అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత, రోడ్డుపై బైఠాయించి నిరసన
దిశ, ఏపీ బ్యూరో: అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాహనాలను పంపాలని రైతుల ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఈ వాహనాలతో పాదయాత్ర నడుస్తుందని.. ఇప్పుడు వచ్చిన […]
దిశ, ఏపీ బ్యూరో: అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాహనాలను పంపాలని రైతుల ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఈ వాహనాలతో పాదయాత్ర నడుస్తుందని.. ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటని రైతులు ప్రశ్నించారు.
అయినప్పటికీ పోలీసులు వెనక్కితగ్గకపోవడంతో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నిరసనకు పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు మద్దతు పలికారు. అమరావతి రైతుల నిరసనతో పొదలకూరు మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహాపాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తిరుమలేశుడే చూసుకుంటాడు
ప్రజల అండదండలతో మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతుందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మహాపాదయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని…పాదయాత్ర చేస్తున్న వారిని ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రైతుల పాదయాత్రను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం, క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన రథాలను పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు.
పాదయాత్ర చేసిన రైతులు, మహిళలు రాత్రి బస చేయకుండా ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టించారని రాత్రి టెంట్‌లు సైతం తీయించి వేశారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా వేసిన టెంట్‌లను తొలగించి వేశారని ధ్వజమెత్తారు. ఈ పాదయాత్ర తిరుమలేశుడి చెంత వరకు జరుగుతుందని..ఈ ఎమ్మెల్యే సంగతి ఆ తిరుమలేశుడే చూసుకుంటాడని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు.