముందు రోడ్లపై మందుబాబుల లొల్లి, యువకులు రోడ్లపై వాహనాలు […]
దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత చర్ల మండలం పూర్తిగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీ టీవీ) నిఘాలో ఉంది. మండల కేంద్రమైన చర్లలో దాదాపు ప్రతీ వీధితోసహా పలు సమస్యాత్మక గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడ ఏమి జరిగినా సీసీ టీవీ ద్వారా పోలీసులకు ఇట్టే తెలిసిపోతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటోంది. ఇంతకు ముందు రోడ్లపై మందుబాబుల లొల్లి, యువకులు రోడ్లపై వాహనాలు ఆపి బాతాఖానీలు, అడపాదడపా చిన్నపాటి ఘర్షణలు, చోటా చోరీలు జరిగేవి. కానీ ఇపుడు సీసీ కెమెరాల మూలంగా ఏమి చేసినా పోలీసులకి తెలిసిపోతుందనే భయంతో జనం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
రేయింబవళ్లు పోలీస్ నిఘా..
మన్యంలో మావోయిస్టుల కదలికలపై డేగకన్ను వేసి ఉంచిన చర్ల పోలీసులు రేయింబవళ్లు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఊరిలోకి వచ్చిపోయే కొత్తవారు, అనుమానిత వ్యక్తుల కదలికలను సీసీ టీవీల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మావోయిస్టుల అడ్డాగా చెప్పుకొనే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని ఆనుకొని ఉన్నందున చర్ల మండలంలో మావోయిస్టుల ప్రభావం పడకుండా కంటికిరెప్పలా ఖాకీలు కాపలా కాస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టాక అర్థరాత్రి అక్రమాలకు చాలా వరకు అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు. ఇసుక రవాణాదారులు దొంగదారులు వెతుక్కుంటున్నారు. వేళాపాళలేకుండా తెల్లవార్లు వ్యాపారం చేసే బెల్ట్‌షాపులు కూడా త్వరగానే బంద్ చేస్తున్నారు. ఊరినిండా సీసీ కెమెరాలు ఉన్నందున వ్యాపారులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
మన్యంలో మావోయిస్టులకు చెక్..
సీసీ కెమెరాల ఏర్పాటుతో చర్లలో సంచరించే మావోయిస్టులకు చెక్ పెట్టినట్లు అయింది. ప్రతీ ఆదివారం చర్లలో జరిగే వారపుసంతకు ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలమాటున మావోయిస్డు మిలీషియా, పీఎల్‌జీఏ సభ్యులు, కొరియర్లు వచ్చిపోతుంటారని పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండేవారు. అప్పట్లో ఆదివారానికి ముందు లేదా వెనుక రోజుల్లో కరపత్రాలు, ఇతరత్రా చర్యలతో మావోయిస్టుల ఉనికి కనిపించేది. కానీ సీసీ కెమెరాలు అడుగడుగునా పెట్టిన తర్వాత చర్లకి మావోయిస్టుల రాకపోకలకు చెక్ పడిందనేది యదార్థం. ఏ మార్గంలో మావోయిస్టుల కదలికలు కనిపించినా పోలీసుల కంటపడక తప్పదు. ఈ క్రమంలోనే మావోయిస్టుల చర్యలు చర్లలో కనుమరుగైనాయని భావించవచ్చును. అంతకు ముందు ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడిన చర్ల జనం ఇపుడు ప్రశాంత వాతావరణంలో కాలం వెళ్లదీస్తున్నారు.