సాయమా.? తాయిలమా.?
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో వచ్చిన వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల ఆర్థిక సాయం దారి తప్పుతోంది. బాధితులను గుర్తించి సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. స్థానికంగా ఉన్న పార్టీ నేతల పెత్తనమే కొనసాగుతోంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును ప్రభుత్వానికి బదులుగా పార్టీల నేతలు సొంత జేబుల్లోంచి ఇస్తున్న తీరులో పంపిణీ జరుగుతోంది. వరదలతో నష్టపోయినందుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో వచ్చిన వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల ఆర్థిక సాయం దారి తప్పుతోంది. బాధితులను గుర్తించి సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. స్థానికంగా ఉన్న పార్టీ నేతల పెత్తనమే కొనసాగుతోంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును ప్రభుత్వానికి బదులుగా పార్టీల నేతలు సొంత జేబుల్లోంచి ఇస్తున్న తీరులో పంపిణీ జరుగుతోంది.
వరదలతో నష్టపోయినందుకు ప్రభుత్వం ఇస్తున్న సాయం పార్టీ తరఫున ఇస్తున్నదనే అభిప్రాయం వచ్చేలా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులు, ప్రభుత్వ సిబ్బంది లేకుండా స్థానికంగా ఉన్న అధికార పార్టీల నేతల చేతుల మీదుగా నగదు పంపిణీ జరుగుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఇస్తున్న లంచం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్టం జరగని కుటుంబాలకు కూడా ‘సాయం’ చేస్తున్న నేతలు లబ్ధిదారుల ఆధార్ కార్డు నెంబర్లను తీసుకుని సగం మాత్రమే ఇచ్చి మిగిలినదాన్ని నొక్కేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. సాయం అందించడానికి స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన ఒక జీహెచ్ఎంసీ అధికారి, రెవెన్యూ అధికారితో కూడిన కమిటీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కమిటీలు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీల నేతలే ఏ కాలనీకి, ఏ గల్లీకి సాయం ఇవ్వాలో నిర్ణయిస్తున్నారు. దీంతో చాలాచోట్ల నిజమైన బాధితులకు సాయం అందడం లేదని అంటున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల ముందు, ఎమ్మెల్యే ఆఫీసుల ముందు ధర్నాలు, నిరసనలు జరగడమే ఇందుకు నిదర్శనం. వరదలు ఎక్కువగా చోటుచేసుకున్న రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సనత్ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, మేడ్చల్, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల కాలనీల ప్రజలు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంటిని కూడా బాధితులు ముట్టడించారు.
నష్టం జరగకున్నా
వరదలు వచ్చిన కాలనీల్లో కింది అంతస్తుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వస్తువులు నీటిలో మునిగిపోయాయి. పై అంతస్తుల్లో ఉన్నవారికి ఎలాంటి నష్టమూ జరగలేదు. అయినా వారిని బాధిత కుటుంబాల జాబితాలో చేర్చారు. ఇందుకు రాజకీయ ప్రయోజనం ఒక కారణం కాగా, ముందుగానే యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పది వేల రూపాయల్లో కొంత కమీషన్‌గా తీసుకునే తెరవెనక భాగోతం మరొక అంశం. అసలు సాయమే రాదనుకున్నవారు వచ్చినకాడికి సంతోషమే అనుకుంటూ దీనికి తలూపుతున్నారు. లాలాపేటలో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నాగరాజ్ అత్యుత్సాహంతో బాధిత కుటుంబాలకు సాయాన్ని పంచిపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు బస్తీలో వెంకటేష్ గౌడ్ అనే టీఆర్ఎస్ నాయకుడు డబ్బులు పంచిపెట్టారు. నల్లకుంటలోని పద్మాకాలనీ లాంటి ప్రాంతాల్లో వరద కారణంగా ఇంట్లో సామాను నష్టపోయిన కుటుంబాలకు జీహెచ్ఎంసీ సాయం ఇవ్వడానికి ముందుకొచ్చినా స్థానిక టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని అందకుండా చేసినట్లు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార పార్టీ నేతలు పెత్తనం చేస్తుండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పార్టీ నేతలను ప్రశ్నించలేక, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ తొలుత ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. 3.87 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంది. మంత్రి కేటీఆర్ కూడా అక్టోబరు 31 తర్వాత పంపిణీ ఉండదని ప్రకటించారు. గడువంటూ ఏమీ లేదని, బాధిత కుటుంబాలందరికీ అందేంత వరకు ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. స్థానిక నేతల జోక్యంతో లక్ష్యం అటకెక్కుతోంది.