బట్టీల్లోనే మగ్గిపోతున్న బాల్యం.. అనుమతులు లేకున్నా యథేచ్చగా నిర్వహణ..!
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లాలో అనుమతులు లేకున్నా ఇటుక బట్టీలు యథేచ్చగా నిర్వహిస్తున్నారు.- latest Telugu news
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లాలో అనుమతులు లేకున్నా ఇటుక బట్టీలు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకుంటున్నారు. బాల కార్మిక చట్టం ప్రకారం.. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవద్దనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. దీనితో వారి బాల్యం ఇటుక బట్టీల్లోనే బందీ అయిపోతుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారంలో నిబంధనలకు విరుద్ధంగా రహదారికి పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. బట్టీల్లో చిన్నారులతో పనులు చేయిస్తూ.. బట్టీల్లోనే వారి బాల్యాన్ని బుగ్గి చేస్తున్నారు. ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూరమవుతున్నాయి. చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు.. ఇటుకలు మోస్తూ బట్టీల్లోనే మగ్గిపోతున్నారు.
యజమానులు చిన్నారులను శ్రమ జీవులుగా మారుస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖ సిబ్బందితో చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బడికి వెళ్లకుండా బట్టీల్లోనే పనులు చేస్తూ కనిపించడంతో వారిని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో కూడా చాలా వరకు బట్టీల్లో పని చేస్తున్న చిన్నారులనే గుర్తించారు. రోడ్డు పక్కనే బట్టీలను నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. మరోపక్క బట్టీల్లో పనిచేసే కార్మికులకు కల్పించాల్సిన కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నారలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.