పల్లె ప్రగతి నిధుల్లో కోత.. పంచాయతీ కార్మికుల వేతనాలు ఎలా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు విడుదల చేసే పల్లె ప్రగతి నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టింది. ప్రతినెలా రూ. 339 కోట్లను విడుదల చేసే సర్కారు.. ఈ నెల మాత్రం రూ. 273 కోట్లకు పరిమితం చేసింది. అయితే తొలి త్రైమాసికానికి సంబంధించిన పద్దుగా ఉత్తర్వుల్లో సూచించారు. వాస్తవంగా గతంలో కూడా ఎంతో కొంత తగ్గిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి ఇచ్చిన రూ. 273 కోట్లలో పంచాయతీలకు మరింత కోత పెట్టారు. మొత్తం […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు విడుదల చేసే పల్లె ప్రగతి నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టింది. ప్రతినెలా రూ. 339 కోట్లను విడుదల చేసే సర్కారు.. ఈ నెల మాత్రం రూ. 273 కోట్లకు పరిమితం చేసింది. అయితే తొలి త్రైమాసికానికి సంబంధించిన పద్దుగా ఉత్తర్వుల్లో సూచించారు. వాస్తవంగా గతంలో కూడా ఎంతో కొంత తగ్గిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి ఇచ్చిన రూ. 273 కోట్లలో పంచాయతీలకు మరింత కోత పెట్టారు. మొత్తం నిధులను పల్లె ప్రగతి కింద చూపిస్తున్నా… ఇందులో మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కేటాయించారు. దీనిలోనూ అత్యధికంగా 15వ ఆర్థిక సంఘం నిధులే ఉన్నాయి. అయితే పంచాయతీల కోసం విడుదల చేసిన ఈ నిధుల్లో 80 శాతం పంచాయతీల ఖాతాలకు రావు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు, ట్రాక్టర్ల ఈఎంఐలకే ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటోంది.
భారీగా తగ్గింది..
గ్రామ పంచాయతీల్లో నిర్వహణ, కార్మికుల జీతాలు, ఇతర పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి కింద నిధులను కేటాయిస్తోంది. అయితే ప్రతి పంచాయతీకి కనీసం రూ. 2 లక్షలు రావాలని లక్ష్యంతో లెక్కలేసి రూ. 339 కోట్లను నెలనెలా ఇచ్చేలా నిర్ణయించారు. ముందుగా కొంత మేరకు రూ. 339 కోట్లు ఇచ్చినా.. కొన్ని సందర్భాల్లో తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా మే నెలకు సంబంధించిన నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 273 కోట్లు విడుదల చేయగా.. ఇందులో గ్రామ పంచాయతీలకు రూ. 232.06 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 27.28 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ. 13.65 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామాలకు నిధులు కోత పెట్టినట్లు అయింది.
కాగా ప్రస్తుతం రూ. 273 కోట్లను తొలి త్రైమాసికంలో భాగంగా ఈ నెలకు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. అయితే పంచాయతీలకు ఇచ్చే ఈ నిధుల్లో సింహభాగం విద్యుత్ఛార్జీలకు, ట్రాక్టర్ల ఈఎంఐలకే వెళ్లనున్నాయి. దీంతో పంచాయతీల్లో కార్మికులకు మళ్లీ వేతన కష్టాలు తప్పేలా లేవు. ప్రతి పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లుగా గుర్తిస్తూ వారికి పల్లె ప్రగతి నిధుల నుంచే వేతనాలు ఇవ్వాలని ఆదేశాలున్నాయి. కానీ ఇప్పుడు ఈ నిధుల నుంచి వేతనాలు ఇవ్వడం కష్టంగా మారుతోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో పంచాయతీల్లో పన్నులు కూడా వసూలు కావడం లేదు.
దీంతో ఈసారి కూడా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తప్పవు. మరోవైపు పనులు చేసిన కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పటి వరకు బిల్లులన్నీ పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం పల్లె ప్రగతి కోసమే 15వ ఆర్థిక సంఘంతో పాటు ఆయా విభాగాల నుంచి నిధులను సర్దుబాటు చేసిన ప్రభుత్వం.. బిల్లులు జారీ చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో పనులు చేసి, దాదాపు రూ. 1300 కోట్ల బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పట్లో బిల్లులు వచ్చేది కష్టమే.