సమయం లేదు.. కనీసం కొబ్బరికాయైనా కొట్టండి!

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: ‘స‌మయంలేదు.. ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. డివిజ‌న్ అభివృద్ధికి కేటాయించిన నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోండి. వెంటనే ప‌నుల‌ను ప్రారంభించండి.. క‌నీసం కొబ్బరికాయైనా కొట్టండి.. బిల్లులు మేమే ఇప్పిస్తామంటూ కాంట్రాక్ట‌ర్ల‌ల‌కు న‌చ్చచెప్పండి.. లేకుంటే ప‌నులు పెండింగ్‌లో ప‌డితే ఇక అంతే.. ఈలోపు పాల‌క‌వ‌ర్గం కాలం ముగుస్తుంది’ అంటూ కార్పొరేట‌ర్ల‌కు పెద్ద‌లు సూచిస్తున్నారు. ‌ రెండు నెల‌ల్లో రూ.350కోట్ల పనులకు అనుమ‌తులు.. వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ పాల‌క‌వ‌ర్గం ప‌ద‌వీ కాలం ముగింపు ద‌శ‌కు చేర‌డంతో […]

Update: 2021-01-20 12:59 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: ‘స‌మయంలేదు.. ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. డివిజ‌న్ అభివృద్ధికి కేటాయించిన నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోండి. వెంటనే ప‌నుల‌ను ప్రారంభించండి.. క‌నీసం కొబ్బరికాయైనా కొట్టండి.. బిల్లులు మేమే ఇప్పిస్తామంటూ కాంట్రాక్ట‌ర్ల‌ల‌కు న‌చ్చచెప్పండి.. లేకుంటే ప‌నులు పెండింగ్‌లో ప‌డితే ఇక అంతే.. ఈలోపు పాల‌క‌వ‌ర్గం కాలం ముగుస్తుంది’ అంటూ కార్పొరేట‌ర్ల‌కు పెద్ద‌లు సూచిస్తున్నారు. ‌

రెండు నెల‌ల్లో రూ.350కోట్ల పనులకు అనుమ‌తులు..

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ పాల‌క‌వ‌ర్గం ప‌ద‌వీ కాలం ముగింపు ద‌శ‌కు చేర‌డంతో చేప‌ట్టే అభివృద్ది ప‌నుల్లో వేగం పెంచారు. గ‌త నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఎన్న‌డూ చేప‌ట్ట‌ని ప‌నులు ఈ ఆరు నెల‌ల్లో చేసి చూపించాల‌న్న ల‌క్ష్యంతో కార్పొరేటర్లు దూసుకెళుతున్నారు. మార్చి 14తో పాల‌క వ‌ర్గం కాలం ముగుస్తోంది. దీంతో గ‌త రెండు నెల‌ల్లోనే మూడు స‌ర్వ‌స‌భ్య న‌మావేశాలు నిర్వ‌హించి సూమారు 600 అభివృద్ధి ప‌నుల‌కు రూ.350కోట్లు మంజూరుచేస్తూ పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు మంజూరు చేశారు. వీటికితోడు ఒక్కో కార్పొరేట‌ర్‌కు రూ.5ల‌క్ష‌ల ప‌నుల‌ను నామినేష‌న్ ప‌ద్ద‌తిన కేటాయించారు. ప్ర‌తి డివిజ‌న్‌లో క‌నీసం రూ.3నుంచి రూ.6కోట్ల ప‌నులు చేప‌ట్టేలా ప్ర‌ణాళిక రూపొందించారు.

సమీపిస్తున్న ఎన్నిక‌లు..

ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి బ‌హుశా ఫిబ్ర‌వ‌రి మొద‌టి లేదా రెండో వారంలో నోటిఫికేష‌న్ రావ‌చ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నోటిఫికేష‌న్ విడుద‌లైతే కొత్త ప‌నులు చేప‌ట్టేందుకు నెల రోజుల‌ పాటు అవ‌కాశం ఉండ‌దు. పాత ప‌నుల‌నే కొన‌సాగించ‌వ‌చ్చు. అందుకే క‌నీసం కొబ్బరికాయైనా కొట్టి అన్ని ప‌నుల‌ను ప్రారంభించండి. త‌ర్వాత వాటిని య‌థావిధిగా పూర్తి చేయ‌వ‌చ్చు. లేకుంటే నష్టాలు త‌ప్ప‌వు అంటూ అధికార‌పార్టీ పెద్ద‌కు కార్పొరేట‌ర్ల‌కు హిత‌బోద చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిధుల‌కు కొర‌త లేదు. ప్ర‌తి నెల రూ.75కోట్లు న‌గ‌ర పాల‌క సంస్థ ఖజానాకు జ‌మ అవుతున్నాయి. వీటికి తోడు ఇత‌ర నిధులు కూడా బ‌ల్దియాకు భారీగానే వ‌స్తున్నాయి. కార్పొరేట‌ర్లు చొర‌వ చూపి వారి డివిజ‌న్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్కరూ ముందుకు సాగాలంటూ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.‌

స‌గం ప‌నులు పెండింగ్‌లోనే..

మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ అభివృద్ధికి రెండు నెల‌ల్లో కేటాయించిన రూ.350కోట్ల‌లో క‌నీసం స‌గం ప‌నులు కూడా ప్రారంభ‌మే కాలేదు. చాలా ప‌నుల‌కు టెండ‌ర్ ప్ర‌క్రియ‌కూడా పూర్తి కాలేదు. టెండ‌ర్ ప్రక్రియకు క‌నీసం 15నుంచి 20 రోజుల స‌మ‌యం పడుతుంది. టెండ‌ర్లు పూర్తి అయ్యేస‌రికే ఎల‌క్ష‌న్ కోడ్ వ‌స్తుంది. అప్పుడు ప‌నులు ప్రారంభించ‌డం సాధ్యం కాదు. ఎల‌క్ష‌న్‌లు పూర్తి అయిన వెంట‌నే ప‌నులు ప్రారంభిద్దామా అంటే అప్ప‌టికీ కేవ‌లం 15రోజుల ప‌ద‌వీ కాల‌మే ఉంటుంది. ఈ ప‌రిస్థితిలో ప‌నులు ఎట్లా పూర్తి చేయాలో తెలియ‌క కార్పొరేట‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌తోనే డివిజన్ల‌లో ఇప్ప‌టికే త‌లెత్తుకోలేక‌పోతున్నామ‌న్న బాధ కార్పొరేట‌ర్ల‌లో ఉంది. వారు ఇష్టానుసారంగా రోడ్లు త‌వ్వి వ‌దిలేయ‌డంతో స్థానికుల‌తో స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంపై ప‌లువురు కార్పొరేట‌ర్లు కౌన్సిల్ స‌మావేశంలోనే ఏక‌రువు పెట్టినా పట్టించుకునేవారే క‌రువ‌య్యారు.

కాంట్రాక్ట‌ర్‌ల‌కు న‌చ్చ‌జెప్పండి..

డివిజ‌న్‌ల‌లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్ట‌ర్‌లు ముందుకు రాక‌పోతే వారికి న‌చ్చ‌జెప్పాలని కార్పొరేటర్లకు బడానేతలు సూచిస్తున్నారు. బిల్లులు ఇప్పిస్తామంటూ హామీ ఇవ్వాలని ఇటీవ‌ల జ‌రిగిన బ‌ల్దియా పాల‌క స‌మావేశంలో ఒక ఎమ్మెల్యే హిత‌బోద చేశారు. ఏ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఆ డివిజ‌న్‌లో జ‌రిగే ప‌నుల‌కు బాధ్య‌త వ‌హించాలి. అప్ప‌డే ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతాయంటూ ఆయ‌న వెల్లడించారు. కౌన్సిల్‌లో ఆమోదం తెలిపినంత మాత్రాన ప‌నులు కావంటూ పేర్కొన్నారు.

ప‌నులు సాగేదెట్లా..

అభివృద్ధి ప‌నులు సాగేదెట్లా అంటూ కార్పొరేట‌ర్లు అంత‌ర‌మ‌థ‌నంలో ప‌డ్డారు. ఒక‌వైపు ముగుస్తున్న ప‌ద‌వీకాలం.. మ‌రోవైపు ముంచుకొస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు. ఈ రెండింటి మ‌ధ్య కార్పొరేట‌ర్లు న‌లిగిపోతున్నారు. ఏవైనా ప‌నులు ప్రారంభిస్తే అవి మ‌ధ్య‌లోనే ఆగిపోతే వ‌చ్చే ఎన్నికల్లో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు పోయి ఓట్లు అడిగేదెలా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

Tags:    

Similar News