రెండేళ్లు దాటినా.. గతిలేని నిరుద్యోగ భృతి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగభృతి హామీకి రెండేళ్లు దాటినా కార్యరూపం దాల్చలేదు. రెండు వారాల క్రితం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం పది రోజుల్లో సీఎం నిరుద్యోగులకు తీపికబురు చెప్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇటు ఉద్యోగ ఖాళీలూ భర్తీ చేయకపోవడం.. అటు భృతి ఇవ్వకపోవడం గమనార్హం. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భృతి అందడం ఎడారిలో ఎండమావిగానే మారింది. దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో […]

Update: 2021-02-12 13:28 GMT

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగభృతి హామీకి రెండేళ్లు దాటినా కార్యరూపం దాల్చలేదు. రెండు వారాల క్రితం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం పది రోజుల్లో సీఎం నిరుద్యోగులకు తీపికబురు చెప్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇటు ఉద్యోగ ఖాళీలూ భర్తీ చేయకపోవడం.. అటు భృతి ఇవ్వకపోవడం గమనార్హం. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భృతి అందడం ఎడారిలో ఎండమావిగానే మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా ‘నిరుద్యోగ భృతి’ అందిస్తామని టీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ రెండేళ్ళయినా వివిధ కారణాలతో అమలుకు నోచుకోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెల 28న పార్టీ కార్యాలయంలో “రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారు” అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటికి రెండు వారాలు గడిచింది. సీఎం నుంచి నిరుద్యోగ భృతికి సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కేటీఆర్ కూడా దీనిపై మరోసారి ప్రస్తావన తేలేదు. నిరుద్యోగులు కేటీఆర్ చేసిన ప్రకటన పట్ల పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా ఆయన మాటలను మాత్రం నిశితంగానే గమనిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3,016 చొప్పున ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో చాలా మంది చదువుకున్నవారు నిరుద్యోగులుగా ఉన్నారని, వారిని గుర్తించడంలోనే చాలా సమస్య ఉన్నదని పేర్కొన్నారు. వీరి గుర్తింపు సులభమైన టాస్క్ కాదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో అంచనా ఉందని, అయితే ఆ సంఖ్య ఎప్పటికీ ఒకే తీరులో ఉండదని, మారుతూ ఉంటుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినట్లయితే ఆ సంఖ్యలో తేడా వస్తుందన్నారు.

నిరంతరం ఈ సంఖ్య మారుతూ ఉంటుంది కాబట్టి కొత్తగా ఉద్యోగం వచ్చినవారు, ఉద్యోగంలో చేరిన తర్వాత పోయినవారు.. ఇలా లెక్కల్లో మార్పులు వస్తూనే ఉంటాయని ఆ సభలో కేసీఆర్ వివరించారు. ఈ అంశాన్ని చాలా లోతుగా చర్చించామని, ఆ తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కానీ నిర్దిష్టంగా ఎంత మంది ఉన్నారో గుర్తింపు చేసిన తర్వాత మాత్రమే తేలుతుందన్నారు. అయితే ఇలాంటి నిరుద్యోగులను గుర్తించిన తర్వాత వారికి నష్టపరిహారం ఏ తీరులో చెల్లించాలో విధివిధానాలు, మార్గదర్శకాలు తయారవుతాయని వివరించారు. కానీ రెండేళ్ళయినా దాని మీద ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరగలేదు.

నాడు కేసీఆర్… నేడు కేటీఆర్

ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చినా గతేడాది బడ్జెట్‌లో ‘నిరుద్యోగ భృతి’ కోసం ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు. అప్పుడే విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత పార్టీలో మళ్ళీ ‘నిరుద్యోగ భృతి’పై చర్చ జరగడం, దానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్ ‘రెండు మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండేళ్ళ క్రితం హామీ ఇచ్చినా అమలులోకి రాని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న నిరుద్యోగులు కేటీఆర్ మాటలు కూడా తండ్రి తరహాలోనే ఉన్నాయని, రెండు రోజుల్లో అని చెప్పినా ఇప్పుడు రెండు వారాలు దాటినా ఎలాంటి ప్రకటన చేయలేదని, కేటీఆర్ కూడా దాని గురించి మర్చిపోయారని అభిప్రాయపడ్డారు.

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన పలు హామీలపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. కేసీఆర్ హామీలెన్నో అమలుకు నోచుకోకుండా పోయాయని, ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలు కూడా అలాంటివేనని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ హామలను మర్చిపోతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరహాలోనే ఇప్పుడు కేటీఆర్ కూడా రెండు రోజుల్లో అనే హామీ ఇచ్చి ఇప్పుడు రెండు వారాలైనా దాని గురించే నోరెత్తడంలేదని నిరుద్యోగి ఒకరు ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళినా ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందువల్ల నిరుద్యోగ భృతి హామీ గురించి ఇప్పుడు ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది’ అని తప్పించుకునే అవకాశం లేకపోలేదని తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News