స్వశక్తి సంఘాలకు సర్కారు బాకీ
స్వశక్తి సంఘాలకు సర్కారు బాకీ పడింది. సకాలంలో అప్పు చెల్లిస్తే వడ్డీ తిరిగి ఇస్తామని ఊదరగొట్టి తీరా సమయానికి వడ్డీ డబ్బులు విడుదల చేయడం లేదు. ఎన్నికల సమయంలో పాత వడ్డీని విడుదల చేసింది. తిరిగి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అప్పు సక్రమంగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వస్తుందనే ఆశతో ప్రతి నెలా రీ పేమెంట్ చేస్తున్నా సర్కారు మాత్రం నిర్లక్ష్యమే వహిస్తోంది. ఫలితంగా ఇప్పటి వరకు రూ.3,250 కోట్లు మహిళలకు బకాయి […]
స్వశక్తి సంఘాలకు సర్కారు బాకీ పడింది. సకాలంలో అప్పు చెల్లిస్తే వడ్డీ తిరిగి ఇస్తామని ఊదరగొట్టి తీరా సమయానికి వడ్డీ డబ్బులు విడుదల చేయడం లేదు. ఎన్నికల సమయంలో పాత వడ్డీని విడుదల చేసింది. తిరిగి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అప్పు సక్రమంగా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వస్తుందనే ఆశతో ప్రతి నెలా రీ పేమెంట్ చేస్తున్నా సర్కారు మాత్రం నిర్లక్ష్యమే వహిస్తోంది. ఫలితంగా ఇప్పటి వరకు రూ.3,250 కోట్లు మహిళలకు బకాయి పడింది. స్త్రీనిధి రుణాల నిబంధనలు కూడా ఇబ్బందికరంగా మారాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం 2018 అక్టోబర్ నుంచి మహిళా సంఘాలకు వడ్డీని రీయింబర్స్ చేయడం లేదు. వడ్డీ రాయితీ అందకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో గతంలో డ్వాక్రా పథకాన్ని ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని అమలులోకి తెచ్చారు. తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అమల్లోకి తెచ్చాయి. ఇందులో వడ్డీని మినహాయించడం కాకుండా తొలుత రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే, తర్వాత ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వం తిరిగి మహిళలకు అందజేసేలా నిబంధన విధించారు. మొదట్లో ఇది బాగానే సాగినా రెండేండ్ల నుంచి మాత్రం వడ్డీ సొమ్ము అందడం లేదు. స్త్రీ నిధి రుణాలు తీసుకున్న మహిళలపై మరింత భారం పెడుతున్నారు. దీనిలో ఏకంగా వడ్డీ రాయితీని రూ. 50 వేల రుణాలకే పరిమితం చేశారు. అంతకంటే రూపాయి ఎక్కువ రుణం తీసుకున్నా వడ్డీ రాయితీకి అనర్హులు. స్త్రీనిధి నుంచి వ్యాపారం కోసం తీసుకునే రుణాలలోనూ పలు ప్రయోజనాలను ఆపేశారు. గొర్రెలు, బర్రెలు కొనుగోలుకు గత ప్రభుత్వాలు బీమాను ఇచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నిలిపివేసింది.
వడ్డీ భారంతో సతమతం
మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు ప్రతి త్రైమాసికానికి వడ్డీ రాయితీని విడుదల చేసేవారు. 2014 తర్వాత దీన్ని ఆరు నెలలకు పెంచారు. ఆ తర్వాత ఏడాదికోసారి మాత్రమే విడుదల చేస్తామని ఉత్తర్వులిచ్చారు. 2018 తర్వాత ఇవ్వడం ఆపేశారు. దీంతో ఏండ్లుగా వడ్డీ పెండింగ్ పడుతూనే ఉంది. నిబంధనల ప్రకారం ఒక్కరోజు ఆలస్యమైనా వడ్డీ రాయితీ వర్తించదు. దీంతో మహిళలు ప్రతినెలా నిర్ణీత సమయంలో కిస్తీలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ సొమ్మును మాత్రం ఏండ్ల నుంచి ఇవ్వడం లేదు. దీంతో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టి వడ్డీతో సహా రుణం చెల్లించేసినా వడ్డీ సొమ్ము రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణంతో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నామని, వడ్డీ తమకు భారంగా మారిపోతోందని చెబుతున్నారు. త్వరగా వడ్డీ సొమ్మును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ మహిళా గ్రూపులకు, వికలాంగుల సంఘాలకు 2018 డిసెంబర్ నుంచి.. ఎస్సీ, ఎస్టీ గ్రూపులకు 2019 జనవరి నుంచి వడ్డీ సొమ్ముల చెల్లింపు నిలిచిపోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.6 లక్షల మహిళా సంఘాలకు బకాయిలు రూ.3250 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో 4.6 లక్షల సంఘాల్లో మొత్తం 47 లక్షల మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలన్నీ ఇప్పటి వరకు రూ. 10 వేల కోట్ల అప్పులు తీసుకున్నాయి. 2017–18లో మహిళా సంఘాలకు రూ.6,979.56 కోట్లు రుణాలిచ్చారు. వాటిని వడ్డీతో సహా చెల్లించారు. ఆ తర్వాత 2019–20, 2020–21లో మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణాలు రూ. 10 వేల కోట్లకు చేరాయి. వీటికి 12.5 శాతం వడ్డీని సంఘాలు చెల్లిస్తున్నాయి. ఈ 12.5 శాతం ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వడం లేదు.
ఎన్నికల ముందు ఇచ్చారు
2015 నుంచి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలపై నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. 2018 వరకు కూడా రూ. 1900 కోట్ల వడ్డీని పెండింగ్ పెట్టింది. అదే సమయంలో ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1900 కోట్లను రిలీజ్ చేసింది. దీనిలో కూడా రూ. 930 కోట్లకు ఫ్రీజింగ్ విధించింది. మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో వారి ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల తర్వాత పాత కథే. గతంలో మహిళా సంఘాలవారీగా పొదుపు చేసిన సొమ్ము ఆధారంగా రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. పలు కారణాలతో బ్యాంకర్లు మహిళా సంఘాలకు రుణాలను సరిగా మంజూరు చేయడం లేదు. దీంతో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యం నీరుగారిపోతోంది.
నిర్వీర్యం చేస్తున్నారా?
మహిళా సంఘాలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సంఘాలకు ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు అప్పగిస్తామని 2018లో ప్రకటించిన సీఎం కేసీఆర్ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ప్రభుత్వం వడ్డీ బకాయిలకు నిధులివ్వకపోవడంతో ఒక్కో సంఘం ఇప్పటికే బ్యాంకులకు వడ్డీ రూపంలో అదనంగా రూ. 60 వేల నుంచి రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 2018-19,2019-20 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ మాఫీ పూర్తిగా అందాల్సి ఉన్నది. వరుస ఎన్నికలు, అనంతరం ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రస్తుతం కరోనా ఆర్థిక మాంద్యం అంటూ ఈసారి కూడా వడ్డీ బాకీ విడుదల చేయడం లేదు. దీంతో మహిళా సంఘాలను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారా… అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.