పిల్లల కడుపుకొడుతున్న ఆ అంగన్‌వాడీ..
దిశ, బాల్కొండ : కరోనా మహమ్మారి మొదటి, రెండవ దశలలో విలయతాండవం చేసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అతలాకుతలం చేసింది. కరోనా మూడో దశ ముప్పు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ సారి కరోనా ప్రతాపం పిల్లలపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెప్పినట్టుగానే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటే, దానిని తట్టుకునే శక్తి పిల్లలకు ఉండకపోవచ్చు. […]
దిశ, బాల్కొండ : కరోనా మహమ్మారి మొదటి, రెండవ దశలలో విలయతాండవం చేసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అతలాకుతలం చేసింది. కరోనా మూడో దశ ముప్పు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ సారి కరోనా ప్రతాపం పిల్లలపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెప్పినట్టుగానే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటే, దానిని తట్టుకునే శక్తి పిల్లలకు ఉండకపోవచ్చు. ఈ దశలో పిల్లలలో పోషణ శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, వాటి అమలులో చిత్త శుద్ది లేక పిల్లలకు సరియైన పోషకాలు అందకపోవడం కలవర పెట్టే విషయం..
పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు పదహారు గుడ్లు, పాలు, బాలమృతం వంటి తదితర సరుకులు పంపిణీ చేయాలని సూచించింది. అయితే భీమ్‌గల్ మండలంలోని పలు గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని అంగన్‌వాడీల్లో అయితే ఏకంగా రెండు నెలలకు ఒకసారి గుడ్లు ఇచ్చే పరిస్థితి తయారు అయ్యింది. ప్రతి నెల పిల్లలకు అందించాల్సిన గుడ్లు రెండు నెలలకు ఒకసారి ఎందుకు ఇస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రశ్నిస్తే పై నుంచే రావడం లేదని చెబుతున్నారు.
పట్టించుకోని అధికారులు…
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పసి పిల్లలకు పౌష్టికాహారం అందించి వారిని బలవర్దకంగా తయారు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని అంగన్‌వాడీల్లో పసి పిల్లలకు ఇవ్వాల్సిన సరుకులను కూడా మాయం చేస్తున్నారు. నెల నెల పిల్లలకు ఇవ్వాల్సిన సరుకులు పక్క దారి పడుతున్నాయి. కొందరు అంగన్‌వాడీ టీచర్‌లు పిల్లలకు ఇచ్చే సరుకులను పక్కదారి పట్టించి, పసి పిల్లల కడుపు కొడుతూ వారి కడుపు నింపుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలపై అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేపట్టి పిల్లలకు పంపిణీ చేయాల్సిన సరుకులు సక్రమంగా ఇప్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.