ఆంక్షలు మరింత కఠినం చేయాలి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీవ్: రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ latest telugu news..
కీవ్: రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇటాలియన్ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 'మహమ్మారి సమయంలో ఉక్రెయిన్ ప్రజలు మీకు సహాయం గా నిలిచారు. మేము డాక్టర్లను పంపించాం. అంతేకాకుండా వరదల సమయంలోనూ ఇటాలియన్లు మాకు సాయం చేశారు. మేము కృతజ్ఞులము. గత 27 రోజులుగా కొనసాగుతున్న దురాక్రమణను ఆపడానికి మరిన్ని ఆంక్షలు కావాలి' అని అన్నారు. కాగా, సభ ప్రారంభం లో, ముగింపు సమయంలో పార్లమెంటు సభ్యుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. రష్యాకు భయపడుతున్నామని ఒప్పుకోవాలని నాటోను జెలెన్ స్కీ విమర్శించారు. నాటో మమ్మల్ని ఆహ్వానిస్తుందో లేదా, రష్యాకు భయపడుతుందో బహిరంగంగా ఒప్పుకోవాలి' అని అన్నారు.
పోప్ ఫ్రాన్సిస్‌తో ఫోన్ సంభాషణ
రష్యా దురాక్రమణ నేపథ్యంలో మంగళవారం ఉదయం పోప్ ఫ్రాన్సిస్ జెలెన్ స్కీతో ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ముఖ్యంగా సామాన్యులు ఎదుర్కొంటున క్లిష్ట పరిస్థితులు, రష్యన్ దళాలచే రెస్క్యూ కారిడార్ల నిరోధించడం గురించి చర్చించినట్లు తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు వాటికన్ సిటీ మధ్యవర్తిత్వం తీసుకుంటే ప్రశంసనీయమని అన్నారు.
15,300 రష్యా సైనికులు హతం
గత 27 రోజులుగా కొనసాగుతున్న యుద్దం లో 15,300 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. 509 రష్యన్ యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా 222 విమానాలు, 123 హెలికాప్టర్లను నేల కూల్చినట్లు పేర్కొంది. మరోవైపు 1,556 సాయుధ దళాల తరలింపు వాహనాలు, 252 ఫిరంగులు, 80 మల్టీపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అయితే వీటిపై రష్యా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అవదివ్కాలో కాల్పులు, ఐదుగురు మృతి
వేర్పాటువాదుల ప్రాంతంగా పేర్కొంటున్న దొనెట్సక్‌లో రష్యా ఫిరంగులు, వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఈ దాడుల్లో ఐదుగురు చనిపోగా, 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడులు జరిగాయని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు తూర్పున ఉన్న అవదివ్కా రష్యా అనుకూలవాదుల రాజధానిని అనుకుని ఉంది.